Abn logo
Mar 3 2021 @ 04:05AM

నేలవిడిచి సాము!

భూముల రీసర్వేపై సర్కారు కళ్లకు గంతలు 

326 గ్రామాల్లో డ్రోన్‌ ఇమేజ్‌లకు 70 రోజులు 

122 రోజుల్లో 5,037 గ్రామాల్లో సాధ్యమేనా?

ఇప్పటికి కేవలం 4 గ్రామాల డేటా అప్‌లోడ్‌

జూన్‌ ఆఖరుకి తొలిదశ పూర్తిపై సందేహాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భూముల సమగ్ర సర్వేపై అధికార యంత్రాంగం నేలవిడిచి సాము చేస్తోంది. క్షేత్రస్థాయిలో సమస్యలను తొక్కిపెట్టి అంతా అద్భుతంగా ఉందని ప్రచారం చేస్తోంది. సర్వేకు అవసరమైన కీలక అంశాలు తేలకుండానే జూన్‌ నెలాఖరు నాటికి 5,037 గ్రామాల్లో తొలిదశ పూర్తి చేస్తామని నమ్మబలుకుతోంది. క్షేత్రస్థాయిలో ఆచరణకు, చెప్పే మాటలకు పొంతన లేని నివేదికలిస్తూ సర్కారు కళ్లకు గంతలు కట్టాలనుకుంటోన్న అధికారుల తీరు రెవెన్యూ, సర్వే, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ వర్గాలనే విస్మయ పరుస్తోంది. భూ సర్వే విషయంలో ఇప్పటిదాకా జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది ఏదీ ప్రభుత్వానికి చేరడం లేదని, నివేదికలతోనే అధికారులు బురిడీ కొట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


స్వచ్ఛీకరణ పూర్తవకుండానే... 

రాష్ట్రంలో భూమి రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాకే ఈ ఏడాది జనవరి నుంచి సమగ్ర సర్వే చేపడతామని సర్కారు ప్రకటించింది. కానీ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తవకుండానే, వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో లక్షలాది తప్పు లు కొనసాగుతుండగానే గతేడాది డిసెంబరు 21నుంచి సర్వే ప్రారంభించారు. మూడు విడతల్లో కలిపి 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వేను 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. తొలిదశ కింద 5,363 గ్రామాల్లో సర్వే చేయాలి. రీసర్వే పైలెట్‌ ప్రాజెక్టు అమలైన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచే సమగ్ర సర్వేను డిసెంబరు 21న ప్రారంభించారు. దీనికోసం సర్వే ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఓఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్‌ఓఐ అత్యాధునిక డ్రోన్‌ల ద్వారా భూముల ఫొటోలు తీసి ఇస్తుంది. వాటి ఆధారంగా భూముల సర్వే చేస్తారు. ఈ నెల 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన నివేదిక ప్రకారం.. రీసర్వే మొదలై 70రోజులవుతుండగా ఇప్పటివరకు 326 గ్రా మాల్లో ఎస్‌ఓఐ డ్రోన్‌ చిత్రాలు తీసింది. ఇందులో కేవలం 4 గ్రామాల డేటానే అప్‌లోడ్‌ చేశారు. అయినా జూన్‌ నెలాఖరు నాటికి తొలిదశ సర్వే పూర్తి చేస్తామని సీఎ్‌సకు నివేదించారు. 122రోజుల వ్యవధిలో 5,037 గ్రామాల్లో డ్రోన్‌లతో చిత్రాలు తీయడం, మ్యాపులు, స్కెచ్‌లతో రూపొందించి భూముల సర్వే చేయడం సాధ్యమేనాఅన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు 

ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2019ను కేంద్రం తిరస్కరించింది. గతేడాది అసెంబ్లీలో మరోసారి ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2020 రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపించారు. ఈ బిల్లు ఇంతవరకు ఆమోదం పొందలేదు. తాజాగా కేంద్ర స్టాంప్‌ చట్టంలోని అంశాలను ధిక్కరించేలా ఉందని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. ఇది ఎప్పటికి తేలుతుందో తెలియదు. రీసర్వేకు ఉపయోగించే కార్స్‌ టెక్నాలజీకి సాఫ్ట్‌వేర్‌ ముఖ్యం. రోవర్‌ల ఆధారంగా భూముల సర్వే చే సినప్పుడు కార్స్‌ ద్వారా ల్యాండ్‌పార్సిల్‌ స్కెచ్‌ను సాఫ్ట్‌వేర్‌ విడుదల చేయాలి. ఆ స్కెచ్‌లు తప్పులతో వస్తుండటంతో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ ఇంకా ఏమీ తేల్చనేలేదు. 


