భూ బకాసురులు

ABN , First Publish Date - 2020-11-17T06:29:11+05:30 IST

ఆనందపురం మండలం గంగరాజు అగ్రహారంలో వివాదంలో వున్న వంద ఎకరాలు విజయసాయిరెడ్డికి కావాలంటూ భూ యజమానులుగా పేర్కొంటున్న వారి వద్దకు వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి వెళ్లి బెదిరించారు.

భూ బకాసురులు
మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలోని భూములు

బయటపడుతున్న బాగోతాలు!

మొన్న గంగరాజు అగ్రహారం... నిన్న ఆనందపురం... ఇప్పుడు తూటపాల

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వైసీపీ నేతల లీలలు

అవాక్కవుతున్న పార్టీ నేతలు

పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టమేనని కేడర్‌లో ఆందోళన


ఆనందపురం మండలం గంగరాజు అగ్రహారంలో వివాదంలో వున్న వంద ఎకరాలు విజయసాయిరెడ్డికి కావాలంటూ భూ యజమానులుగా పేర్కొంటున్న వారి వద్దకు వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి వెళ్లి బెదిరించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆయన్ను అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. రూరల్‌ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఆనందపురం మండలంలో మాజీ సైనికులకు కేటాయించిన భూమికి సంబంధించి ఎన్‌ఓసీ జారీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తేవడం, ఆ విషయం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రచురితం కావడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఇక ప్రస్తుతానికి వస్తే...మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో ‘రావు ఖాతా’ (హక్కుదారులు ఎవరూ లేకపోతే రెవెన్యూ రికార్డుల్లో ఈ పేరుతో నమోదు చేస్తారు)లో గల 75 ఎకరాల భూమిని చేజిక్కించుకునేందుకు రూరల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరవెనుక చక్రం తిప్పారు. దీనిని ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం వెలుగులోకి తీసుకురావడంతో అధికార పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. ...అయితే జిల్లాలో ఇలాంటి బాగోతాలు మరెన్నో వున్నాయని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు నేరుగా తెరపైకి వస్తుండగా, మరికొంతమంది మాత్రం బినామీలను ముందుపెట్టి తతంగం నడిపిస్తున్నారు. తాము అవినీతి, అక్రమాలకు అవకాశం ఇవ్వబోమంటూ అధికారం చేపట్టిన తొలినాళ్లలో బీరాలు పలికిన నేతల భూబాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో పార్టీ నేతలే నోరెళ్లబెడుతున్నారు. 


రూరల్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు...నిత్యం భూ వ్యవహారాల్లోనే నిమగ్నమై ఉంటారు. ఇటీవల ఆయన నియోజకవర్గ పరిధిలోని ఒక మండలంలో తహసీల్దార్‌...తాను పదవీ విరమణ చేయడానికి 24 గంటల ముందు నాలుగు ఎకరాల వివాదాస్పద భూమిని ఒక వర్గానికి మ్యుటేషన్‌ చేసేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు భారీగా ముట్టజెప్పడంతో పాటు వీడ్కోలు కార్యక్రమాన్ని సదరు ప్రజా ప్రతినిధి అట్టహాసంగా నిర్వహించినట్టు మండలంలో ప్రచారం జరిగింది. రూరల్‌ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే బంధువులు ఆనందపురం మండలంలో మాజీ సైనికుడికి కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. అది ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో ఉంది. ఆ కారణంతో రిజిస్ట్రేషన్‌ జరగలేదు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చుకొని రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. దానికి కలెక్టర్‌ ఎన్‌ఓసీ ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. దానిపై మళ్లీ కోర్టులో అప్పీల్‌ చేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. వారం కిందట జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో ఇదే విషయమై వైసీపీలోని ఇరువర్గాలు...వాగ్వాదానికి దిగాయి. చివరకు పంచాయితీ సీఎం జగన్‌ వద్దకు చేరింది. తాజాగా మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో రావు ఖాతాలోని 75 ఎకరాలపై రూరల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు కన్నేశారు. కొంతమంది బినామీలను తెరమీదకు తెచ్చారు. వారికి పట్టాలు జారీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీనిపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో అధికార పార్టీ వర్గాలు అవాక్కయ్యాయి. నేతల భూబాగోతాలు భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగజేస్తాయని ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటికి పుల్‌స్టాప్‌ పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని  అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-11-17T06:29:11+05:30 IST