భూముల క్రయ, విక్రయాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-12-01T05:01:20+05:30 IST

ములగాడ మండల రెవెన్యూ కార్యాలయానికి కొంత కాలంగా సర్వేయర్‌ లేకపోవడంతో ఇక్కడ భూముల సర్వే జరగడం లేదు. దీని వల్ల ఇక్కడ భూముల క్రయ, విక్రయాలకు బ్రేక్‌ పడింది.

భూముల క్రయ, విక్రయాలకు బ్రేక్‌
ములగాడ మండల రెవెన్యూ కార్యాలయం

ములగాడలో సర్వేయర్‌ లేకపోవడంతో పనులకు ఆటంకం

ప్రజలకు తప్పని ఇబ్బందులు


ములగాడ, నవంబరు 30 : ములగాడ మండల రెవెన్యూ కార్యాలయానికి కొంత కాలంగా సర్వేయర్‌ లేకపోవడంతో ఇక్కడ భూముల సర్వే జరగడం లేదు. దీని వల్ల  ఇక్కడ భూముల క్రయ, విక్రయాలకు బ్రేక్‌ పడింది. భూముల సర్వే కాకపోవడంతో  అనేక మంది అర్హులైన పేదలు భూములను కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక మందికి డిసెంబరు 25న భూమి పట్టాలు కూడా అందలేని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమ భూములను సర్వే చేయించాలని పలువురు మండల కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఫలితం లేకుండా పోయింది. గతంలో ఇక్కడ నియమించిన సర్వేయర్‌ రాజుబాబు అనారోగ్యం కారణంగా కొద్ది నెలలుగా సెలవులో ఉన్నారు. ఇక్కడ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, మరో సర్వేయర్‌ను నియమించాలని ములగాడ తహసీల్దార్‌ పలుమార్లు ఉన్నతాధికారులను కోరారు. దీంతో కొద్ది రోజుల క్రితం పరవాడ సర్వేయర్‌ అప్పారావును డెప్యుటేషన్‌పై ఇక్కడికి పంపారు. అయితే పరవాడలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో మళ్లీ ఆయనను ఉన్నతాధికారులు పాత స్థానానికే పంపేశారు. దీంతో ఇక్కడ సర్వేయర్‌ లేకుండాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ సర్వేయర్‌ను నియమించాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2020-12-01T05:01:20+05:30 IST