జైల్లోంచి లాలూ ఫోన్‌!

ABN , First Publish Date - 2020-11-26T07:01:44+05:30 IST

తమ మాట వింటే ఉన్నత పదవులిస్తామనో.. లేదంటే కోట్లలో డబ్బిస్తామనో ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని ప్రలోభపెట్టడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. మరి.. ఇలాంటి ప్రలోభాలను జైలు గోడల మధ్య ఉన్న ఓ పార్టీ అధినేత పాల్పడితే?ఈ పని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేశారన్నట్లుగా ఓ ఆడియో బయటకు

జైల్లోంచి లాలూ ఫోన్‌!

మా స్పీకర్‌ అభ్యర్థికి సహకరించండి.. సభకు డుమ్మా కొట్టండి

కూటమి అధికారంలోకొస్తే మంత్రిని చేస్తాం

బీజేపీ ఎమ్మెల్యేకు ఆర్జేడీ అధినేత ప్రలోభం


పట్నా, నవంబరు 25: తమ మాట వింటే ఉన్నత పదవులిస్తామనో.. లేదంటే కోట్లలో డబ్బిస్తామనో ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిని ప్రలోభపెట్టడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. మరి.. ఇలాంటి ప్రలోభాలను జైలు గోడల మధ్య ఉన్న ఓ పార్టీ అధినేత పాల్పడితే?ఈ పని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌  చేశారన్నట్లుగా ఓ ఆడియో బయటకు పొక్కింది. బిహార్‌ శాసనసభలో బుధవారం స్పీకర్‌ ఎన్నిక జరిగింది. ఈ పదవి కోసం అభ్యర్థులుగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నుంచి కమలం పార్టీ సీనియర్‌ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా, మహాగట్‌బంధన్‌ నుంచి అవధ్‌ బిహారీ చౌదరీ నిల్చున్నారు. అయితే తమ మహాగట్బంధన్‌ స్పీకర్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ బీజేపీకి చెందిన లలన్‌ పాసవాన్‌ అనే ఓ ఎమ్మెల్యేకు జైల్లోంచి లాలూ ఫోన్‌ చేశారంటూ సుశీల్‌ కుమార్‌ మోదీ బాంబు పేల్చారు. లాలూనే స్వయంగానే లలన్‌ పాసవాన్‌కు ఫోన్‌ చేసి మాట్లారని చెబుతూ దానికి సంబంధించిన ఓ ఆడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.


ఎన్డీయే ఎమ్మెల్యేలకు లాలూ ఫోన్లు చేస్తూ స్పీకర్‌ ఎన్నికలో తమకు సహకరిస్తే మంత్రి పదవులిస్తామంటూ ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. లాలూ మాట్లాడినట్లుగా చెబుతున్న ఆ ఆడియోలో ఏముందంటే.. ‘‘నా మాట వినండి పాసవాన్‌ జీ! రేపు జరిగే స్పీకర్‌ ఎన్నికలో మాకు మీరు సాయం చేయండి. మేం ఆ ప్రభుత్వాన్ని పడగొట్టగానే మిమ్మల్ని మంత్రిని చేస్తాం’’ అంటూ లలన్‌ పాస్‌వాన్‌తో లాలూ మాట్లాడినట్లుగా ఉంది. దీనికి లలన్‌ బదులిస్తూ ‘‘నేను, మా పార్టీ నిర్ణయానికే కట్టుబడి  ఉంటాను’’ అని స్పష్టం చేసినట్లుగా ఉంది. అక్కడితో లాలూ ఊరుకోకుండా.. ‘‘కరోనా సోకిందని మీ వాళ్లకు చెప్పి సభకు దూరంగా ఉండైనా మాకు సహకరించండి’’ అని బతిమిలాడినట్లుగా ఉంది. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు అక్కడ ఫోన్‌ సౌకర్యం ఉందని సుశీల్‌ మోదీ ఆరోపించారు. లలన్‌ పాసవాన్‌ను లాలూ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్న విషయం తన దృష్టికి  రాగానే ఆ ఫోన్‌ వచ్చిన నంబరుకు తాను తిరిగి ఫోన్‌ చేశానని, ఆవలి వైపు స్వయంగా లాలూనే లిఫ్ట్‌ చేశారని సుశీల్‌ మోదీ పేర్కొన్నారు. లాలూ నుంచి కాల్‌ వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్‌ నంబరును కూడా ట్విటర్‌లో సుశీల్‌ మోదీ పోస్ట్‌ చేశారు. 


అధికార పక్షానిదే స్పీకర్‌ పీఠం

బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార ఎన్డీయే పక్షానికి చెందిన అభ్యర్థి విజయ్‌ కుమార్‌ సిన్హా ఎన్నికయ్యారు. అధికార పక్ష అభ్యర్థి అయిన విజయ్‌ కుమార్‌కు 126 ఓట్లు రాగా.. మహాగట్‌బంధన్‌ అభ్యర్థి అవధ్‌ బిహారీకి 114 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ ఐదు స్థానాలను కైవసం చేసుకున్న మజ్లిస్‌ పార్టీ.. బీజేపీ అభ్యర్థి విజయ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఓటు వేసింది. 

Updated Date - 2020-11-26T07:01:44+05:30 IST