Abn logo
Sep 26 2021 @ 16:23PM

భూ కుంభకోణంలో మంత్రి వెల్లంపల్లి అనుచరులు

అమరావతి: దేవాదాయ శాఖకు చెందిన ఆ భూమి విలువ రూ. 18 కోట్లు. వాటిని పట్టించుకునేవారు లేకపోవడంతో అక్రమార్కుల కన్ను ఆ స్థలంపై పడింది. దీంతో పాటు రూ. 50 కోట్ల విలువ చేసే భోగవల్లి సత్రం ఆస్తుల్ని రూ. 3 కోట్లకే లాక్కునేందుకు తెరలేపారు. అంతే అమాత్యుని చెంతనే తిరిగేవారు ఒక బృందంగా ఏర్పడిన పీఏ, ఓఎస్డీ, అతని మామ, మరికొంతమంది కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఎన్‌ఓసీకి కూడా దరఖాస్తు చేసి.. అర్హత పత్రం రాగానే అంగట్లో అమ్మెద్దామనుకున్నారు. తీరా డబ్బు లావాదేవీల వద్ద వివాదం చెలరేగడంతో వ్యవహారం బెడిసికొట్టి గుట్టంతా రట్టయ్యింది. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరగణమే ఈ కుంభకోణంలో సూత్రధారులు కావడం విశేషం.


కంచే చేను మేసే చందంగా భూములను కాపాడాల్సిన.. మంత్రి దగ్గర పనిచేసేవారే పక్కదారిలో స్థలాలు కొట్టేయాలని పథకం రూపొందించారు. గుట్టు చప్పుడు కాకుండా రూ. 50 కోట్ల విలువ చేసే దేవుడి మఠం, సత్రం భూములు కబ్జా చేశారు. విజయవాడ పరిధిలో భోగవల్లి అప్పారావు సత్రంకు సంబంధించిన ఆస్తులు విక్రయించేందుకు నకిలీ పత్రాలను కూడా సృష్టించారు. మంత్రి వెల్లంపల్లి వద్ద పని చేస్తున్న ఓఎస్డీ అశోక్ మామా కాశీరావు పేరుతో లావాదేవీలు జరిపినట్లు రాసేశారు. మొత్తం అంటే అనుమానం వస్తుందని మరికొంత భాగం స్నేహితుల పేరుతో రాసి కథ నడిపారు. లావాదేవీల విషయంలో దాదాపు రూ. 40 లక్షల వరకు చేతులు కూడా మారాయి. మధ్య వర్తులుగా కమీషన్లు కూడా పుచ్చుకున్నారు. అయితే అనుకున్న సమయానికి ఎన్‌ఓసి రాకపోవడం, డబ్బులు కూడా మధ్యలో కొంత దారితప్పడంతో వివాదం మొదలయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం వరకు వెల్లడంతో అసలు బాగోతం బయటకొచ్చింది. 

ఇవి కూడా చదవండిImage Caption