భారీ స్నాన గుండం

ABN , First Publish Date - 2021-04-11T07:42:41+05:30 IST

యాదాద్రీశున్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు అక్కడ పుణ్యసాన్నాలు ఆచరించేందుకు వీలుగా గుట్ట కింద అన్ని సౌకర్యాలతో లక్ష్మి పుష్కరిణి సిద్ధమవుతోంది.

భారీ స్నాన గుండం

  • ఒకేసారి 2500 మంది స్నానం చేసేలా 15 లక్షల లీటర్ల సామర్థ్యంతో లక్ష్మి పుష్కరిణి
  • యాదాద్రి కింద తుది దశలో నిర్మాణ పనులు
  • సీఎం సూచన మేరకు విష్ణు పుష్కరిణిలో మార్పులు
  • రథశాలలో నృసింహుడు, అమ్మవార్ల విగ్రహాలు
  • చివరి దశకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మాణ పనులు
  • విద్యుదీకరణ, ఫాల్స్‌ సీలింగ్‌, పెయింటింగ్‌ పూర్తి 
  • 3 కోట్లతో ప్రధానాలయం, మండపాల్లో విద్యుదీకరణ

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 10: యాదాద్రీశున్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు అక్కడ పుణ్యసాన్నాలు ఆచరించేందుకు వీలుగా గుట్ట కింద అన్ని సౌకర్యాలతో లక్ష్మి పుష్కరిణి సిద్ధమవుతోంది. రూ.11.5 కోట్ల వ్యయంతో గండి చెరువు వద్ద 2.47 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకమైన స్నానఘట్టాలు, మౌలిక సదుపాయాలతో నిర్మాణం జరుగుతోంది. ఒక్క పుష్కరిణినే 38,750 చదరపు అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో, 15 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. నీళ్లలో మునిగి ప్రమాదాల బారిన పడకుండా పురుషులు, మహిళలు, పిల్లల కోసం వేర్వేరుగా స్నానఘట్టాలను నిర్మిస్తున్నారు. ఈ గుండంలో ఒకేసారి 1400 మంది పురుషులు, 600 మంది మహిళలు, 400 మంది పిల్లలు.. మొత్తంగా 2500 మంది ఎలాంటి ఇబ్బందుల్లేకుండా స్నానాలు చేయొచ్చు. గుండం వద్దే ప్రత్యేకంగా షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు. మరోవైపు కొండపై ప్రస్తుతం ఉన్న విష్ణు పుష్కరిణిని ఆధునికీకరించి స్వామివారి కైంకర్యాలకోసం వినియోగించనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో విష్ణు పుష్కరిణి నిర్మాణంలో పలు మార్పులను సూచించారు. 


పుష్కరిణికి ఆనుకుని ఉన్న బండరాయిని ఏమాత్రం తాకకుండా ఆ ప్రాంతం వరకు విస్తరించాలని సూచించారు. ఆ మేరకు పుష్కరిణి దక్షిణ దిశలో ఉన్న గోడను తొలగించి సహజసిద్ధమైన రాతికొండ వరకు విస్తరించనున్నారు. కొండపైకి నడకదారిన వచ్చే భక్తులు పుష్కరిణి ముందు నుంచి దర్శన క్యూలైన్లలోకి చేరుకునేలా పనులు చేపడుతున్నారు. మరోవైపు యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకునే ప్రముఖుల విడిదికి నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. యాదగిరిపల్లి శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ నెలాఖరుకల్లా వీటి నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆర్‌ఆండ్‌బీ అధికారులు చెబుతున్నారు. కొండకు ఉత్తర దిశలోని సుమారు 13ఎకరాల విస్తీర్ణం గల గుట్టపై 105 కోట్ల అంచనా వ్యయంతో 15 విల్లాల నిర్మాణం సాగుతోంది.  విల్లాను చేరుకునేందుకు రహదారి నిర్మాణం, సూట్‌లలో విద్యుదీకరణ, ఫాల్‌ సీలింగ్‌, పెయింటింగ్‌ పనులు పూర్తి చేశారు. ఆర్‌సీసీ రక్షణ గోడలు, ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లతో పాటు తుది మెరుగులు దిద్దే పనులు చేపట్టాల్సి ఉంది. 


ప్రతిష్ఠాత్మకంగా అత్యంత ఖరీదైన అతిథి గృహాల ఇంటీరియర్‌ డెకరేషన్లు, ఫర్నిచర్‌, సెంట్రల్‌ ఏసీల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇక కొండపైన స్వామివారి రథశాలలో కోల్‌కతాకు చెందిన శిల్పులు.. ఫైబర్‌తో శంకు, చక్ర, తిరునామాలు.. స్వామివారు, అమ్మవారి విగ్రహాలను.. పాంచరాత్రాగమన శాస్త్రాన్ని తెలియజేసే శిల్పాలను రూపొందించి అమర్చారు. బ్రహ్మప్రాకార మండపంలో విద్యుదీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాలయంలో శ్రీ వైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రాన్ని తెలియజేసే తెలియజేసే పలు శిల్ప కళాఖండాలకు అధునాతన లైటింగ్‌ అమర్చారు. రూ.3కోట్ల వ్యయంతో ప్రధానాలయం, అంతర్‌, బాహ్య ప్రాకార మండపాల్లో ఆధునాతన సాంకేతిక పద్ధతుల్లో విద్యుదీకరణ పనులను నిర్వహిస్తున్నామని ఎలక్ట్రికల్‌ ఈఈ రామారావు తెలిపారు. ప్రధానాలయ అష్టభుజి అంతర్‌ ప్రాకార మండపంలో విద్యుదీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-11T07:42:41+05:30 IST