భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-19T05:03:39+05:30 IST

కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా నగరంలోని రోడ్ల విస్తరణకు సంబంధించి భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌

సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌

కడప(కలెక్టరేట్‌), జూన్‌ 18: కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా నగరంలోని రోడ్ల విస్తరణకు సంబంధించి భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో రోడ్ల విస్తరణ అంశంపై సబ్‌ కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో కృష్ణ సర్కిల్‌ నుంచి గోకుల్‌లాడ్జి వరకు, కృష్ణ థియేటరు- మార్కెట్‌యార్డు, క్రిష్టియన్‌ లైన్‌ - ఎన్టీఆర్‌ విగ్రహం వరకు అలాగే ఎస్పీ బంగ్లా - మద్రాస్‌ రోడ్డు వరకు ఇంకనూ మిగిలి ఉన్న భూసేకరణను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ రోడ్లన్నింటిలోనూ గతంలో భూసేకరణ చేసి నష్ట పరిహారం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఎర్రముక్కపల్లి నుంచి ఎస్వీ డిగ్రీ కళాశాల వరకు, అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి వై జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ అధికంగా ఉందని, ఆయా రోడ్లపై ఆక్రమణల వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. మున్సిపల్‌ రోడ్ల లిమిట్స్‌లో ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్‌ శాఖాధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణ అంశంలో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయం తో పనిచేయాలని సబ్‌కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దారు శివరామిరెడ్డి, నగర కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనరు రమణారెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:03:39+05:30 IST