మూడు రాజధానుల పేరిట భూ దందా!

ABN , First Publish Date - 2021-08-03T06:25:33+05:30 IST

వైసీపీ అధికారంలోకి రాగానే సౌతాఫ్రికా తరహాలో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని గానూ, అమరావతిని శాసన రాజధాని గానూ, కర్నూలుని న్యాయ రాజధాని గానూ- మూడు రాజధానుల నిర్ణయాన్ని...

మూడు రాజధానుల పేరిట భూ దందా!

వైసీపీ అధికారంలోకి రాగానే సౌతాఫ్రికా తరహాలో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని గానూ, అమరావతిని శాసన రాజధాని గానూ, కర్నూలుని న్యాయ రాజధాని గానూ- మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది పాలనా వికేంద్రీకరణకు, సమగ్ర అభివృద్ధికి, మరీ ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి తోడ్పడుతుందన్నది ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు, దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. అయితే ఈ కేంద్రీకృత రాజధాని నమూనా ఆర్థికం గానూ, పర్యావరణపరం గానూ, లేదా ఉద్యోగ అవకాశాలపరం గానూ వెసులుబాటులేని, సాధ్యం కాని ఒక ప్రాజెక్టు అని అనేకమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, టీడీపీ ప్రభుత్వంలో అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి భూ అవకతవకలు, ఇన్సయిడర్ ట్రేడింగ్, అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అందులో భాగంగానే అమరావతి రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్టులపై సమీక్షలు, కమిటీలు వేసి వాటి నివేదికలు ఆధారంగా ముందు కాంట్రాక్టులను రద్దు చేయడం, రివర్స్ టెండరింగ్ లాంటి చర్యలను చేపట్టింది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయినట్లు కూడా ప్రకటనలు చేసారు.


వివిధ వర్గాలకు చెందిన రైతులు, రాజకీయ పార్టీలు గత 18 నెలలుగా ‘జాయింట్ ఏక్షన్ కమిటీ’గా ఏర్పడి, ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వైఖరి మునుపటి ప్రభుత్వం కంటే భిన్నంగా ఏమీ లేదు. నాటి ప్రభుత్వం ఎలాగైతే అమరావతి విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధమైన చర్చకి తావు ఇవ్వలేదో, అలాగే నేడు వైసీపీ ప్రభుత్వం కూడా నిరసనకారులతో గానీ, రైతు సంఘాలతో గానీ, రాజకీయ పార్టీలతో గానీ ఒక చర్చను పెట్టి ఈ మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించక లేకపోయింది. అలా చేయకపోగా, 144 సెక్షన్, సెక్షన్ 30 (పోలీస్ చట్టం) విధిస్తూ నిరసనకారుల్ని (మహిళలని కూడా) కొట్టి వారిని అదుపులోకి తీసుకోవడం వంటివి జరిపింది. 


ఈ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం నగరం భూపంపకాలకి, అమ్మకాలకి, ఆక్రమణలకి, లీజులకి - ఒక్క మాటలో చెప్పాలంటే భూ దందాలకి కేంద్రంగా నిలిచింది. విశాఖపట్నంలో చాలా భూమి ప్రభుత్వం ఆధీనంలోనే ఉండటం గమనించదగ్గ విషయం. విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వెంటనే, ప్రభుత్వం భూసమీకరణకు ప్రయత్నించగా దానికి గట్టి వ్యతిరేకత ఎదురవటంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆ తరువాత కూడా, చాలా ప్రభుత్వ భూమి, ఉమ్మడి ప్రదేశాలు (urban commons) ఆక్రమణకి గురవ్వడం, ప్రైవేట్ వ్యక్తుల పరమవ్వడం జరుగుతూనే ఉంది. విశాఖపట్నం-–భీమిలి మధ్యలో సుమారు 25కి.మీ. విస్తరణలో చాలా భూమి రియల్ ఎస్టేట్ వ్యక్తులు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం బిల్డ్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా, ప్రభుత్వ భూముల్ని గుర్తించి వివిధ రకాల మౌలిక వసతులను కల్పించి, నిర్మాణానికై ప్రైవేటు వ్యక్తులకి, ఇతర సంస్థలకి అమ్మడం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా గుర్తించిన చాలా భూమి విశాఖపట్నానికి చెందినదే కావడం గమనార్హం. సిటీలో ప్రధాన ప్రాంతమైన ఆర్కే బీచ్ రోడ్డులో హార్బర్ పార్కు దగ్గరున్న 13.59 ఎకరాల ప్రభుత్వ భూమిని, అప్పటి టీడీపీ ప్రభుత్వం యు.ఎ.ఇ.కి చెందిన ‘లులు’ గ్రూపుకి లీజుకి ఇవ్వడం జరిగింది. దానిని 2019లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి, అదే భూమిని (coastal regulation zone- CRZ II పరిధిలో ఉన్నప్పటికీ; అంటే ఆ భూమిని CRZ చట్టం ప్రకారం ప్రైవేటుపరం చేయడం కుదరదు) ఇప్పుడు పూర్తి అమ్మకానికి పెట్టింది. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయం, తహిసీల్దారు కార్యాలయం, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ఆర్ అండ్ బీ కార్యాలయం, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్స్, ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రభుత్వ డైరీ ఫార్మ్, వికలాంగ శిక్షణా కేంద్రం ఉన్నటువంటి వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడానికి, లీజు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మడం ద్వారా డబ్బును సమకూర్చుకోవడం తప్ప మరొకటి కాదు. తీరాన్ని ఆనుకొని ఉన్న విశాఖపట్నం సహజంగానే తుఫానులు, వరదలు, సునామీలకి గురయ్యే ప్రాంతం. ప్రభుత్వం పర్యావరణ నిబంధనల్ని ఉల్లఘింస్తూ, కొండల్ని ఆక్రమించుకోవడం, నిర్మాణాలు చేపట్టడం, భూముల్ని యథేచ్ఛగా వాడుకోవడం గమనిస్తుంటే... ఇవన్నీ విశాఖపట్టణం అభివృద్ధిని మరింత అస్థిరపరిచే అంశాలుగానే కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాలన్నీ అమరావతి లాగానే ఇంకో రియలెస్టేట్ ప్రాజెక్టులా కనిపిస్తున్నాయి. 


