ఆశల పల్లకిలో..సర్వేకే పరిమితమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌

ABN , First Publish Date - 2020-08-04T09:59:28+05:30 IST

తెలంగాణ ఉద్యమానికి ఊపందించి, టీఆర్‌ఎ్‌సను అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి దోహదపడిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ సర్వేకే పరిమితమైంది.

ఆశల పల్లకిలో..సర్వేకే పరిమితమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌

పన్నెండేళ్లుగా పోరాటం.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు

హామీలు దాటి అడుగు ముందుకేయని పనులు


లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే తమ కష్టాలు తీరుతాయని ఎదురు చూస్తున్న రైతన్నలకు నిరాశే ఎదురవుతోంది. రిజర్వాయర్‌ను ఎన్నికల సమయంలో ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప నిర్మాణం కోసం అడుగు ముందుకు వేయడం లేదు. ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం హామీలతో కాలయాపన చేస్తోంది.


షాద్‌నగర్‌అర్బన్‌: తెలంగాణ ఉద్యమానికి ఊపందించి, టీఆర్‌ఎ్‌సను అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి దోహదపడిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ సర్వేకే పరిమితమైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమంటేనే మొదటగా గుర్తుకు వచ్చే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను ఇప్పుడు అందరూ మరిచిపోయారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు, తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార అస్త్రంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను ఉపయోగించుకుంటోందని రైతన్నలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నా.. అధికార పార్టీ నాయకులు హామీలు ఇస్తున్నా... రిజర్వాయర్‌ పనులు మాత్రం సర్వేకే పరిమితమయ్యాయి. 


నాడు మొదటి రిజర్వాయర్‌

తెలంగాణ ఇంజనీర్స్‌ ఫోరం పన్నెండేళ్ల క్రితం ప్రస్తుత జిల్లెడు-చౌదరిగూడెం మండలంలోని పద్మారం, లక్ష్మీదేవిపల్లి శివారులోనే ప్రధాన రిజర్వాయర్‌ను నిర్మించాలని పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. తెలంగాణ ఇంజనీర్ల ఫోరంలో ఉన్న ఎం.రామకృష్ణారెడ్డి, ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, కె.పెంటారెడ్డి, ఎ.ధర్మారెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 35 రోజులపాటు 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి కోయిల్‌సాగర్‌, మహ్మద్‌బాద్‌, ఇప్పలపల్లి, పద్మారం వద్ద నిర్మించతలపెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయాలని పథకాన్ని రూపొందించారు.


రూ.9,000 కోట్ల అంచనాతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 38 మండలాల్లో ఏడు లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మండలాల్లో 2.7 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలోని రెండు మండలాల్లో 30వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని రూపొందించారు. 13.5 కిలోమీటర్ల ఓపెన్‌ కాలువలు, 65 కిలోమీటర్ల టన్నెల్స్‌ ద్వారా నీటిని సముద్రమట్టానికి 675మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి కాలువల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీటిని పారించాలని ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ఈ మేరకు 2013 ఆగస్టు 8న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభు త్వం సర్వే కోసం నిధులు మంజూరు చేస్తూ జీవోను విడుదల చేసింది. 


నేడు చివరి రిజర్వాయర్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకం స్వరూపం మారిపోయింది. మొదటి అంశంగా ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ చివరి రిజర్వాయర్‌గా నెట్టబడింది. జూరాల ప్రాజెక్ట్‌ నుంచి నీటి లభ్యత ఇబ్బందిగా మారుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని తీసుకురావాలని పాలమూరు ఎత్తిపోతల పథకం స్వరూపాన్ని మార్చారు. వర్షాలు కురిసే సమయంలో 60 రోజుల్లో నిత్యం 1.5 టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీటిని తీసుకురావాలని ప్రథకాన్ని మార్చారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నార్లమూర్‌ వద్ద 8.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న అంజనగిరి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి ఏదుల వద్ద  6.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి వట్టెం వద్ద 15.27 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి కర్వేన వద్ద 15.7 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కురుమూర్తి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి 16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి చివరిగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలని పథకాన్ని రూపొందించారు.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్లు మంజూరు చేస్తూ 2015 జూన్‌ 11న కర్వేన వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభించారు. 2021 లక్ష్యంగా నార్లపూర్‌, ఏదుల, వట్టెం, కర్వేన రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు సైతం ప్రారంభమయ్యాయి. కానీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు మాత్రం సర్వేకే పరిమితమైనాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ 2, 5, 10, 14 టీఎంసీల కోసం సర్వే చేసి, వదిలేశారు.


హామీలతో కాలయాపన

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ హామీలకే పరిమితమైంది. కర్వేన వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించిన రోజు కూడా చివరిగా ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను సైతం పూర్తి చేసి షాద్‌నగర్‌, పరిగి, తాండూర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వచ్చే మూడేళ్లలో కొత్తూర్‌, షాద్‌నగర్‌ నుంచి పెబ్బేరు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా తూర్పు గోదావరి జిల్లా కంటే గొప్పగా పచ్చదనం స్వాగతం పలకాలని సీఎం కేసీఆర్‌ చెప్పి ఐదేళ్లు గడుస్తున్నా.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు ప్రారంభం కాలేదు. 


ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తున్నాయి. రిజర్వాయర్‌ను నిర్మించ తలపెట్టిన ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు జరిగాయి. పాలమూరు ప్రాజెక్ట్‌లోని ఐదు రిజర్వాయర్ల పనులను చేపట్టి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించకపోవడమేమిటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయర్‌ను వదిలివేయాలన్న ఆలోచనతోనే నేటికీ పనులను ప్రారంభించడం లేదని విమర్శిస్తున్నారు.


రిజర్వాయర్‌ నిర్మాణంపై చిత్తశుద్ధి లేదు

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంపై అధికార పార్టీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఆ తరువాత పట్టించుకోవడం లేదు. 

-వీర్లపల్లి శంకర్‌, కాంగ్రెస్‌పార్టీ షాద్‌నగర్‌ ఇన్‌చార్జి


రిజర్వాయర్‌ నిర్మిస్తేనే రైతులకు భవిష్యత్‌

షాద్‌నగర్‌ నియోజక వర్గంలో సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లు లేవు. రిజర్వాయర్‌ నిర్మిస్తేనే రైతులకు భవిష్యత్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు కూడా న్యాయం చేయాలి. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ప్రభుత్వం ఇవ్వాలి.

- బక్కని నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే


నిర్మాణం అనుమానమే...

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం అనుమానంగానే కనిపిస్తోంది. నేటికీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు పైసా కేటాయించలేదు. 

ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర తెలంగాణ విమోచన కమిటీ అధ్యక్షుడు


పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాను. రిజర్వాయర్‌ నిర్మాణం కోసం కావాల్సిన భూసేకరణ పనులు చేపట్టాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

- వై.అంజయ్యయాదవ్‌, ఎమ్మెల్యే, షాద్‌నగర్‌

Updated Date - 2020-08-04T09:59:28+05:30 IST