దర్జాగా కబ్జా!

ABN , First Publish Date - 2020-11-28T04:48:05+05:30 IST

పట్టణ శివారులోని విలువైన ప్రభుత్వ భూమిపై ఓ నేత కన్ను పడింది. ఇంకేముంది ఏకంగా అందులో ప్రహరీ కట్టి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు.

దర్జాగా కబ్జా!
ప్రభుత్వస్థలంలో ప్రహరీ నిర్మించిన దృశ్యం

విలువైన ప్రభుత్వ భూమిపై ఓ నేత కన్ను

ప్రహరీ నిర్మించి సొంతం చేసుకునేందుకు యత్నం

చూసీచూడనట్లు వ్యవహిరిస్తున్న అధికారులు


పిడుగురాళ్ల, నవంబరు 27: పట్టణ శివారులోని విలువైన ప్రభుత్వ భూమిపై ఓ నేత కన్ను పడింది. ఇంకేముంది ఏకంగా అందులో ప్రహరీ కట్టి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్వవహరిస్తున్నారు. వివరాలివి.. పిడుగురాళ్లను ఆనుకునే ఉన్న కొండమోడులో 898/6-1సిలో సర్వే నెంబర్‌లో 18 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సమీపంలో ఉన్న పట్టా భూమి సర్వేనెంబర్‌ 898/3 సర్వేనెంబర్‌గా రిజిస్ట్రేషన్‌ చేయించి కబ్జా చేసేందుకు ఓ స్థానిక అధికార పార్టీ నేత పావులు కదుపుతున్నాడు. ఈ భూమి విలువ అరకోటి పైనే ఉంటుంది. ఏడాదిన్నర కిందట ఈ భూమిపై వివాదం చెలరేగడంతో అప్పటి రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వభూమని నిర్థారించి బోర్డును ఏర్పాటు చేశారు. తర్వాత ఆ బోర్డును గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ప్రస్తుతం ఆ 18 సెంట్ల భూమిలో ఓ నేత ప్రహరీ కట్టడం ప్రారంభించాడు. మంచి ధర వచ్చినప్పుడు అమ్మేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంతో ప్రహరీ నిర్మించి సొంతం చేసుకునే ప్రయత్నాలు  జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గత సోమవారం స్పందన కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం గమనార్హం. 


Updated Date - 2020-11-28T04:48:05+05:30 IST