Abn logo
May 14 2021 @ 00:08AM

సీఎం ఆఫీసుకు ‘చిట్టా’..!

రాజంపేట మండలం హస్తవరం గుట్టను ఓ నేత ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకుని రెవెన్యూ యంత్రాంగం ఏర్పాటు చేసిన బోర్డు

రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలు

ప్రభుత్వ భూములు, గుట్టలు, చెరువులు, వంకల ఆక్రమణలపై నివేదిక 

భూరక్ష పేరిట రాజంపేట సబ్‌కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు


రాజంపేట(కడప): రాజంపేట రెవెన్యూ డివిజనలో జరుగుతున్న భారీ భూ కబ్జాల వివరాలను ఎప్పటికప్పుడు మండలాల వారీగా సేకరించి ఆ చిట్టాను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నారని సమాచారం. దీంతో ఇటు రెవెన్యూ యంత్రాంగంలోనూ.. అటు కబ్జాదారుల్లోనూ ఆందోళన నెలకొంది. రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతనగార్గ్‌ ఇటీవలే ‘భూరక్ష పేరిట’ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి భూ కబ్జాలపై వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ఫోన నెంబర్‌ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా భూకబ్జాలు జరుగుతున్నట్టు తెలిస్తే ఈ నెంబర్‌ 9063090317కు సమాచారం ఇస్తే చాలు.. వెంటనే రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు కొందరు కీలక రెవెన్యూ అధికారులు అవినీతికి తలొగ్గి తప్పుడు రికార్డులు సృష్టించి భూ కబ్జాలను ప్రోత్సహించిన వ్యవహారంపైనా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓబులవారిపల్లె, చిట్వేలి తహసీల్దార్ల బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. అదే కోవలో మరికొందరు అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. భూకబ్జాలపై మండలాల వారీగా ప్రత్యేక నివేదికలను తయారు చేసి సీఎం ఆఫీసుకు ఎప్పటికప్పుడు చేరుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కబ్జాలకు పాల్పడ్డ అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.


వెలుగు చూసిన కబ్జాలు..

- రాజంపేట మండలంలోని మన్నూరు పొలానికి సంబంధించి బోయనపల్లె సమీపంలో ఓ వ్యక్తి పేరిట కోట్ల రూపాయల విలువ చేసే 2.68 ఎకరాల భూమిని ఆనలైన చేయించడంలో ఓ వీఆర్వో కీలక పాత్ర పోషించారు. కోట్లకు పడగలెత్తిన ఆ వీఆర్వో వేరే వ్యక్తుల పేరిట ఆనలైన చేయించి ఆ భూమిని తన స్వాధీనంలో ఉంచుకున్నారు. గత తహసీల్దారు హయాంలో ఈ తతంగం జరిగినా ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. అదేవిధంగా పోలి, మన్నూరు, తాళ్లపాక, పాలెంరోడ్డు మార్గంలో బడా నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. వీరికి రెవెన్యూ అధికారులు సహకరించారని సమాచారం. రాజంపేట మండలంలో సుమారు 10మంది నాయకులు ఈ భూ కబ్జాలకు పాల్పడిన విషయమై ప్రత్యేక నివేదికలు సీఎం కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది.


- సుండుపల్లె మండలంలో అగ్రహారం గుట్ట వద్ద బాహుదానది పరివాహక ప్రాంతంలో ఓ నాయకుడు చేసిన కబ్జా ఉదంతం పెద్దఎత్తున దుమారం రేపుతోంది. ఓ కీలక నాయకుడు ఈ మండలంలో చేస్తున్న కబ్జాను ఆసరాగా చేసుకొని ఆయనకు తామేమి తీసిపోనట్లు మరో నేత కూడా ఇక్కడ వంకలను, వాగులను, గుట్టలను, డీకేటీ భూములను కబ్జా చేశాడు.


- నందలూరు మండలంలోని యల్లమరాజుపల్లె కొండను ఇటీవల ఆడపూరుకు చెందిన ఓ ఎనఆర్‌ఐ కబ్జా చేసి మామిడి చెట్లను సాగు చేశాడు. ఇదే కోవలో చాపలవారిపల్లె ప్రాంతంలో ఓ నాయకుడు సుమారు 30ఎకరాల పైబడి భూ కబ్బాలకు పాల్పడి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. లేబాక, పొత్తపి, చింతరాజుపల్లె, ఈడిగపల్లె ప్రాంతంలో 200ఎకరాల పైబడి ప్రభుత్వ భూమిని కొందరు నేతలు కబ్జా చేయడంపై ప్రత్యేక నివేదికలు సీఎం కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. కబ్జాకు సంబంధించి ఈ మండలంలో నలుగురు కీలక నాయకులది ప్రధాన పాత్ర అని తెలిసింది.


- ఒంటిమిట్ట మండలంలోని ఇరువర్గాల ప్రధాన నాయకులు కబ్జాలకు తెరలేపారు. వీరు పెన్నపేరూరు, మంటపంపల్లె, చింతరాజుపల్లె, నరవకాటిపల్లె, రాచగుడిపల్లెల్లో  పెద్దఎత్తున కబ్జాలకు పాల్పడ్డారు. అటవీ భూములు ఎక్కువగా ఉండటంతో మండలానికి సంబంధించిన ఒక ప్రధాన నాయకుడు సైతం ఇటీవలే ఈ కబ్జాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్సకేటర్లతో భూమిని చదును చేశారని సమాచారం. 


- రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లెలో భారీ భూకబ్జాలు వెలుగుచూశాయి. కబ్జా చేసేందుకు నేతలకు సహకరించారనే ఆరోపణలతో అక్కడి ప్రధాన మండల అధికారిని, వీఆర్వోలను బదిలీ చేశారు. గాదెల, పెద్దఓరంపాడు, రాళ్లచెరువుపల్లె, బొమ్మవరం రెవెన్యూ పొలాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసినట్లు సమాచారం.


- పుల్లంపేట మండలంలో కేతరాజుపల్లె, వత్తలూరు, తిప్పాయపల్లె, అనంతసముద్రం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి. తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబరు 611 నుండి 618 వరకు వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించి గతంలో భారీ ఎత్తున ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేసి బోర్లు వేశారు. దీనిపై సబ్‌కలెక్టర్‌ కేతనగార్గ్‌ వెంటనే చర్యలు తీసుకున్నారు. నాలుగు రోజుల కిందట తిప్పాయపల్లె గ్రామం రామాపురంలో ఓ వలంటీరు ఓ నాయకుడి పలుకుబడితో ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు.


- చిట్వేలి మండలంలోని రాజుకుంట, చెర్లోపల్లె చిట్వేలి పట్టణ అంబేడ్కర్‌ సర్కిల్‌, తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డులో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు జరిగాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో వెంటనే రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంది.


అధికారులేమన్నారంటే..

భూ కబ్జాలపై రాజంపేట తహసీల్దారు రవిశంకర్‌రెడ్డిని వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిన వాటిపై వెంటనే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నందలూరు తహసీల్దారు శ్రీరాములనాయుడును వివరణ కోరగా ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడినట్లు తమకు సమాచారం అందజేస్తే తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు.

పుల్లంపేట మండలం రామాపురం వద్ద ఓ వలంటీర్‌ కబ్జా చేసేందుకు యత్నించిన ప్రభుత్వ భూమి

ఇవి కూడా చదవండిImage Caption

ఇలాగైతే కట్టడి ఎలా ?

Advertisement