రికార్డులు మార్చేసి.. భూములు పంచేసి...

ABN , First Publish Date - 2021-08-04T04:56:35+05:30 IST

పొదలకూరు మండలంలో కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది తీరుతో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి.

రికార్డులు మార్చేసి..  భూములు పంచేసి...
నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారన్న ఆరోపణలు ఉన్న 1బీలు

పొదలకూరులో రెవెన్యూ లీలలెన్నో!

పరాధీనమవుతున్న ప్రభుత్వ భూములు

చెరువులు, కొండపోరంబోకు భూములకు పట్టాలు

1980-85 నాటి ఎమ్మార్వోల సంతకాలు ఫోర్జరీ

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు.. మామూళ్లకు తలొగ్గుతున్న అధికారులు

హక్కులు ఉన్న రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు


చెరువులు, కొండపోరంబోకు ఇలా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా వాటిని కాజేస్తున్నారు. కాదు.. కాదు... అయినవారికి రాసి ఇచ్చేస్తున్నారు. రికార్డుల్లో మాయ  చేసి, అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒకప్పటి లబ్ధిదారు పేరు ఇప్పుడు ఉండటం లేదు. ఆనాటి అధికారుల సంతకాలూ ఫోర్జరీ చేసేస్తున్నారు. పొదలకూరు మండలంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, మామూళ్లకు తలొగ్గిన రెవెన్యూ శాఖలోని కొంతమంది అధికారులు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారు. అదెలాగో ఈ కథనం చదవండి.



నెల్లూరు, ఆగస్టు 3 : పొదలకూరు మండలంలో కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది తీరుతో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి. ఏటా భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు, గ్రామసభలు నిర్వహిస్తున్నా బాధితులకు ప్రయోజనం చేకూరడం లేదు. ‘స్పందన’లో వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌, అండగల్‌ నమోదు, తప్పుల సవరణ, భూముల సర్వే, పట్టా మార్పు తదితర సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 


అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీ ఆమోదం లేకనే..


ప్రభగిరిపట్నం గ్రామంలో సర్వే నెం.813, 818-3ఏ, 581, 571, 658, 666, 58, 113, 344లలో ప్రభుత్వ భూమి, కొండపోరంబోకు భూములను పంచాయతీ పాలకవర్గ ఆమోదం, గ్రామసభ ఆమోదంతో  కలెక్టర్‌ అనాధీనంగా మార్చిన తర్వాతే నియోజవర్గ అలైన్‌మెంట్‌ రివ్యూ కమిటీ ఆమోదం పొందాలి. ఇవన్నీ పూర్తయ్యాకే లబ్ధిదారులకు ఇవ్వాలి. కానీ అలాంటివేమీ లేకుండానే ప్రభుత్వ కొండపోరంబోకు,  చెరువుల భూములను సుమారు 20 ఎకరాల అసైన్‌మెంట్‌ పట్టాలు రెవెన్యూ శాఖ మంజూరు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే ఇంట్లో మూడు పేర్లతో పట్టాలు మంజూరు అయ్యాయి. ఇదే గ్రామంలో సర్వే నెం.815లో  ఆత్మకూరువాసికి 4 ఎకరాలు అసైన్‌మెంట్‌ భూమి ఇచ్చి ఉన్నారు. తాటిపర్తి గ్రామం సర్వే నెం.815లో అసైన్మెంట్‌ కమిటీ అప్రూవల్‌ లేకుండా 10.27 ఎకరాలకు పట్టాలు మంజూరు చేశారు. అలాగే అయ్యవారిపాళెం 79, 84 సర్వే నెంబర్లలో చెరువు భూమి 4.20 ఎకరాలు, మరొకరికి 5 ఎకరాలు డిఫార్మ్‌ పట్టా మంజూరు చేశారు. ప్రభగిరిపట్నం 58 సర్వే నెంబరులో కొండపోరంబోకుని వెబ్‌ల్యాండ్‌లో 58-1గా సబ్‌డివిజన్‌ చేసి, ఇద్దరి పేర్లతో ఏకకాలంలో పట్టాలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ విషయం అందరికీ తెలియడంతో ఆ సర్వే నెంబర్లకు రెడ్‌ మార్కు పెట్టి తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే పుకార్లు  షికారు చేస్తున్నాయి. సంబంధిత వ్యక్తులకు ముందు ఎలా 1-బీ, టైటిల్‌ డీడ్‌ ఇచ్చారో, తర్వాత ఏ ఆధారాలతో వాటిని తొలగించారో ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.


