స్థలాలు ఖాళీ

ABN , First Publish Date - 2021-10-12T06:30:53+05:30 IST

మండలంలోని ఉప్పరపల్లి గ్రామం ఆటోనగర్‌లో ఖాళీ స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.

స్థలాలు ఖాళీ

ఖాళీ స్థలాలు, ఓపెన సైట్‌లు ఆక్రమిస్తున్న అధికార పార్టీ నేతలు 

ఉప్పరపల్లి ఆటోనగర్‌లో వైసీపీ నేతల బరితెగింపు 

తెలిసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు

అనంతపురంరూరల్‌, అక్టోబరు11: మండలంలోని ఉప్పరపల్లి గ్రామం ఆటోనగర్‌లో ఖాళీ స్థలాలు కబ్జా కోరల్లో  చిక్కుకున్నాయి. కొంతమంది అధికార పార్టీ నాయకులు స్థానికంగా స్థలాలను ఆక్రమించి బండలు పాతి హద్దులు ఏర్పాటు చేశారు. దీంతో ఉప్పరపల్లి గ్రామం ప్రభుత్వ భూములు, స్థలాల కబ్జాకు కేంద్రంగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామ సర్వే నెంబరు 215లో 1.5 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమించిన విషయం తెలిసిందే. ఇంతలోనే అదే గ్రామ పరిధిలో మరి కొంత మంది నాయకుల స్థలాల ఆక్రమణ బయటకొచ్చింది. గ్రామ సర్వే నెం బరు 107- 1 నుంచి 7 లెటర్లలో ఉన్న ఖాళీ స్థలాలను, ఓపెన సైట్‌ను అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ ఆక్రమణదారులు అధికార పార్టీ వారు కావడంతో పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. దీంతో నాయకుల ఆగడాలకు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


 ఖాళీ స్థలాలు ఆక్రమణ..

గ్రామ సర్వే నెంబరు 107-1 నుంచి 7 లెటర్లలో 2011లో అప్పటి రెవెన్యూ అధికారులు 400 మందికి పైగా ఇళ్లపట్టాలు మంజూరు చేశారు. అయితే స్థానికంగా సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. మరికొంత మంది వారి స్థలాలకు బండలు పాతుకొని హద్దు చేసుకున్నారు. ఈక్రమంలోనే 2018లో స్థానికంగా లేని వారి పట్టాలను రద్దు చేసి తిరిగి మరికొంత మందికి  రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఇటీవల కాలంలో స్థానికంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆర్థిక స్థోమత లేని వారు బండలు నాటుకొని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు లేఅవుట్‌లో 30 సెంట్లకు పైగా ఓపెన సైట్‌ ఉంది. ఆ స్థలం, ఖాళీ స్థలాలపై  ఆత్మకూరు మండలంలోని యాలేరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు కన్నేశారు. పదిరోజుల కిందట పెద్ద సంఖ్యలో నాయకులు అక్కడికి చేరుకుని ఏకంగా స్థలాలను, ఓపెన సైట్‌ ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేస్తూ బండలు కూడా పాతేశారు. ఆ బండలకు వైఎస్సార్‌  అనే పదాలను రాసేశారు. ఓ నాయకుడు ఏకంగా తన ఫోన నెంబరును కూడా రాశాడంటే వారి దౌర్జన్యం స్థానికంగా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే రెండు రోజుల కిందట తాడిపత్రి నుంచి ఓపెన సైట్‌లో నాటేందుకు బండలు కూడా తోలించారు. ఆక్రమించిన స్థలాల్లో వాటిని పాతేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సర్వే నెంబరులో అంగనవాడీలకు స్థలాలను మంజూరు చేశారు. వాటిని ఆక్రమించేందుకు ఆ నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. 


పట్టించుకోని రెవెన్యూ అధికారులు 

ఆటోనగర్‌లో ఓపెనసైట్‌, ఖాళీ స్థలాలను ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులు అధి కార పార్టీవారు కావటంతోనే చర్యలు తీసుకోవడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబరు-215లోని వంకపోరం బోకు భూమి విషయంలోనూ ఆ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించినట్లు తెలుస్తోంది. భూమి అక్రమించింది అధికార పార్టీకి చెందిన నాయకుడే కావడంతో చూసినట్లు వదిలేశారన్న విమర్శలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్లు విలువచేసే భూములు, పేదలకు ఇచ్చిన స్థలాలు, వారి అవసరాలకు ఉపయోగపడే ఓపెన సైట్లు ఆక్రమణదారుల చేతులోకి వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ. 30లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అదే ఆక్రమణదారుల కబ్జా కోరల్లో చిక్కుకున్నా భూములను స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి భూములు కొనుగోలు చేసే అవసరం కొంత మేరకైనా తగ్గుతుంది. ఆదిశ గా  అధికారులు ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ఆయా వర్గాల ద్వారానే వినిపిస్తున్నాయి.  


మా దృష్టికి వచ్చింది: మోహనకుమార్‌, తహసీల్దార్‌

ఆటోనగర్‌లోని ఓపెనసైట్‌లో బండలు పాతినట్లు మా దృష్టికి వచ్చింది. బండలు పాతే రోజునే మా సిబ్బందిని అక్కడకు పంపించాం. బండలు పాతుతున్న వారిని హెచ్చరించాం. మళ్లీ నాటినట్లు తెలిసింది.  ఓపెన సైట్‌ను ఆక్రమించడం నేరం. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సర్వే నెంబరు 215లోని 1.50ఎకరాల భూమికి సంబంధించి ఆక్రమణదారుడికి నోటీసులు ఇవ్వడంతో పాటు కంచె తీసివేయాలని చెప్పాం.

Updated Date - 2021-10-12T06:30:53+05:30 IST