Abn logo
Sep 21 2021 @ 00:50AM

భూచోళ్లు!

సాగర్‌నగర్‌లో బీచ్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలంపైనే ఓ ముఠా కన్నేసింది

నగరంలో ఖాళీ స్థలాల కబ్జాకు కొత్త ఎత్తుగడలు

వారసుల పేరిట ఎంట్రీ

విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో భూములపైనే ప్రధానంగా దృష్టి

తాజాగా సాగర్‌నగర్‌లో రూ.10 కోట్ల స్థలం తమ తాతలదంటూ ఓ బృందం హల్‌చల్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో ఎవరికైనా ఖాళీ ఇళ్ల స్థలాలు, భూములు ఉన్నాయా? అవి ఖరీదైనవి అయితే...ఒక్కసారి వాటి పరిస్థితి ఏమిటో చూసుకోండి. నగరంలో భూ మాయగాళ్ల బృందాలు తెగ తిరుగుతున్నాయి. ఎటువంటి సంరక్షణ లేని ఖాళీ భూముల్లోకి వెళ్లి, అవి తమ తాతల ఆస్తులని కబ్జాకు తెగబడుతున్నాయి. తమకు తెలియకుండా పెద్దలు అమ్మేశారని, తమ సంతకాలు లేనందున, ఆ క్రయవిక్రయాలు చెల్లవంటూ ఖాళీ స్థలాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


విశాఖలో స్థిరాస్తి కొంటే...భవిష్యత్తులో ఉపయోగపడుతుందని...ఎక్కడెక్కడివారో ఇక్కడ భూములు కొంటున్నారు. వారికి ఇక్కడ ఏమి జరుగుతున్నదీ తెలియడం లేదు. ఇలాంటి ఖాళీ స్థలాలు వున్నవారిలో కొందరే వాటికి ప్రహరీలు నిర్మించి, సెక్యూరిటీని పెట్టుకున్నారు. అత్యధిక స్థలాలకు సెక్యూరిటీ లేదు. ఇలా లేని వాటినే భూ మాయగాళ్లు ఆక్రమిస్తున్నారు.


సాగర్‌నగర్‌ కేంద్రంగా ఓ బృందం 

బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్‌ కేంద్రంగా ఎండాడ, సాగర్‌నగర్‌ పరిసరాల్లో ఖాళీ భూములను కొట్టేయడానికి ఒక బృందం కొంతకాలంగా యత్నిస్తోంది. వీరు తమ తాతల భూములు ఉన్నాయని, వారి పేర్లే ఇప్పటికీ రెవెన్యూ రికార్డులోని అడంగల్‌ పుస్తకంలో ఉన్నాయంటూ...వాటి జెరాక్స్‌ కాపీలు తీసుకొచ్చి, పాతిక, ముప్పై ఏళ్ల క్రితం అమ్మేసిన భూములను కబ్జా చేయడానికి యత్నిస్తోంది. వీరికి కొందరు రౌడీమూకలు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. 


శాంతినికేతన్‌ హౌసింగ్‌ సొసైటీ స్థలాలపై కన్ను

సాగర్‌నగర్‌లో బీచ్‌ రోడ్డును ఆనుకొని 1996 ప్రాంతంలో శాంతినికేతన్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ సర్వే నంబర్లు 116/పి, 120/పి, 144/పి నంబర్లలో ఒక లేఅవుట్‌ వేసి ఇళ్ల స్థలాలను విక్రయించింది. అందులో సుమారు 70 మంది స్థలాలు కొనుక్కొన్నారు. వారిలో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు ఖాళీగా ఉంచారు. ఖాళీ స్థలాల యజమానులు కొందరు ప్రహరీలు నిర్మించి, గేట్లు పెట్టుకున్నారు. మరికొందరు కాలనీలో ఇళ్ల నిర్మాణం జరిగినందున, అలికిడి బాగానే వుందని సెక్యూరిటీ పెట్టుకోలేదు. ఇందులో రోడ్డును ఆనుకొని నాలుగు ప్లాట్లు (సుమారు 1,800 గజాలు) చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. వాటిలో తుప్పలు దట్టంగా పెరిగిపోయాయి. స్థానికంగా వుండే చిల్లర దొంగలు గేట్లు ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో గజం ధర రూ.60 వేల నుంచి రూ.70 వేలు పలుకుతోంది. అంటే...1,800 గజాల స్థలం ఖరీదు రూ.10 కోట్ల పైమాటే. దీనిపై భూమాయగాళ్ల కన్ను పడింది. ఆదివారం ఉదయం కార్లలో పదిహేను మంది వరకు అక్కడకు వచ్చారు. ఆ ప్రాంతమంతా తమ తాతలదని, అడంగల్‌లో వారి పేర్లే ఉన్నాయని, వారసులైన తమ వాటాగా ఆ ఖాళీ భూములు వచ్చాయని, ఆ స్థలాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ఎదురుగానే స్థలాలు కొనుక్కొని గృహాలు నిర్మించుకొని ఉంటున్నవారు, వీరిని అడ్డగించారు. ఆ స్థలాల యజమానులు వేరే ఉన్నారని, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదని నిలదీశారు. దాంతో వారు, 30 ఏళ్ల క్రితం తమ సంతకాలు లేకుండా తాతలు భూమి అమ్మేశారని, గూగుల్‌ మ్యాపులో చూసుకొని తమ వాటా స్థలానికి వచ్చామని వాదించారు. దాంతో సదరు గృహస్థులు ఈ విషయాన్ని స్థల యజమానుల్లో ఒకరైన రుద్రరాజు అప్పలరాజుకు చేరవేశారు. దాంతో ఆయన తన పత్రాలన్నీ పట్టుకొని ఆగమేఘాలపై అక్కడికి వచ్చారు. ఈలోగా భూమాయగాళ్లు అక్కడి నుంచి మాయమైపోయారు. భూమిని ఖాళీగా వుంచితే ఇలాంటి సమస్యలే వస్తాయని, వెంటనే ఆయన సోమవారం ఉదయం తుప్పలన్నీ తొలగించి, సెక్యూరిటీని పెట్టారు. 


పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా

రుద్రరాజు అప్పలరాజు, స్థల యజమాని

హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ నుంచి 1998లో రెండు ప్లాట్లు ( ఒకటి 367, మరొకటి 333) కొన్నాను. ప్రహరీ నిర్మించి గేట్లు పెట్టాము. ఈ ఇరవై ఏళ్లలో నాలుగైదుసార్లు గేట్లు ఎత్తుకుపోయారు. మరి గేట్లు పెట్టలేదు. తుప్పలు బాగా పెరిగిపోయాయి. ఎదురుగా తెలిసిన వారు ఇళ్లు కట్టుకొని వున్నారని ధైర్యంగా ఉన్నాము. ఇప్పుడు తాతకు వారసులం అంటూ ఎవరో వచ్చారు. మాతో సెటిల్‌మెంట్‌కు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాము. పోలీసులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తతో సెక్యూరిటీని పెట్టాము.