భూ దందా

ABN , First Publish Date - 2020-06-06T08:47:35+05:30 IST

ఆగిరిపల్లి మండల పరిధిలోని నెక్కలంగొల్లగూడెం గ్రామంలో ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాల కోసం జరిపిన భూసేకరణ అధికారపక్ష నాయకుల జేబులు నింపుతోంది.

భూ దందా

పేదల స్థలాల మాటున పెద్దలు

నివేశన స్థలాల కోసం నివాస యోగ్యం కాని భూమి సేకరణ

రూ.25 లక్షల విలువచేసే భూమికి రూ.55 లక్షలు?

జూ లబ్ధిదారులు వద్దంటున్నా ఆ భూమే సేకరణ జూ నెక్కలంగొల్లగూడెంలో అక్రమాలు


నూజివీడు/ఆగిరిపల్లి, జూన్‌ 5 : ఆగిరిపల్లి మండల పరిధిలోని నెక్కలంగొల్లగూడెం గ్రామంలో ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాల కోసం జరిపిన భూసేకరణ అధికారపక్ష నాయకుల జేబులు నింపుతోంది. కొందరు బినామీలను అడ్డుపెట్టుకుని తక్కువ విలువచేసే భూమికి పెద్దమొత్తంలో ధర నిర్ణయించి అధికారపక్ష నేతలు సొమ్ము చేసుకున్నారు. అయితే నివేశన స్థలాల కోసం సేకరించిన ఈ భూమికి రెండు వైపులా శ్మశానం, మరోవైపు చెరువు ఉంది. ఈ స్థలాల్లో తాము నివసించలేమంటూ లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా వారి ఆక్రందన అరణ్యరోదనే అయింది. స్వయంగా కొందరు  అధికార పక్ష నేతలే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.


అడవినెక్కలం గ్రామ సర్వే నెం.215/1ఇలో 4.5 ఎకరాల భూమిని హైదరాబాద్‌కు చెందిన ఓ క్రిస్టియన్‌ సంస్థ తరపున విజయవాడకు చెందిన రాచపూడి సంపత్‌ పరంజ్యోతి, హైదరాబాద్‌కు  చెందిన తియోతి చార్లెస్‌ గాల్‌ బ్రెత్‌ అనే వ్యక్తులు 2003లో కొనుగోలుచేసి రిజిస్టర్‌ చేయించుకున్నారు. తిరిగి ఐదు సంవత్సరాల క్రితం నెక్కలంగొల్లగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి దీనిని అధికధరకు విక్రయిస్తూ, అగ్రిమెంటు రాశారు. అయితే ఇప్పటి వరకు ఈ అగ్రిమెంటు రిజిస్టర్‌ కాకపోవడంతో పేదల ఇళ్లస్థలాల కోసం ఈ భూమిని గవర్నమెంటుకు విక్రయించి జేబులు నింపుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికారపక్ష నేత హస్తం ఉన్నదనే ఆరోపణ బహిరంగంగా వినిపిస్తోంది. 


ఈ భూమికి రెండు వైపులా శ్మశానం, మరోవైపు చెరువు ఉండటం వల్ల నివాసాలకు ఇది యోగ్యం కాదని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ గ్రామంలో మొత్తం 98 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కాగా, వారి నుంచి సంతకాలు సేకరించి, ఈ భూమిలో ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు తమకు సమ్మతమేనని లేఖ సృష్టించి, తమను మోసగించారని లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. వాస్తవానికి గ్రామానికి ఆనుకుని ఉన్న ఎకరం భూమి రూ.40 లక్షలకు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు వచ్చినా, అధికారపక్ష ఒత్తిడి  మేరకు చెరువు, శ్మశానం మధ్య రూ.25 లక్షల విలువ కూడా చేయని భూమిని రూ.55 లక్షలకు కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దలకు, అధికారులకు కూడా ఎవరికి అందాల్సి వాటాలు వారికి  అందినట్టు సమాచారం. 


ఈ వ్యవహారంపై గ్రామానికి చెందిన అధికారపక్ష నేతలే అధికారులకు ఫిర్యాదు  చేసి లబ్ధిదారుల పక్షాన పోరాడుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే ఈ 4.5 ఎకరాల భూమిలో 2.5 ఎకరాల భూమికి ఎకరానికి రూ.55 లక్షల ధర ఖరారు చేసి భూయజమానుల ఖాతాలకు కూడా సొమ్మును బదలాయించేశారు. దీంతో దీనిపై పోరాడినా ప్రయోజనం ఉంటుందా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-06-06T08:47:35+05:30 IST