ధరల పెరుగుదలతో భూ వివాదాలు

ABN , First Publish Date - 2021-02-21T04:55:57+05:30 IST

భూమి ధరలకు రెక్కలు రావడంతో రక్త సంబదీకుల మధ్య చిచ్చు రాజేస్తుంది.

ధరల పెరుగుదలతో భూ వివాదాలు
పొలంలోనే ఉంటున్న కొనుగోలు దారులు

 చిరునోములలో అక్కాచెల్లెళ్ల మధ్య భూ  సమస్య 

 ఆందోళనలో బాధితులు 

 సర్వే అధికారుల లీలలతో సాగుతున్న వివాదం!

బోనకల్‌, ఫిబ్రవరి 20: భూమి ధరలకు రెక్కలు రావడంతో రక్త సంబదీకుల మధ్య చిచ్చు రాజేస్తుంది. బోనకల్‌ మండలం చిరునోముల రెవెన్యూ పరిధిలో గల వివాదాస్పదంగా మారిన పొలంలో శనివారం ప్లాట్లను కొనుగోలు చేసిన కొంతమంది రేకులతో  తాత్కాలిక షెడ్‌లు వేసుకుంటున్నారు. వైరా ఏసీపీ  సత్యనారాయణ ఇరు వర్గాల వారిని పిలిచి మాట్లాడారు. 

రావెళ్ల పద్మావతి సర్వే నెంబర్‌ 132/అ లో ఉన్న 1.33 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు దరఖాస్తు చేసుకోగా నాటి ఆర్‌డీవో ద్వారా ఎ4/2820/2013 ద్వార కన్వర్షన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆ భూమిలో చేసిన ప్లాట్లను కొంతమందికి అమ్మారు. ఆమె సోదరి గిరిజ అదే పోలాన్ని సర్వే చేపించగా జిల్లా సర్వే అధికారులు ఆ భూమికి 133 సర్వే నంబర్‌ను ఇచ్చారు. ఒకే భూమికి సంబందించి అక్కాచెల్లెళ్లకు వేర్వేరుగా సర్వే అధికారులు నెంబర్లు ఇవ్వడంతో ఇద్దరూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సర్వే అధికారులు ఒకే భూమికి రెండు సర్వే నెంబర్లు వేర్వేరుగా ఇవ్వడం వివాదానికి కారణమని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిలో షెడ్‌లు వేస్తున్నారని ఆక్రమణలకు పాల్లపడుతున్నట్లు కొనుగోలుదారుల పై గిరిజ పోలీసులకు ఫిర్యాదు చేయగా తమను కులం పేరుతో దూషించారని, వేదిస్తున్నారని కొనుగోలు దారులు ఆమెపై ఫిర్యాదు చేశారు. నగరాలను తలపించేలా బోనకల్‌ శివారు ప్రాంతంలో ఉన్న భూములకు రియల్‌ ఎస్టేట్‌ దారులు రేట్లను పెంచేసారు. అన్ని నిబందనలను పాటించి వెంచర్లను వేయకుండా  కాగితాల పై ప్లాట్లను అమ్మి రిజిస్ట్రేషన్‌కు ముందుగానే పలువురి చేతులు మారడం రేట్ల పెరుగుదలకు కారణమవుతుందని పలువురు బావిస్తున్నారు. బోనకల్‌లో గజం స్థలం కొనాలంటే 30 నుంచి 50 వేల వరకు ధర చెబుతుండటం ఇక్కడ భూ ధరల రెక్కలకు అద్దం పడుతుంది. సామన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా భూ ధరలు ఇక్కడ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   


Read more