భూసేకరణం..!

ABN , First Publish Date - 2022-01-19T05:44:07+05:30 IST

జిల్లాలో కర్నూలు-కడప (కేసీ) కాలువ కింద 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర నదిలో యేటేటా వరద తగ్గడం.. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలు మళ్లించినా నిల్వ చేసుకునే రిజర్వాయర్లు లేకపోవడంతో కడప గడపన కేసీ ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. వర్షాకాలం ప్రారంభంలో సాగునీరు పుష్కలంగా ఉందని వరి నాట్లు వేస్తే.. పంట చివరి దశలో సాగు తడులు అందక పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడి రూపంలో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

భూసేకరణం..!
రాజోలి జలాశయం ముంపునకు గురయ్యే కేసీ ఆయకట్టు పొలాలు

జలాశయం కోసం కావాల్సిన భూమి 9,286.37 ఎకరాలు

అందులో కేసీ ఆయకట్టు కూడా 

ఎకరాకు రూ.20-25 లక్షలకు పైగా ఇవ్వాలని రైతుల డిమాండ్‌ 

ఐదు గ్రామాలు పూర్తిగా ముంపు

భూసేకరణలోనే కాలయాపన

రాజోలి జలాశయం నిర్మాణం ప్రశ్నార్థకమేనా..?


కుందూ తీరంలో కోనసీమను తలపించే పల్లెసీమలు. ఓ పక్క కుందూ నది.. మరోవైపు కేసీ కాలువ ఉండడంతో రెండుకార్ల పంటలతో పచ్చని పైర్లతో నిత్యం ఆ ప్రాంతం కళకళలాడుతోంది. అలాంటి పల్లెసీమలు, కేసీ కాల్వ ఆయకట్టును కూడా ముంచేసి రాజోలి జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఏడాది కావస్తోంది. భూసేకరణలో నెలలు గడిచిపోతున్నాయి. ఎకరాకు రూ.20-25 లక్షలు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తుండగా రూ.13-14 లక్షలకు మించి ఇవ్వలేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. మళ్లీ భూములు కొనాలంటే ప్రభుత్వం ఇచ్చే రేటుకు ఇతర గ్రామాల్లో అరెకరం కూడా రాదని రైతుల ఆవేదన. కట్ట నిర్మాణ ప్రాంతంలో ముందుగా 200 ఎకరాలు సేకరించి ఇవ్వమని ఇంజనీర్ల నివేదిక. రాజోలి జలాశయం భూసేకరణపై క్షేత్ర స్థాయి పరిశీలన కథనం. 


కడప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్నూలు-కడప (కేసీ) కాలువ కింద 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర నదిలో యేటేటా వరద తగ్గడం.. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలు మళ్లించినా నిల్వ చేసుకునే రిజర్వాయర్లు లేకపోవడంతో కడప గడపన కేసీ ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. వర్షాకాలం ప్రారంభంలో సాగునీరు పుష్కలంగా ఉందని వరి నాట్లు వేస్తే.. పంట చివరి దశలో సాగు తడులు అందక పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడి రూపంలో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఆయకట్టు పొలాలను కాపాడేందుకు కుందూ నదిపై 2.95 టీఎంసీల సామర్థ్యంతో 2008లో రాజోలి జలాశయం నిర్మాణానికి బీజం వేశారు. అప్పట్లో నిధుల కొరత.. రాజకీయ కారణాలు వెరసి కార్యరూపం దాల్చలేదు. 13 ఏళ్ల తరువాత పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె, కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం రాజోలి మధ్య కుందూ నదిపై ఈ జలాశయం నిర్మాణానికి భూసేకరణ సహా రూ.1357.10 కోట్లతో సీఎం జగన శంకుస్థాపన చేశారు. ఆనకట్ట నిర్మాణం గత ఏడాది ఫిబ్రవరిలో రూ.306.46 కోట్లకు టెండర్లు పిలిస్తే.. కేఆర్‌ఎంఆర్‌ నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. ఏడాది కావస్తున్నా భూసేకరణ సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో పనులు మొదలు కాలేదు. గాలేరు-నగరి ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టరు ఆధ్వర్యంలో రెండు దఫాలుగా రైతులతో సమావేశమైనా భూమి ధర నిర్ణయం ఓ కొలిక్కి రాలేదు.

న్యాయమైన పరిహారం ఇవ్వాల్సిందే...

జలాశయం నిర్మాణం కోసం 9,286.37 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల పరిధిలో 1,026.10 ఎకరాలు సేరించాల్సి ఉంటే.. అందులో రైతు పట్టా భూములు 849.38 ఎకరాలు ఉన్నాయి. పెద్దముడియం మండలం పరిధిలో నెమళ్లదిన్నె, గరిసలూరు, చిన్నముడియం, బలపనగూడూరు, ఉప్పలూరు గ్రామాలతో పాటు 8,260.27 ఎకరాలు ముంపునకు గురవుతాయి. అందులో పట్టా భూములే 6,536.27 ఎకరాలు ఉన్నాయి. అన్నదాతలు భూములు ఇస్తే తప్ప జలాశయం పునాదులు తవ్వే పరిస్థితి లేదు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా రెండు పర్యాయాలు జేసీ గౌతమి, జీఎనఎ్‌సఎ్‌స స్పెషల్‌ కలెక్టరు ఎం.రాంమోహన, మండల రెవిన్యూ అధికారులు రైతులతో భూమి ధర నిర్ణయంపై సమావేశమయ్యారు. కుందూ నదితీర గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ఎకరం రూ.20-25 లక్షలకు పైగా పలుకుతోంది. వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. ఉన్నఫలంగా భూములు లాగేసుకొని పొమ్మంటే.. ఇతర గ్రామాలకు వెళ్లి మళ్లీ భూములే కొనాలి. ఎక్కడికి వెళ్లినా ఎకరం రూ.20 లక్షలకు తక్కువ లేదు. ముత్తాతల కాలం నుంచి జీవనాధారమైన భూములు, గ్రామాలను వదిలి వెళ్లాల్సి వస్తుండడంతో ఎకరాకు రూ.20-25 లక్షలు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. తొలి సమావేశంలో రూ.11 లక్షలు, రెండవ సమావేశంలో రూ.13-14 లక్షల వరకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, అంతకు మించి మా చేతుల్లో లేదని అధికారులు తేల్చి చెప్పినట్లు రైతులు వివరిస్తున్నారు. న్యాయమైన పరిహారం ఇస్తే తప్ప మా భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేమని రైతులు అంటున్నారు. రాజోలి ముంపు గ్రామాల్లో ఎవరిని కదిపినా భూసేకరణపై ఏకరువు పెడుతున్నారు. కాగా.. 200 ఎకరాలు ముందు సేకరించి మాకు స్వాధీనం చేస్తే ఆనకట్ట నిర్మాణ పనులు మొదలు పెడతామని జలవనరుల శాఖ కర్నూలు జిల్లా సీఈ పేర్కొనడం కొసమెరుపు. 


