గాలిలో దీపం

ABN , First Publish Date - 2020-06-05T06:09:10+05:30 IST

సామాజిక వ్యాప్తి స్థాయికి వ్యాపించిందేమోనని ఆందోళన పెరుగుతున్న సమయంలో, వచ్చే సోమవారం నుంచి జనజీవనం మరిన్ని రంగాలలో కరోనాపూర్వస్థితికి సిద్ధం కావడం– సామాన్యులకు అర్థం కాని ప్రహేళికగా కనిపిస్తున్నది...

గాలిలో దీపం

సామాజిక వ్యాప్తి స్థాయికి వ్యాపించిందేమోనని ఆందోళన పెరుగుతున్న సమయంలో, వచ్చే సోమవారం నుంచి జనజీవనం మరిన్ని రంగాలలో కరోనాపూర్వస్థితికి సిద్ధం కావడం– సామాన్యులకు అర్థం కాని ప్రహేళికగా కనిపిస్తున్నది. అనేక జీవనరంగాలలో ఆంక్షలను సడలిస్తున్నామని చెబుతూ, ప్రధానమంత్రి తన తాజాసందేశంలో ‘‘ఆలాగని ప్రమాదకరపరిస్థితులను అలక్ష్యం చేయవద్దని హితవు చెప్పారు. ఈ వైరుధ్యాన్ని సమర్థంగా నిర్వహించడం అగ్రరాజ్యాధినేతల దగ్గర నుంచి, భారతీయ పాలకుల దాకా సాధ్యం కానప్పుడు, సామాన్యులైన అసంఖ్యాకప్రజలు ఎట్లా కత్తిమీద సాము చేయగలరు? 


లాక్‌డౌన్‌ మంచిదా చెడ్డదా, మొదలే అది అమలు చేయకుండా ఉండవలసిందా? అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి. జనజీవనాన్ని స్తంభింపజేయడం అంటువ్యాధులు, గత్తరలు వ్యాపించినప్పుడు అనుసరించిన పురాతన పద్ధతుల కోవకు చెందినదే. ఊర్లను ఖాళీచేసి వెళ్లిపోవడం, మనుషులు సన్నిహితంగా సంచరించకుండా దూరం పాటించడం వంటివన్నీ వేలయేండ్ల నుంచి ఉన్నవే. కాకపోతే, ఆ రోజుల్లో వైపరీత్యాలు స్థానికమైనవి. ఒక చోట పుట్టిన వ్యాధి, సమీప ప్రాంతాల వరకే వ్యాపించేది తప్ప ఇప్పటివలె దేశాంతరాలు, ఖండాంతరాలు వెళ్లేది కాదు. మనుష్యుల సంచారానికి ఉండిన పరిమితులు జబ్బు వ్యాప్తిని కూడా అదుపులో ఉంచేవి. అమెరికాలోని స్థానిక జాతీయులలో సుఖవ్యాధులు ఉండేవి కావట. ఇండియాను అన్వేషిస్తూ, అమెరికాకు చేరిన కొలంబస్‌ ద్వారానే అవి అక్కడ మొదటిసారి వ్యాపించాయట. అంటే, అనేక జబ్బులకు దూరాభారాల పరిమితి ఉండేదన్నమాట. ఈ ప్రపంచీకరణ కాలంలో, లోకమంతా ఒక కుగ్రామంగా మారిపోయి, దావాగ్ని లాగా కరోనా వైరస్‌ వ్యాపించింది. ఈ సామీప్యం, ప్రయాణానుకూలత– వ్యాధి త్వరగా ఉపశమించకుండా అడ్డుపడుతున్నాయి కూడా.


