కాలువ గట్లు కబ్జా!

ABN , First Publish Date - 2021-04-11T05:56:18+05:30 IST

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అపర భగీరఽథిగా నిలుస్తోంది తోటపల్లి రిజర్వాయర్‌. ప్రధాన కాలువల ద్వారా రెండు జిల్లాల్లో వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. అటువంటి కాలువలను సైతం కొందరు అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. కాలువ గట్లను ఆక్రమించుకుంటున్నారు.

కాలువ గట్లు కబ్జా!
చదునుచేసి సాగుచేస్తున్న దృశ్యం







చదునుచేసి సాగు

బలహీనమవుతున్న 

తోటపల్లి కుడి కాలువ

ఆందోళనలో ఆయకట్టు రైతులు

పట్టించుకోని అధికారులు

(చీపురుపల్లి)

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అపర భగీరఽథిగా నిలుస్తోంది తోటపల్లి రిజర్వాయర్‌.  ప్రధాన కాలువల ద్వారా రెండు జిల్లాల్లో వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. అటువంటి కాలువలను సైతం కొందరు అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. కాలువ గట్లను ఆక్రమించుకుంటున్నారు. మరికొందరు గట్లను చదునుచేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అధికారులు అటువైపుగా చూడకుండా పావులు కదుపుతున్నారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో కుడి ప్రధాన కాలువ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కడికక్కడే ఈ ఆక్రమణల పర్వం దర్శనమిస్తోంది. ముఖ్యంగా కర్లాం, కాపు శంభాం, చుక్కవలస, కొండ శంబాం గ్రామాల్లో కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. తోటపల్లి అధికారులు, సాగునీటి శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా కాలువ గట్టు బలహీనమవుతోంది. ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఎకరాల ఆయకట్టుకు తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నుంచి గరివిడి మండలం చుక్కవలసలోకి ప్రవేశిస్తుంది. కాపుశంబాం మీదుగా చీపురుపల్లి మండలం రామలింగపురం, నాగంపేట, రావివలస తదితర గ్రామాల మీదుగా కాలువ విస్తరించి ఉంది. చీపురుపల్లి మండలం నుంచి తిరిగి గరివిడి, గుర్ల మండలాల మీదుగా చంపావతి నదికి చేరుతుంది. కాలువ రక్షణ కోసం ఇరువైపులా భారీ గట్టు ఏర్పాటుచేశారు. కానీ ఈ గట్లు అక్రమార్కుల బారినపడి బలహీనమవుతున్నాయి. అప్పట్లో కాలువ నిర్మాణంతో పాటు ఇతర అవసరాలకు కొంత భూమిని సేకరించారు. ఆ భూమిని సైతం కొందరు చదును చేసి సాగుచేస్తున్నారు. కాలువ ఒంపులున్న ప్రదేశాల్లో 13.5 మీటర్లు, ఒంపులు లేని ప్రదేశాల్లో 12.7 మీటర్లు ఉండాలి. కానీ ఇప్పుడు చాలాచోట్ల అంత విస్తీర్ణంలో కాలువ లేదు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు ఆక్రమణలు పెరుగుతున్నాయి. 


పోలీస్‌ కేసులు తప్పవు

తోటపల్లి కాలువ గట్ల ఆక్రమణలపై దృష్టి సారించాం. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఆక్రమణదారులకు నోటీసులు అందిస్తాం. ఆక్రమణలు తొలగించకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలకు ఉపక్రమిస్తాం. అవసరమైతే పోలీస్‌ కేసులు నమోదుచేస్తాం. 

- శ్రీనివాస్‌, డీఈఈ, తోటపల్లి ప్రాజెక్ట్‌





Updated Date - 2021-04-11T05:56:18+05:30 IST