మారేడుపూడిలో భూ దందా!

ABN , First Publish Date - 2021-12-03T06:22:23+05:30 IST

ఖాళీ జాగా కనిపిస్తే వెంటనే గెద్దల్లా వాలిపోతున్నారు.. గెడ్డలు, చెరువులను సైతం ఆక్రమించేసి ఆగమేఘాలపై నిర్మాణాలు ప్రారంభించేస్తున్నారు.. అధికారులు పట్టించుకోరనే ధైర్యంతో కట్టడాలు కట్టేస్తున్నారు.

మారేడుపూడిలో భూ దందా!
మారేడుపూడిలోని కృష్ణుడు ఆలయం ఎదురుగా ఉన్న చెరువును చదును చేసి మార్కింగ్‌ వేసిన దృశ్యం

పేట్రేగిపోతున్న ఆక్రమణదారులు

ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేయడమే!

సర్కారు స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

గెడ్డలు, చెరువులను చదును చేసి మార్కింగులు

మరో రూ.5 కోట్ల విలువైన భూమికి టెండర్‌

ఫిర్యాదులు వెళ్తున్నా కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు


అనకాపల్లి రూరల్‌, డిసెంబరు 2: ఖాళీ జాగా కనిపిస్తే వెంటనే గెద్దల్లా వాలిపోతున్నారు.. గెడ్డలు, చెరువులను సైతం ఆక్రమించేసి ఆగమేఘాలపై నిర్మాణాలు ప్రారంభించేస్తున్నారు.. అధికారులు పట్టించుకోరనే ధైర్యంతో కట్టడాలు కట్టేస్తున్నారు. అధికారం వినియోగించుకుని ఇంటి పన్నులు, కరెంట్‌ మీటర్లు వేసుకుంటున్నారు. అపురూరమైన నివాస యోగ్యంగా రూపొందించి భేరాలు పెట్టుకుంటున్నారు.. దర్జాగా విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు.. ఇదీ అనకాపల్లి మండలం మారేడుపూడి పంచాయతీలో అధికార పార్టీ నాయకుల భూ దందా!


జాతీయ రహదారి నుంచి మారేడుపూడి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో కొండను ఆనుకుని సర్వే నంబరు 357లో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూములు వున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఆక్రమణకు గురికాగా, మిగిలిన భూమిని సైతం వదిలేందుకు అధికార పార్టీ నాయకులు ఇష్టపడడం లేదు. పంచాయతీ కేంద్రంలోని కనిపించిన ఖాళీ స్థలాలను ఆక్రమించి దర్జాగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు జాతీయ రహదారికి ఆనుకుని అత్యంత విలువైన గెడ్డ వాగులు, చెరువులను సైతం కజ్జా చేసేస్తున్నారు. ఇక్కడ సెంటు రూ.4 నుంచి రూ.5 లక్షలు ధరలు పలుకుతోంది. దీంతో చెరువులను చదును చేసేసి వాటాలు వేసుకుని మరీ మార్కింగులు ఇస్తున్నారు. 


ప్రస్తుతం సాగుతున్న నిర్మాణాలు ఇవీ..

ప్రధాన రహదారిలోని ఎడమవైపు ప్రభుత్వ స్థలం సర్వే నంబరు 357లో సుమారు మూడు సెంట్లను ఆక్రమించి కాలమ్స్‌తో పక్కా భవనం నిర్మిస్తున్నారు. కుడివైపున సర్వే నంబరు 390 గెడ్డలోని మరో మూడు సెంట్ల విస్తీర్ణంలో పక్కా భవన నిర్మాణం ప్రారంభించారు. అలాగే 357 సర్వే నంబరులో పంచాయతీ భవనానికి కూతవేటు దూరంలోనే రాత్రికి రాత్రే రేకలు షెడ్డు నిర్మించారు. ఇలా నిర్మించిన భవనాలకు పలుకుబడి ఉపయోగించుకుని ఇంటి పన్నులు, విద్యుత్‌ కనెక్షన్‌ వేసుకుంటున్నారు. తరువాత స్థల విస్తీర్ణం ప్రకారం రేటు కట్టి దర్జాగా భవనాలను విక్రయిస్తున్నారు. 


చెరువును చదును చేసి ఫ్లాట్లుగా మార్కింగ్‌

కృష్ణుడు ఆలయం ఎదురుగా సర్వే నంబరు 385లోని సుమారు మూడు ఎకరాల్లో చెరువు ఉంది. ఈ చెరువులో ఇప్పటికే సగానికిపైగా ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఇదే కోవలో ప్రస్తుతం మారేడుపూడికి చెందిన ఓ వైసీపీ నాయకుడు సుమారు 30 సెంట్ల విస్తీర్ణంలో చదును చేసి ఫ్లాట్లుగా విభజించి పట్టపగలే మార్కింగ్‌ చేశారు. ఇక మరిడిమాంబ ఆలయం వెనుక భాగంలో ఉన్న ఇదే సర్వే నంబరులోని చెరువు బందలోని ముగ్గురు వార్డు మెంబర్‌ స్థాయి నాయకులు సుమారు 50 సెంట్లకుపైగా ఎక్సవేటర్‌ సహాయంతో గురువారం చదును చేసి నిర్మాణాలకు సిద్ధం చేశారు. ఆక్రమణ గురవుతున్న ఈ భూమి విలువ సుమారు రూ.5 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఆక్రమణల పర్వాన్ని అడ్డుకోవడానికి స్థానిక ప్రజలు ప్రయత్నిస్తే సదరు నాయకులు కలబడుతున్నారు. వారి దౌర్జన్యానికి భయపడి వెనుదిరుగుతున్న స్థానికులు, తరువాత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.


కన్నెత్తి చూడని రెవెన్యూ విభాగం

దర్జాగా కబ్జాల పర్వం, అక్రమ నిర్మాణాలు జరగుతున్నా రెవెన్యూ అధికారులు తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఆక్రమణల భాగోతం అంతా ప్రధాన రహదారికి ఆనుకుని జరగుతున్నా, స్థానిక ప్రజల నుంచి ఎన్ని ఫోన్‌ కాల్స్‌ వెళ్లినప్పటికీ వారిలో చలనం రావడంలేదు. తమంత తాము ఎలాగూ పట్టించుకోవడం లేదు. సరికదా! స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా ఉదాసీనంగా వ్యవహరించడంతో అధికారుల తీరును తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయోనని గుసగుసలాడుకుంటున్నారు. అధికారుల తీరుతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కబ్జా గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.


ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నాయి

-అయ్యాల శ్రీనివాసరావు, తహసీల్దార్‌, అనకాపల్లి

మారేడుపూడి పంచాయతీ నుంచి ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు. సిబ్బందిని పంపించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. ఆక్రమణలను తొలగిస్తాం.


Updated Date - 2021-12-03T06:22:23+05:30 IST