12వేల రోవర్లు కాదు... రెండొందలే 

సర్వే అనంతరం ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాలు ఇస్తామన్నారు. దీనికి కార్స్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యే జీఎన్‌ఎ్‌సఎస్‌ రోవర్లు అవసరం. తొలుత 12వేల రోవర్లు కొంటామన్నారు. తర్వాత ఆ సంఖ్యను 7వేలకు కుదించారు. తాజాగా 200 రోవర్ల కొనుగోలుకే మూడోసారి బిడ్‌లు ఆహ్వానించారు. ఈ టెండర్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. డిసెంబరు నెలాఖరు నాటికే 150 రోవర్లు సర్వేశాఖకు అందాలన్నది టార్గెట్‌. అది ఇంకా టెండర్ల దశలోనే ఉండిపోయింది. సర్వేశాఖ వద్ద ఉన్న 9 రోవర్లతో పనులు చేయాలంటే అవి రిపేరుకు వచ్చాయని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లింది. భూ సర్వేలో రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు కీలకం. రీసర్వేలో ఎవరు ఏ పనిచేయాలి, సమస్యలొస్తే ఎలా అధిగమించాలో స్పష్టత నిచ్చేలా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ఉండాలి. అయితే రీసర్వే అంతటికీ ఒకే ఎస్‌ఓపీ ఉండాలా, శాఖకు ఒకటి చొప్పున ఉండాలా అనేదానిపై స్పష్టత లేదు. ఇప్పటిదాకా సర్వేశాఖ ఎస్‌ఓపీనే పూర్తిగా ఖరారు కాలేదని తెలిసింది. భూ సర్వే కోసం ఆంధ్రప్రదేశ్‌ సర్వే, సరిహద్దుల చట్టం-1923కు సవరణలు చేస్తూ ఇటీవల ఆర్డినెన్స్‌  తీసుకొచ్చారు. గ్రామస్థాయిలో సర్వేయర్‌, పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులు, పట్టణాల్లో వార్డు సర్వేయర్‌, కార్యదర్శి ఇతరులు కూడా సర్వే చేసేలా, వివాదాలు పరిష్కరించేలా సవరణలు చేశారు. ఈ ఆర్డినెన్స్‌ అమలుపై న్యాయ సందేహాలు రావడంతో అడ్వకేట్‌ జనరల్‌ పరిశీలనకు పంపినట్లు సమాచారం. ఆర్డినెన్స్‌లో పేర్కొన్నట్లుగా సర్వే చేయాలని ప్రతిపాదించిన వారి అసలైన జాబ్‌చార్ట్‌ పంపించాలని ఏజీ కోరినట్లు తెలిసింది. 


కాగితాల్లోనే సర్వే 

రీసర్వేలో భూముల చిత్రాలు తీయడం ప్రాథమిక అంశమే. డ్రోన్‌లు ఇచ్చే ఫొటోల నాణ్యత పరిశీలిస్తారు. ఆ తర్వాత గ్రౌండ్‌ ట్రూతింగ్‌ చేస్తారు. వాటి ఆధారంగా స్కెచ్‌లపై మళ్లీ గీతలు గీస్తారు. వాటిని సాఫ్ట్‌కాపీలోకి అప్‌లోడ్‌ చేసి ఫైనల్‌ స్కెచ్‌ రూపొందిస్తారు. స్కెచ్‌లోని ప్రతి ల్యాండ్‌పార్సిల్‌కు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తారు. అందులోనే రైతుకు ఉండే భూమి విస్తీర్ణం కూడా వస్తుంది. రైతులు సంతృప్తి చెందే వరకు భూము ల సర్వే చేస్తామని జగ్గయ్యపేట సభలో సీఎం చెప్పారు. కానీ ఇవేవీ మొదలుపెట్టకుండా జూన్‌ నాటికి 5,037 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని చెప్పడాన్ని ఏమనాలి? నిజానికి, భూసర్వేలో రైతులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే అసలు సమస్యలు వస్తాయి. అలాంటిది ఆ ప్రక్రియ దాకా రాకముందే ప్రాజెక్టు అద్భుతంగా సాగుతోందని నివేదికలివ్వడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement