Markapur: ‘భూంఫట్‌’లో కొత్తకోణం

ABN , First Publish Date - 2021-07-12T05:35:32+05:30 IST

మార్కాపురంలో..

Markapur: ‘భూంఫట్‌’లో  కొత్తకోణం
వీఆర్వో తన కోడలు పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న పోరంబోకు భూమి

వీఆర్వోల కుటుంబీకులకు పట్టాలు

అధికారుల విచారణలో బయటపడుతున్న వాస్తవాలు

రాయవరంలో ఒక వీఆర్వో అత్త పేరుపై ఎకరా ఆన్‌లైన్‌

ఆయన సస్పెన్షన్‌కు రంగం సిద్ధం

ఇడుపూరులో మరొకరి కుటుంబ సభ్యుల పేర్లతో 14.42 ఎకరాలు!


మార్కాపురం: మార్కాపురంలో మండలంలో జూన్‌లో జరిగిన భూబాగోతాలు అధికారుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొందరు వీఆర్వోలు రైతులను అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడగా, మరికొందరు ఏకంగా తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదనే ప్రభుత్వ భూమిని మార్చుకున్నారు. ఈ వ్యవహారమంతా మండల తహసీల్దార్‌ కార్యాలయంలో కీలక పోస్టులో పని చేసిన ఓ అధికారిని లోబర్చుకొని గత నెలలో ఆయన ఉద్యోగ విరమణ చేసే కొద్దిరోజుల ముందు చక్కబెట్టుకున్నారు. ఈ మొత్తం అక్రమాలపై  ‘భూంఫట్‌’ శీర్షికన ఈ నెల 3వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జేసీ వెంకటమురళి వెలిగొండ ప్రాజెక్ట్‌ భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనంను విచారణాధికారిగా నియమించారు. ఆమె విచారణలో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు సమాచారం. 


వీఆర్వోల కుటుంబీకుల పేర్లతో పట్టాలు

మండలంలో పనిచేస్తున్న కొందరు వీఆర్వోలు ఉద్యోగ విరమణ చేస్తున్న అధికారితో తమ కుటుంబీకుల పేర్లపైనే ఆన్‌లైన్‌లో పట్టాలు చేయించుకున్నట్లు సమాచారం. మండలంలోని రాయవరం రెవెన్యూ పరిధిలో గత నెల 1 నుంచి 31వరకూ నిర్వహించిన భూ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను విచారణాధికారి పరిశీలించగా ఈ విషయం బహిర్గతమైంది. అక్కడ సర్వే 167/3-1లో  సంబంధిత గ్రామానికి చెందిన వీఆర్వో తన అత్త పేరుపై 1 ఎకరా భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయింసుకున్నాడు. అందుకు సదరు తహసీల్దార్‌ సైతం ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సిగ్నేచర్‌ చేశారు. ఎకరా కదా అనుకుంటే పొరపాటే.  ఎకరం పొలం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వైద్య కళాశాలకు సమీపంలోనే ఉంది. 


ఇడుపూరులో ఇలా..

మరో గ్రామ రెవెన్యూ అధికారి తన కుటుంబసభ్యుల పేరుతో 14.42 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేయించుకున్నాడు. మార్కాపురం పట్టణంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో తన కుటుంబీకుల పేర్లతో మండలంలో ఇడుపూరులో ఈ తతంగమంతా గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసుకున్నాడు. పెద్ద కొడుకు పేరుమీద ఇడుపూరు రెవెన్యూ ఇలాకాలోని సర్వే నెంబర్‌ 1114-2లో 1.11 ఎకరాలు, 51.2లో 3 ఎకరాలు, 63లో-1లో 1.35 ఎకరాలు మొత్తం 5.46 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేయించుకున్నాడు. చిన్న కొడుకు పేరు మీద సర్వే నెంబర్‌ 1114-2లో 1.11 ఎకరాలు, 51.2లో 2 ఎకరాలు, 63లో-1లో 1.35 ఎకరాలు మొత్తం 4.46 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేయించాడు. ఈ రెండు వ్యవహారాలు 26 జూన్‌ 2021న పూర్తి చేశారు. పెద్ద కుమారుడు భార్య పేరున జూన్‌ 27న సర్వే నెంబర్‌ 290-2లోని 4.5 ఎకరాల పోరంబోకు భూమిని ఆన్‌లైన్‌ చేశారు. ఇది విచారణలో తేలాల్సి ఉంది. 


వీఆర్వోపై వేటుకు రంగం సిద్ధం

జేసీ వెంకట మురళి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన స్పెషల్‌ కలెక్టర్‌ సరళా వందనం తొలుత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని రాయవరంలో జరిగిన రెవెన్యూ లావాదేవీలపై విచారణ  చేపట్టారు. అందులో నిర్ధారణ అయిన అంశాలపై జేసీ వెంకట మురళికి నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా సదరు వీఆర్వోపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం నుంచి మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో భూ లావాదేవీలకు సంబంధించి విచారణ జరగనుంది. రికార్డులన్నీ పరిశీలించనున్నారు. వాటిలో మరికొన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-12T05:35:32+05:30 IST