భూ మాఫియా ఆగడాలు...

ABN , First Publish Date - 2020-08-04T10:25:44+05:30 IST

కరీంనగర్‌ను శివారు ప్రాంతాల్లో భూ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువు, కుంటల శిఖం భూములను

భూ మాఫియా ఆగడాలు...

యథేచ్ఛగా శిఖం భూముల ఆక్రమణ, రిజిస్ట్రేషన్లు 

ఖాళీస్థలం కనిపిస్తే పాగా..బెదిరింపులతో స్వాధీనం

భూకబ్జా కేసుల్లో బొమ్మకల్‌ సర్పంచ్‌ అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌


కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 3: కరీంనగర్‌ను శివారు ప్రాంతాల్లో భూ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువు, కుంటల శిఖం భూములను కబ్జా చేస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. భూ కబ్జాదారులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతోపాటు కొందరు ప్రజాప్రతినిధు అండదండలు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 


శివారు ప్రాంతాలపై కన్ను

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీగా ఎంపికవటం, ఐటీ టవర్‌,  మానేరు రివర్‌ఫ్రంట్‌ తదితర అభివృద్ధిప నులతో నగరానికి చుట్టుపక్కల ఉన్న భూముల విలువ పెరిగింది. ఈ విలువైన భూములపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న భూమాఫియా అంతటితో దాహంతీరక ప్రజల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ అక్రమ దందాలపై రెవెన్యూ అధికారులను అడిగితే తమకు ఏమీ తెలియదని దాటేస్తున్నారు. కరీంనగర్‌ను ఆనుకుని ఉన్న బొమ్మకల్‌, తీగలగుట్టపల్లి, చింతకుంట, సీతారాంపూర్‌, ఆరెపల్లి తదితర గ్రామాలపరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. బొమ్మకల్‌ గ్రామం పరిధిలో దాదాపు 100 ఎకరాలపైగానే ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం.


ఒక ప్రజాప్రతనిధి భూ మాఫియాను నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువుత్తుతున్నాయి. బొమ్మకల్‌ గ్రామ పంచాయతిలోని సర్వే నంబర్‌ 28, 74, 105, 108,  728లో ప్రభుత్వ భూములైనప్పటికీ దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బొమ్మకల్‌ పరిధిలోని చాలా వెంచర్లలో ఖాళీ స్థలాలను కూడా ఈ భూమాఫియా కబ్జా చేసింది. పార్క్‌ కోసం కేటాయించిన స్థలాలతోపాటు, ఆట స్థలాలు, గుడి స్థలాలను ఆక్రమించి ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ జరిపారు. కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


వీఆర్వో, వీఆర్‌ఏల ఇళ్లలో రెవెన్యూ రికార్డులు...

తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండాల్సిన రెవెన్యూ రికార్డులు వీఆర్వో, వీఆర్‌ఏ ఇళ్లలో ఉంటున్నాయి. పట్టా భూములు రికార్డులు పొందుపరిచే పహణి, ఇతర రికార్డులు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు తమ ఇళ్ళకు తీసుకునిపోయి అక్కడే అక్రమదందాలకు తెరలేపుతున్నారు. స్థానికంగా ఉండే కొందరు భూ కబ్జాదారులతో కుమ్మక్కవుతున్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు పహనీలలో మార్పులు చేస్తూ భూ వివాదాలను సృష్టిస్తున్నారు. ఈ భూ మాఫియ కానుకలకు తలొగ్గుతున్న రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు ప్రభుత్వ భూములను కూడా యదేచ్ఛగా రిజిస్ట్రేషనులు చేస్తుండటం గమనార్హం. 


భూ కబ్జా బాధితుల సంఘం ఆందోళ....

కరీంనగర్‌ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో వ్యవసాయభూములు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులు ఒక సంఘంగా ఏర్పడి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బొమ్మకల్‌ సర్పంచ్‌కు వ్యతిరేకంగా శనివారం భూకబ్జా బాధితుల సంఘం కరీంనగర్‌లో ధర్నా చేసింది. భూకబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. తీగలగుట్టపల్లి, సీతారాంపూర్‌, అరెపల్లి, చింతకుంట తదితర గ్రామాల్లో భూములు కోల్పోయిన వారు భూ మాఫియాపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌ అరెస్టు

బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌ను కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బొమ్మకల్‌ గ్రామపరిధిలో పలువురి భూములను ఆయన అక్రమంగా కబ్జా చేశాడని, చంపుతానని బెదిరించాడని వచ్చిన ఫిర్యాదులతో కరీంనగర్‌ రూరల్‌ పోలీసు ఠాణాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి.  ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ అరెస్టు కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 10 రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తనసెల్‌ఫోన్‌ వాడకుండా ఇతరుల ఫోన్‌ ఉపయోగించటంతో ఆయన పోలీసులకు చిక్కలేదని సమాచారం.  ఆదివారం ఒక న్యాయవాది వద్దకు వెళ్లిన సమయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-08-04T10:25:44+05:30 IST