ఆర్థిక, ఉత్పాదక కార్యాలను నిలిపివేయడం మరొక సంక్షోభం. నిలవ ఉన్న ఆహారంతోను, సంపదతోను ప్రపంచమంతా కొంతకాలం నిర్వ్యాపకంగా బతకగలదు. ఆరోగ్య అత్యవసరమో, ఉపద్రవమో వస్తే మార్గమేమిటి, నిలవలను ఖర్చుపెట్టడమే కదా? వర్షాకాలం అంతా తమకు లాక్‌ డౌన్‌ కాబట్టి, చీమలు ముందే ఆహారాన్ని నిల్వచేసుకుంటాయని మనకు తెలుసు. అట్లాగే, ఆధునిక దేశాల ధాన్యాగారాలు, కోశాగారాలు కూడా స్తంభించిన వ్యవస్థలను పోషించగలవు. అయితే, ఎంతకాలం? ఉపాధులు కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థిక సంస్థలు ఉత్పత్తులు లేక కునారిల్లిపోయినప్పుడు, సంక్షోభం వస్తుంది. అదీ వైరస్‌ కంటె చిన్నదేమీ కాదు. అయితే, ప్రపంచ ప్రజలు ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ప్రదర్శించిన క్రమశిక్షణను, సంసిద్ధతను చూసినప్పుడు, – పరస్పర సహకారంతో, కష్టసహిష్ణుతతో లాక్‌డౌన్‌ వంటి పద్ధతిని ఇంకా సుదీర్ఘకాలం అయినా కొనసాగించగలిగేవారని అనిపిస్తుంది. ధనాఢ్యులు, పారిశ్రామికులు, యజమానులు– సొంత లాభాన్ని తగ్గించుకోవడం దగ్గర నుంచి కొంత నష్టానికి సిద్ధపడడం దాకా చేయగలిగితే, సాటి ప్రజలకు చేయూతను ఇవ్వగలిగితే– ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనవచ్చు. కానీ, ఎందువల్లనో, లాక్‌డౌన్‌ తగినంతగా ఫలితాలను ఇవ్వకముందే తాళాలను తెరవడానికి ప్రపంచప్రభువులంతా ఉత్సాహపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా పాటించిన నిగ్రహాన్ని, అందించిన సహకారాన్ని, పాటించిన మౌనాన్ని ఉపయోగించుకుని – తమ రాజకీయ వ్యూహాలను నెరవేర్చుకోవడానికి, భూభౌతిక స్వార్థాలను పండించుకోవడానికి, అసమ్మతులను అణచివేయడానికి పాలకులంతా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా, సరే, ఈ లాక్‌డౌన్‌ ఊహించని, ఆశించని ఏ పర్యవసానాలకు దారితీస్తుందో అన్న భయం కూడా పెద్దలకు ఉన్నట్టుంది. 


లాక్‌డౌన్‌ వల్ల భారత్‌లో తక్షణం రోడ్డునపడ్డ వలస కార్మికుల విషయంలో, ప్రభుత్వాల కంటె మించి ప్రజా సహాయ కార్యకర్తలు, వ్యక్తులుగా, బృందాలుగా చూపించిన చొరవను ఆదర్శంగా తీసుకుంటే, అదే సమష్టితనాన్ని వ్యాధి వ్యాప్తి నిరోధంలో కూడా ఉపయోగించుకోగలిగితే, దీన్ని కనీసనష్టంతో అడ్డుకోవడం సాధ్యమే. ఇప్పుడు, అన్ని తలుపులు బార్లా తెరిచి, జీవన ప్రవాహాన్ని యథాపూర్వ స్థితికి అనుమతించినా సరే, భయంతో బిగుసుకుపోయిన సమాజ చేతన పూర్వం వలె ఉరకలెత్తదు. ఎందుకంటే, ఇప్పుడిక వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది. ఆస్పత్రులు కిటకిటలాడతాయి. రోడ్ల మీద ప్రజలు దేన్నీ లక్ష్యం చేయనివారి వలె కనిపిస్తారు కానీ, వారు తమ రెక్కలాడించడం కోసం బయటకు రాకుండా ఉండలేని పరిస్థితి. ఒంటరి క్వారంటైన్లు, నిర్జన అంత్యక్రియలు, పొరుగువారిని చూసి ప్రతిఒక్కరిలో కలిగే భయం– ఇది రానున్న రోజులలో సాధారణ పరిస్థితి కానున్నది. 


దేవుడా నీవే దిక్కు అనడంలో ఫలితమూ ఔచిత్యమూ లేదు కాబట్టి, మనమే దీపం గాలికి ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టుకోవాలి. అందరూ, అన్ని తరగతుల వారూ, అన్ని వయస్సుల వారూ, అన్ని ఆర్థిక, సామాజిక స్థాయిల వారూ, గుర్తించవలసిన విషయం, ప్రభుత్వాల లాక్‌డౌన్‌ మాత్రమే ముగిసింది. ఇక ప్రజలే తమకు తాము విధించుకోవలసిన దూరాలను, ధరించవలసిన కవచాలను, నిగ్రహించుకోవలసిన ప్రయాణాలను నిర్వచించుకోవాలి. ఆర్థికాన్ని, ఆరోగ్యాన్ని సమపాళ్లలో నిర్వహించడం ఈ దేశపు మహానాయకులకు సాధ్యం కాలేదు కానీ, పరస్పర సహకారంతో ప్రజలు ఎంతో కొంత సాధించగలరు. పెద్దలను పిన్నలను కాపాడుకోండి. పనిచేసే చోట జాగ్రత్తపడండి. పొదుపుగా ఖర్చుచేయండి. పనిలేనివారితో పంచుకోండి. అనవసరంగా సంచరించకండి. 

Updated Date - 2020-06-05T06:09:10+05:30 IST