ఆరేళ్ల తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న లాలూ

ABN , First Publish Date - 2021-10-27T21:27:52+05:30 IST

బీహార్‌లోనే కాకుండా, దేశంలోనే అభివృద్ధి కొరవడిందని, నిరుద్యోగం ప్రబలిందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ...

ఆరేళ్ల తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న లాలూ

పాట్నా: బీహార్‌లోనే కాకుండా, దేశంలోనే అభివృద్ధి కొరవడిందని, నిరుద్యోగం ప్రబలిందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటు నితీష్ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ను తప్పుపట్టారు. రెండు అసెంబ్లీ స్థానాలకు (కుషేశ్వర్‌ స్థాన్, తారాపూర్) ఈనెల 30న ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం తారాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లాలూ పాల్గొన్నారు. ఆరేళ్ల తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్‌లో లాలూ పాల్గొనడం ఇదే ప్రథమం. తాను రెండు ఎన్నికలకు... 2019 లోక్‌సభ, 2020 అసెంబ్లీ ఎన్నికలకు దూరమయ్యాయని ఈ సందర్భంగా లాలూ పేర్కొన్నారు.


దేశంలోని ప్రతి ప్రభుత్వ  రంగాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని, బీహార్‌లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని తన ప్రసంగంలో లాలూ విమర్శించారు. ఎక్కడ చూసినా నిరుద్యోగమే తాండవిస్తోందని అన్నారు. నితీష్ కుమార్‌పై వాగ్బాణాలను సంధిస్తూ, చనిపోవడానికే సిద్ధపడతాను కానీ  బీజేపీతో చేతులు కలపనని గతంలో నితీష్ చెప్పేవారని, ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతిస్తామని చెప్పిన నితీష్‌ను తాను ఒకటేమాట అడుగుతున్నానని, ప్రత్యేక ప్రతిపత్తి ఏమైందని ప్రశ్నిస్తున్నానని లాలూ అన్నారు. రాష్ట్రంలో మధ్యపాన నిషేధం విఫలమైందని అన్నారు.


లాలూ-నితీష్ మధ్య మాటల తూటాలు

కాగా, దీనికి ముందు లాలూ ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య మాటల తూటాలు పేలాయి. బీజేపీని నిమజ్జనం చేయడానికే తాను ఇక్కడ ఉన్నట్టు లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతిగా నితీష్ మాట్లాడుతూ...''ఆయన నన్ను కాల్చిచంపొచ్చు...అంతకంటే ఏమీ చేయలేరు'' అని వ్యాఖ్యానించారు. దీనికి లాలూ మళ్లీ స్పందించారు.''నిమజ్జనం (విసర్జన్) అంటే చంపుతానని ఆయన (నితీష్) ఆలోచన కావచ్చు. నేను మిమ్మల్ని చంపను. మీకు మీరే చస్తారు'' అంటూ లాలూ తన ప్రసంగంలో పేర్కొనడంతో ఒక్కసారిగా బహిరంగ సభలో నవ్వులు వెల్లివిరిసాయి. లాలూ తన 8 నిమిషాల ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సంబంధాలు క్షీణించడంపై మాట్లాడలేదు. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 30న జరుగుతున్న రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో అర్జేడీ, కాంగ్రెస్ వేర్వేరుగా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి.

Updated Date - 2021-10-27T21:27:52+05:30 IST