Abn logo
Feb 24 2021 @ 22:55PM

నీటి తీరువా పన్ను వసూళ్లపై దృష్టి సారించండి : ఆర్డీవో

ఉదయగిరి, ఫిబ్రవరి 24 : మండలంలోని గండిపాళెం, గుడినరవ, సున్నంవారిచింతల, తిరుమలాపురం గ్రామాల్లో రైతుల నుంచి నీటి తీరువా పన్ను నూరు శాతం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీవో జీ సువర్ణమ్మ ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఎంపిక చేసిన గుడినరవ గ్రామంలో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని త్వరతిగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. మ్యుటేషన్‌, అడంగళ్ల సవరణ, డాటర్‌ల్యాండ్స్‌, రేషన్‌కార్డుల అర్జీలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే మండలంలోని కొండాయపాళెం రెవెన్యూ నేలటూరు గ్రామ సమీపంలోని 1261, 1262 సర్వే నెంబర్లలోని భూమిని ఆర్డీవో సువర్ణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయగిరి-బండగానిపల్లి ఘాట్‌ నిర్మాణం, వెంకటాచలం మండలంలో ఓ పంచాయతీ రోడ్డు నిర్మాణం అటవీ శాఖకు సంబంధించిన భూమి ఉండడంతో ఆగిపోయాయన్నారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా మండలంలోని నేలటూరు గ్రామ సమీపంలోని కొండాయపాళెం రెవెన్యూలోని 1261, 1262 సర్వే నెంబరులలో 11.47 ఎకరాల భూమిని అటవీ శాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు. అక్కడ నుంచి నివేదికలు రాగానే అటవీ శాఖకు ఆ భూములు అప్పగిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు హరనాథ్‌, డీటీ ఫాజియా, సంధాని, డీఆర్వో ప్రసాద్‌, మూలె సుబ్బారెడ్డి, సర్వేయర్లు రవి, మీరావలి, వీఆర్వో శంకరయ్య, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement