Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాదాద్రిక్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్ష్మీపూజలు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌సేవ, స్వామివారికి సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులకు నిత్య పూజలు చేసి, 108 బంగారు పుష్పాలతో అర్చించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులకు అభిషేకించి తులసీ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనృసింహులను దివ్యమనోహరంగా అలంకరించి సుదర్శనహోమం, నిత్య కల్యాణోత్సవాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కార్తీకమాసం ముగుస్తుండడంతో భక్తులు అధికసంఖ్యలో యాదాద్రిక్షేత్రాన్ని సందర్శించారు. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.16,41,931 ఆదాయం సమకూరింది. యాదాద్రీశుడి ప్రధానాలయ గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడంకోసం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.వీరేందర్‌ రూ.50వేలు, యాదాద్రి దేవస్థాన సిబ్బంది వేముల ఆంజనేయులు రూ.25వేలు, హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఇనకొండ చంద్రారెడ్డి, ఆల పురుషోత్తం, భాస్కర్‌రావు, హరివర్థన్‌రావులు 160 గ్రాముల ముడి బంగారాన్ని ఈవో గీతారెడ్డికి అందజేశారు. యాదాద్రీశుడిని శుక్రవారం ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ డీఐజీ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు.  


యాదాద్రి క్షేత్రంలో 10 రోజులపాటు అన్నప్రసాద వితరణ నిలిపివేత

యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 4నుంచి 13వ తేదీ వరకు అన్నప్రసాద వితరణను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్‌.గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్డు వెడల్పు కోసం చిన్నజీయర్‌ కుటీర్‌ వద్ద ఉన్న ఏసీ షెడ్డును మార్చుతుండటంతో; భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం చివరివారంలో నిర్వహించే కార్తీక బహుళ అమావాస్య రోజున(ఈ నెల 4వ తేదీ) ఉదయం 11గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి, కార్తీక భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  

Advertisement
Advertisement