ఎస్‌ఐకు కేటాయించిన స్థలం కబ్జాయత్నం

ABN , First Publish Date - 2021-04-04T15:38:16+05:30 IST

నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎస్‌ఐకి కేటాయించిన స్థలం

ఎస్‌ఐకు కేటాయించిన స్థలం కబ్జాయత్నం

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఎస్‌ఐకి కేటాయించిన స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ షేక్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో ఎస్‌ఐ విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్‌ చాలాకాలం క్రితం జనశక్తి గ్రూపు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో మరణించారు. అప్పటి ప్రభుత్వం జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 36లో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి ఆనుకొని ఉన్న సర్వే నెంబ ర్‌ 403లో ఉన్న రెండు వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. పొట్లూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి సదరు స్థలం సొసైటీ తనకు విక్రయించిందని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. 


అప్పట్లోనే రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యవహారం కోర్టుకు వెళ్లింది. కోర్టులో వివాదం పరిష్కారం కాకముందే శ్రీనివాసరావు మరోసారి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. శ్రీనివాసరావు, సైట్‌ ఇంజనీర్‌ రంగనాయకులు, నర్సింహారెడ్డి పనులు నిర్వహిస్తుండగా, సమాచారం అందుకున్న తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి అడ్డుకొని స్థలాన్ని కాపాడారు. అంతే కాకుండా ప్రభుత్వ స్థలం అని సూచించే బోర్డు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-04T15:38:16+05:30 IST