వాగు పోరంబోకు భూమి హాంఫట్‌

ABN , First Publish Date - 2021-06-14T05:24:37+05:30 IST

మండలంలోని జమ్మలమడుగు పంచాయతీ పరిధిలో ఉన్న వాగు పోరంబోకు భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది.

వాగు పోరంబోకు భూమి హాంఫట్‌
అక్రమంగా సాగు చేసిన చేపల చెరువు

20 ఎకరాల వాగు భూమి కబ్జా      

చేపల చెరువుగా మార్చుకున్న అక్రమార్కులు

భూమి విలువ రూ. 2 కోట్లు పై మాటే

ముండ్లమూరు, జూన్‌ 13 : మండలంలోని జమ్మలమడుగు పంచాయతీ పరిధిలో ఉన్న వాగు పోరంబోకు భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంతో అక్రమార్కులు భరి తెగించి ఏకంగా చేపల చెరువులు వేసేందుకు సిద్ధం చేశారు. 

జమ్మలమడుగు సర్వే నెంబరు 272/1, 272/2, 272/3లలో 6.15 ఎకరాల్లో రైతుల వద్ద రిజిస్టర్‌ భూములను కొందరు  కొనుగోలు చేశారు. దాని పక్కనే ఉన్న వాగు పోరంబోకు భూమి 271, 273, 274 సర్వే నంబర్లలో 20 ఎకరాలకు పైనే ఉంది. దీంతో ఈ వాగు పోరంబోకు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా చెరవులుగా మార్చారు. కొంత పట్టా భూమిని కొని రెవెన్యూ అధికారులకు అనుమానం రాకుండా పక్కనే ఉన్న 20 ఎకరాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ‘అధికారం తమ చేతిలో ఉంది కదా..?’ అడిగే వారే లేరన్న చందంగా ఆక్రమించుకున్న భూమిలో ఎనిమిది చెరువులు తవ్వి వాటిలో నీరు పెట్టారు. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి ఎకరం రూ 10 లక్షలకు పైగానే ఉంటుందని ఆ గ్రామస్థులు తెలిపారు. ఈ భూమిని ఆక్రమించుకున్న వారు దొనకొండ, నూజెండ్ల మండలాలకు చెందిన అధికార పార్టీ నేతలని విశ్వసనీయ సమాచారం.

చోద్యం చూస్తున్న అధికారులు

దాదాపు రూ.2 కోట్ల విలువైన వాగు పోరంబోకు భూమి ఆక్రమణకు గురైతే సంబంధిత రెవెన్యూ అధికారులు కనీసం ఆ వైపు వెళ్లిన దాఖలాలు లేవు. వాగులను ఆక్రమించుకొని చెరువులుగా మలుచు కోవడంతో పాటు మరికొన్ని చెరువులు వేసేందుకు భూములు చదువును చేసి కట్టలు పోశారు. మరి కొంత భూమిని ఆక్రమించేందుకు చిల్లచెట్లను తొలగిస్తున్నారు. ఈ ఆక్రమణలను నివారించకపోతే దిగువన ఉన్న గ్రామాల్లో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది.  ఆ వాగు దిగువన దాదాపు 20 గ్రామాల ప్రజలకు తాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఆయా గ్రామాల్లో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద మంచి నీటి ట్యాంకులు నిర్మించారు. తద్వారా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఇక చెరువులు ఆక్రమించుకున్న వారు వాటికి విద్యుత్‌ సౌకర్యం కోసం ఏకంగా పక్క జిల్లా నుంచి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్టు సమాచారం. 

ఆక్రమణ దారులకు నోటీసులు ఇస్తాం :  పార్వతి, తహసీల్దార్‌

జమ్మలమడకలో వాగు భూమిని ఆక్రమించుకొన్న వారికి నోటీసులు ఇస్తాం. ఇప్పటికే ఆ గ్రామ సర్పంచ్‌ నలమోలు వెంకటేశ్వరరావు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. చేపల చెరువులు వేసినట్టు నా దృష్టికి రాలేదు. విచారించాల్సిందిగా ఇప్పటికే వీఆర్‌వోను ఆదేశించా. నివేదిక రాలేదు. సోమవారం పరిశీలించి నేరుగా నోటీసులు ఇస్తా. 


Updated Date - 2021-06-14T05:24:37+05:30 IST