Abn logo
Jun 19 2021 @ 00:38AM

కమిటీల కథలు ఆపి విచారణ కమిషన్ వేయండి!

భూ అక్రమాలపై కమిటీ వేయడం సులువే. కానీ, కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలుపరిచే ధైర్యం పాలకులకు ఉన్నదా అన్నదే పెద్ద సవాలు. టీఆర్‍ఎస్ ప్రభుత్వం వేసిన కమిటీల రిపోర్టులు నేరుగా చెత్తకుండీలోకి వెళ్తున్నాయి. భూ అక్రమాల పరిష్కారానికి తూతూ మంత్రంగా వ్యవహరిస్తే సరిపోదు. న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటు ఒక్కటే దీనికి పరిష్కారం.


చారిత్రకంగా తెలంగాణకి భూమితో అవినాభావ సంబంధం ఉంది. నిజాం వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు భూమితో ముడి పడి ఉన్నవి. ప్రతిసారి భూమికి సంబంధించిన అంశం తెర మీదికి రావడం, కొంతకాలం ప్రచారంలో నలగడం, తరువాత వెనక్కి పోవటం పరిపాటిగా మారింది. గతంలో నయీం భూములు, మియాపూర్‌, కోకాపేట, హఫీజ్‌ పేట భూములు వంటివి ఇలాగే వెనక్కి వెళ్ళిపోయాయి. తాజాగా దేవర యంజాల్‌ భూములు, అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రివర్గం నుంచి సీనియర్‌ మంత్రి ఈటల రాజేందర్‌ తొలగింపుతో భూమి మరోసారి చర్చనీయాంశంగా మారింది.


ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో భూ అంశంపై రోజుల తరబడి చర్చలు సాగాయి. 2004 అసెంబ్లీలో భూ అంశం తెరపైకి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు స్వయంగా ఇందిరా పార్కులో నిరవధిక దీక్షకు కూర్చోవడం, 2006లో బంద్‌కు పిలుపునివ్వడంతో ముదిగొండలో ఏడుగురు బలయ్యారు. ఆనాటి ఉద్యమ పోరాటం సందర్భంగా ప్రభుత్వం దిగివచ్చి సీనియర్‌ మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని జిల్లాలలో పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, అటవీ భూములు, భూసంస్కరణల చట్టంలోని లొసుగులు, కుంట శిఖాలు, ఇనాం, నాళాలు, భూదాన్‌ యజ్ఞ లాంటి అంశాల్లో సమస్యలను పేర్కొంటూ, అవన్నీ పరిష్కారం కావాలంటే మొదట ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని, అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉండాలని సలహా ఇచ్చింది. మొత్తం 104 సిఫార్సులను ప్రభుత్వానికి అందించింది. అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే భూములు లేని వారికి రెండు నుంచి మూడు ఎకరాల భూమిని ఇవ్వవచ్చని నివేదిక ఇచ్చింది. అయితే స్వతంత్రంగా పని చేసేందుకు అంబడ్సుమెన్‌ లాంటి కమిటీ ఉండాలని అసెంబ్లీలోనూ బయటా ఆందోళన చేసినప్పటికీ ఆనాటి వైయస్సార్‌ ప్రభుత్వం నామమాత్రంగా ఐఏఎస్‌ అధికారితో భూ కమిషనరును నియమించి చేతులు దులుపుకుంది. ఆ సిఫార్సులన్నీ బుట్టదాఖలయ్యాయి.


2000 సంవత్సరం తర్వాత రియలెస్టేట్‌ ఊపందుకొంది. ఎలాంటి శ్రమ లేకుండా అసైన్డ్‌ భూములే కాదు అనేక రకాల భూములను కూడా ఆక్రమించి, దొంగ కబ్జాలకు, రికార్డుల సృష్టికి బరితెగించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక భూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన కొండాపూర్‌ పక్కన గల హఫీజ్‌పేట భూములు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. మియాపూర్‌ గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌‌కు చెందిన భూముల అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగులోనే ఉన్నది. కోకాపేట భూముల వ్యవహారం పూర్తిగా రెవెన్యూ లీలలకు నిలయమైంది. గ్యాన్సా గూడ దేవుని గుట్ట, సరూర్‌నగర్‌, కీసర భూములు అలాగే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ భూములు, హైదరాబాదులోని వేలాది చెరువులు కుంటల అదృశ్యం, నాలా భూముల ఆక్రమణ, అయ్యప్ప కాలనీ లాంటివి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. భూదాన్‌ యజ్ఞ భూములు కూడా వేలాది ఎకరాలు అక్రమానికి గురయ్యాయి. గ్యాంగ్‌స్టర్ నయీం భూముల వ్యవహారంలో అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల హస్తం ఉన్నదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే సెలవిచ్చారు. ఎంతటి పెద్దవారినైన వదలం అన్నారు. కానీ నయీం డైరీ ఇప్పటిదాకా బయట పెట్టలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో, ఎంపీలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియలెస్టేట్‌ వ్యాపారంతో సంబంధం ఉన్నవారే అధికంగా ఉన్నారనేది నగ్నసత్యం.


ఈ మధ్య ఈటల రాజేందర్‌ హకీంపేట, అచ్చంపేట అసైన్డ్‌ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. పీఓటీ యాక్ట్‌ 1977లో అమల్లోకి వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా 2018లో దానికి సవరణ తెచ్చింది. చట్టం పట్ల అవగాహన ఉన్న ఎమ్మెల్యే, మంత్రులు ఇలాంటి నీచస్థితికి దిగజారారు. రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నందునే అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైనాయి అనేది వాస్తవం. తెలంగాణలో 20,13,833 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉంటే అందులో 2,14,627 ఎకరాల భూములు బడాబాబుల స్వాధీనంలో మారాయి అని తెలుస్తున్నది. ఇది తేలాలంటే తూతూ మంత్రంగా వ్యవహరిస్తే సరిపోదు. దీనిపైన చట్టబద్ధమైన న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటే పరిష్కారం.


దేవరయాంజాల్‌, సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి చెందిన 1531 ఎకరాలకు గాను వెయ్యి ఎకరాల వరకూ అక్రమంగా గోదాములు, ఫంక్షన్‌ హాల్స్‌, ఇండ్లు నిర్మించబడ్డాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేసింది. నయీం సంఘటనపై కూడా కమిటీ ఏర్పాటూ హంగామా జరిగింది. తదుపరి ఎంత మొత్తుకున్నా అరణ్యరోదన గానే మిగిలిపోయింది. దేవరయంజాల్‌ భూములలో కూడా అనేక మంది పెద్దల హస్తం ఉందని ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అందులో మంత్రులకు, చివరికి అధికార పార్టీకి చెందిన పత్రికకు కూడా భూములు ఉన్నవనే చర్చ సాగుతున్నది. కమిటీ వేయడం సునాయాసం. కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలుపరిచే ధైర్యం ఈనాటి పాలకులకు ఉన్నదా అన్నదే పెద్ద సవాలు. టీఆర్‍ఎస్ ప్రభుత్వ కాలంలో వేసిన కమిటీల రిపోర్టులు నేరుగా చెత్తకుండీలోకి వెళ్తున్నాయి.


2014 డిసెంబర్‌ 9, 16 తేదీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలు ఎండకు ఎండుతూ, వానకు నానుతూ, చలికి వణుకుతూ గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారని, వారికి 125 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని, డబుల్‌ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని, నాలాల పక్కన రేకుల షెడ్లు వేసుకునే నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేస్తామని 58, 59 జీవో తెచ్చారు. ఇప్పటికీ ఆ జీవోలు అమలు కావడంలేదు.


కేసీఆర్ సెప్టెంబరులో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు. ఇప్పటికి ఏడు మాసాలు గడుస్తున్నాయి. 2017లో భూప్రక్షాళన పేరుతో ప్రచారం తారస్థాయికి చేరుకున్నది. ఆఖరుకు కొండను తవ్వి ఎలకను కూడా పట్టుకోలేని దుస్థితి. ఇంచు ఇంచుకు భూ లెక్కలలో అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతం అంశం ఎందుకు తెర పైకి రాలేదు. ఇప్పటి చట్టంలో సర్వే నెంబరువారీగా భూ సమగ్ర సర్వే చేపట్టడానికి పూనుకొని జూన్‌ 11 నుండి 27 గ్రామాలలో పైలెట్‌ సర్వే చేపట్టడం మంచి పరిణామం. అయితే దీనికి సంబంధించి విస్పష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాలి. ఒక్కొక్క సర్వే నెంబరు విస్తీర్ణం ఒక రకంగా రెండు ఎకరాల నుండి 600 ఎకరాల వరకు ఉన్నది. అందుకనే అఖిలపక్ష సమావేశం, రెవెన్యూ నిపుణులతో మాట్లాడి సర్వే చేపట్టడం సబబుగా ఉంటుంది. భూ దొంగల రికార్డులు, దొంగ కబ్జాల అంశంపట్ల ప్రభుత్వం అలసత్వం వహించడం అన్యాయం. అసైన్డుభూములు, చెరువు, కుంట శిఖాలు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, భూదాన్ యజ్ఞ భూములు లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమై, రియలెస్టేట్‌ వ్యాపారుల పంట పండిస్తున్నాయి. దీనిపై దృష్టిపెట్టడం మానివేసి, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూములను వేలం వేయడం దూరదృష్టి లేకపోవడమే. ఇది ముమ్మాటికీ ప్రజల భవిష్యత్‌కు అన్యాయం చేసే చర్య. 


తెలంగాణలోని భూ అక్రమాలకు ముగింపు పలకాలంటే సీఏం కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది. ఆయన ఎన్నిరకాల ఒత్తిడులు వచ్చినా లొంగకుండా ఉండగలడా అన్నదే కీలకాంశం. కమిటీలు వేయడం చేతులు దులుపుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. లోపభూయిష్టమైన నేటి వ్యవస్థలో నిజాయితీ, నిబద్ధతతో కూడిన న్యాయవిచారణ కమిషన్‌ తప్ప వేరే మార్గం లేదు. తుట్టెని కదపనంత వరకు ఎవరో ఒకరు తేనె తాగుతూనే ఉంటారు. ఒక వైపు సమగ్ర సర్వే జరుపుతూ జీవో 58, 59లలో ఇండ్ల స్థలాల సర్టిఫికెట్స్‌ ఇస్తూ నిరుపేదల ఇండ్లను క్రమబద్ధీకరించాలి. అలాగే పోడు భూములు, జీవో 58, 59 భూములు, సాదా బైనామ తదితర అంశాలను పరిష్కరించాలి. అనంతరం ప్రభుత్వం వద్ద తేలే భూమిని, పేదల వ్యవసాయానికి, పేద, మధ్య తరగతి ఆవాసాలకు వినియోగించాలి. హైదరాబాద్‌లో భూముల అమ్మకం ప్రతిపాదనను ఉపసంహరించుకొని బ్లడ్‌ బ్యాంకుల్లాగా భూబ్యాంకులను ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుంది.


చాడ వెంకటరెడ్డి

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

ప్రత్యేకంమరిన్ని...