దళారీ వ్యవస్థ కొత్త పంథా..


కొత్తగా పట్టా భూములకు పాస్‌బుక్‌ పొందాలనుకునే వారు 1980-85లో అప్పటి ఎమ్మార్వోలు (ప్రస్తుతం తహసీల్దార్లుగా పిలుస్తున్నారు.) పట్టాలు ఇచ్చినట్లు, పాత ఖాళీ పాస్‌బుక్‌లు సేకరించి, వాటిలో ఎవరికి కొత్త పాసుబుక్‌లు కావాలో వారి వివరాలు నమోదు చేసుకుని, పాత ఎమ్మార్వోలు ఇచ్చిన పాస్‌బుక్‌లా వాటిని సృష్టించి  వాటిపై బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు అతికించి, అప్పటి ఎమ్మార్వో సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారు. వాటి ఆధారంగా నూతన డిజిటల్‌ పాస్‌బుక్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయంలో కొందరు పాత పుస్తకాల ఆధారంగా ఇదంతా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజంగా వీరికి 1980-85 మధ్యకాలంలో ఆయా ఎమ్మార్వోలు పట్టాలు మంజూరు చేసి ఉంటే, ఆనలైనలోనూ, బ్యాంక్‌ లోన్ల వివరాల్లో ఉండాలి. కానీ అలా ఉండవు. వీరికి ఒకేసారి 1బీ, డిజిటల్‌ పాసుబుక్‌లు మంజూరు కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తహసీల్దారు బయోమెట్రిక్‌, డిజిటల్‌ కీ ఇవ్వాల్సి వుంటుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


కంచే చేను మేస్తే..


ప్రభగిరిపట్నం, తాటిపర్తి, నరసింహకండ్రిగ, అయ్యవారిపాళెం, బిరదవోలు గ్రామాల్లో ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములను పేర్లు మార్చి పరాధీనం చేశారు. అలాగే చాటగొట్ల గ్రామంలో పదేళ్ల నుంచి సర్వే నెం.9 స్థలాలను కొందరు అనుభవిస్తున్నారు. ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే రెవెన్యూ అధికారులు పాత తేదీలతో అధికార పార్టీ వారికి మాత్రమే నివేశన స్థలాల పొజిషన్‌ సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఇచ్చిన సర్టిఫికెట్లలో ప్లాట్‌ నెంబరు, విస్తీర్ణం, హద్దులు చూపలేదు. దీనిపై గ్రామంలో ఇరువర్గాలు ఇప్పటికీ ఘర్షణలు పడుతూనే ఉన్నాయి. నేతల ఒత్తిళ్లు, ఆమ్యామ్యాలకు తలొగ్గి ఇతరుల పేరిట రూ.కోట్లు విలువైన భూములను ఆన్‌లైన్‌ చేయడంపై ఉన్నతాధికారులకు తగిన ఆధారాలతో పొదలకూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా, ఏసీబీ అధికారులకు లింగంపల్లికి చెందిన  మరొకరి ద్వారా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం నెల్లూరు ఏసీబీ కార్యాలయంలో ముమ్మరంగా విచారణ సాగుతోంది. ఇలాంటి ఘటనలపై అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే విచారణ వరకు వస్తున్నాయి. లేకుంటే అవినీతిపరుల చేతుల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. 


అంతా రికార్డుల ప్రకారమే.. 


రికార్డులపరంగా అన్నీ సక్రమంగా ఉన్నవాటికే  పాస్‌బుక్‌, పట్టాలు ఇచ్చాము. డిజిటల్‌ సైన్‌ పాత వాటికి కూడా కొన్నింటికి నాదే వస్తుంది. అంత మాత్రన అవి నేను మంజూరు చేసినవి కావు. ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదు. కొందరు కావాలని పనికట్టుకొని వారి స్వార్థాలకు ఇలా చేయడం బాధాకరం.

 - స్వాతి, తహసీల్దారు 



Updated Date - 2021-08-04T04:56:35+05:30 IST