అదే విధంగా విశాఖపట్నం స్టీలు ప్లాంటు, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టుకి సంబంధించిన కొన్ని ప్రధాన నిర్ణయాలను ఇటీవల తీసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్న రైల్వే ఆస్తుల అమ్మకాలతోపాటు, స్టీలు ప్లాంటు, దానికి సంబంధించిన సుమారు 22,372 ఎకరాల భూమిని విక్రయించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక, విశాఖపట్నం పోర్టు, ఇనుము ధాతు కర్మాగారాలను అదానీ, వేదాంత గ్రూపు లాంటి కార్పోరేట్లుకి విక్రయించింది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికున్న 1800 ఎకరాల భూమికి (అంటే, 21% వాటా) ఆదాయాన్నీ, మిగిలిన 1052 ఎకరాల భూమికి అద్దెనూ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పొందుతోంది. అయితే ఇప్పుడు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోనుకి గంగవరం పోర్టుని పూర్తిగా అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా కాకినాడ సెజ్‌లో ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాని అరబిందో గ్రూపుకి అమ్మకం పెట్టారు. అలాగే, తూర్పు తీరం నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉన్న 100 శాతం వాటాని అదానీ గ్రూపు కొనుక్కోవడానికి సహకరించారు, సముద్ర పర్యావరణాన్ని పట్టించుకోకుండా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ గ్రూపు ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చారు. టీడీపీ హయాంలో అప్పుడు విపక్షంగా ఉన్న వైసీపీ భోగాపురం ఎయిర్ పోర్టుకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియని అడ్డుకున్నప్పటికీ, ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చాక, 500 ఎకరాల భూమిని తాను అభివృద్ధి చేస్తూ, మిగిలిన 2200 ఎకరాలను అధునాతన అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయ డానికి జిఎమ్‌ఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని పర్యవసానంగా అక్కడున్న చిన్న, సన్నకారు రైతులు రెండు ప్రభుత్వాల చేతుల్లోనూ (టీడీపీ, వైసీపీ) ఆ ప్రాంతం నుంచి తొలగించబడ్డారు. అయితే, ఒక వైపు ప్రభుత్వ ఆస్తుల్ని లీజుకి ఇచ్చో, అమ్మకానికి పెట్టో డబ్బుని సమకూర్చుకుంటూ, కార్పోరేటు సంస్థలకు అన్నీ అప్పచెప్తున్న ఏపీ ప్రభుత్వానికి, స్టీలు ప్లాంటునీ, పోర్టులనీ అమ్మకానికి తలపెట్టిన కేంద్రప్రభుత్వానికి తేడా ఏమీ లేకపోగా, కేంద్రాన్ని ప్రశ్నించి, నిలదీసే నైతికత ఎలా వస్తుంది? 


కార్పోరేట్లుకి ఉపయోగపడే విధంగా విధానాలు తీర్చుదిద్దుకోవడం, ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టడం, భూ ఒప్పందాలు కుదుర్చుకోవడం, పేదలకి ఇళ్ల పేరుతో దళితులకి కేటాయించిన భూముల్ని లాక్కోవడం, పట్టణ, విద్యుత్తు, ఆస్తి పన్నుల్లో సంస్కరణలు తీసుకురావడం లాంటివే ఈ ప్రభుత్వం అభివృద్ధి నమూనాగా ప్రతిబింబిస్తున్నాయి. అంతేతప్ప, పరిశ్రమల్ని స్థాపించి, ఉపాధి అవకాశాల్ని సృష్టించి అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు కనిపించట్లేదు. ఇదిలా ఉంటే, మరోవైపు పోలవరం ప్రాజెక్టు బాధితులైన రైతులు, రైతు కూలీలకి (ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు) 2013 ఎల్.ఎ.ఆర్.ఆర్.ఎ చట్టం క్రింద తగిన పరిహారం ఇవ్వకుండానే వారిని అక్కడనుంచి వెళ్లగొట్టే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తోంది.


అందువల్ల ఈ మూడు రాజధానుల నిర్ణయం- ప్రభుత్వం చెబుతున్నట్లు పాలనా వికేంద్రీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధిలో భాగమా లేక ప్రభుత్వం చేసే భూదందాకి ‘వికేంద్రీకరణ’ అన్నది ఒక ముసుగు మాత్రమేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజాప్రయోజనాలకు కేంద్రంగా గల రాజధాని లేదా రాజధానుల్ని రూపకల్పన చేసే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ప్రభుత్వం ఆ చారిత్రక అవకాశాన్ని చేజార్చుకుంటోంది. 

ప్రొ. పురేంద్ర ప్రసాద్

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-08-03T06:25:33+05:30 IST