భూములు పోతే ఎట్లా బతకాలి 

- రఘురామిరెడ్డి, రైతు, నెమళ్లదిన్నె 

మాకు 18 ఎకరాల పొలం ఉంది. రాజోలి ప్రాజెక్టు కడితే ఒక్క ఎకరా కూడా మిగలదు. అంతా ముంపులో పోతుంది. మూడు ఇళ్లు కూడా పోతాయి. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకుని కట్టుబట్టలతో ఊరు వదలాల్సి వస్తుంది. ఇతర గ్రామాల్లో పొలాలు కొనాలంటే ఎకరం రూ.18 లక్షలకు పైగా పలుకుతోంది. భూములు కోల్పోయే మాకు సరైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. పొలాల్లో పనులు చేసిన మేము పట్టణాలకు వెళ్లి పనులు చేయలేం. ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి.. లేదంటే భూమికి భూమి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలి. 


ఎకరాకు రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే

- ఈశ్వరరెడ్డి, రైతు, బలపనగూడూరు, పెద్దముడియం మండలం 

్ఝమాకు 13 ఎకరాల పొలం ఉంది. అందులో కేసీ ఆయకట్టు 8 ఎకరాలు ఉంది. తాతలు ముత్తాతల కాలం నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. రాజోలి జలాశయం నిర్మాణంలో 12.20 ఎకరాలు సాగుభూమి, మూడు అంకనాల ఇల్లు కోల్పోతాం. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.10-20 లక్షలకు పైగా పలుకుతోంది. రిజర్వాయరులో భూమి పోతే మరో ఊరికి వెళ్లి భూమి కొనుగోలు చేసి బతకాలి. మా భూమికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి. లేదంటే అన్యాయమైపోతాం. అధికారులు మా గోడు ఆకలించి న్యాయం చేయాలి. 


న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం 

- శివారెడ్డి, రైతు, గరిసనూరు గ్రామం

వ్యవసాయ కుటుంబం మాది. 18 ఎకరాల పొలం ఉంది. రాజోలి ప్రాజెక్టు కడితే 11.60 ఎకరాల పొలం సహా ఇళ్లు కూడా మునిగిపోతాయి. ప్రభుత్వం, అధికారులు ఎకరాకు రూ.14 లక్షలు ఇస్తామని అంటున్నారు. ఆ రేటుకు మాకు వేరే గ్రామాల్లో అర్ధెకరం కూడా వచ్చేలా లేదు. కనీసం ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తే రైతు కొంత ధైర్యంగా ఊరు వదలి మరో గ్రామంలో జీవనం మొదలుపెడతాడు. లేదంటే కష్టాలు తప్పవు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భూపరిహారం ధర నిర్ణయం న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాదు.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పక్కాగా అమలు చేయాలి.


రైతుకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి 

- జగన్మోహనరెడ్డి, రైతు, నెమళ్లదిన్నె గ్రామం 

మాకు 24 ఎకరాల పొలం ఉంది. రాజోలి రిజర్వాయరులో ఆరు ఎకరాలు పోతుంది. ఊరు కూడా ముంపునకు గురవుతుంది. పొలం మిగిలినా మరో ఊరికి వెళ్లాల్సిందే. అక్కడ వెళ్లి పొలం కొనుక్కొని.. ఇల్లు కట్టుకొని జీవనం సాగించాలంటే సాధ్యమా..? అధికారులు ఎకరాకు రూ.13 లక్షలు ఇస్తామని అంటున్నారు. ఆ రేటుకు బయట గ్రామాల్లో అర ఎకరం కూడా రాదు. ప్రాజెక్టు కోసం పొలాలు, ఊళ్లు త్యాగం చేస్తున్న మాకు సరైన న్యాయం చేయాలి. లేదంటే మాకు ఈ రిజర్వాయరే వద్దు. మా ఊళ్లోనే పంటలు పండించుకుని జీవనం సాగిస్తాం. 


రైతులు ఒప్పుకోవడం లేదు 

- రోహిణి, గాలేరు-నగరి ప్రాజెక్టు ఇనచార్జి స్పెషల్‌ కలెక్టరు, కడప

రాజోలి జలాశయం నిర్మాణం కోసం 7,385.62 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణ కోసం రైతులతో రెండు దఫాలుగా సమావేశమయ్యాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూమి ఇవ్వడానికి రైతులు ఒప్పుకోవడం లేదు. మరోసారి సమావేశం నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తాం. 




Updated Date - 2022-01-19T05:44:07+05:30 IST