అంబికాబాగ్‌ భూములు స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-04T08:20:10+05:30 IST

దశాబ్దాలుగా నడుస్తున్న అనకాపల్లి పూల్‌బాగ్‌ భూముల వివాదానికి రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు తెరదించారు. ఆక్రమణలు తొలగించి భూములను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు

అంబికాబాగ్‌ భూములు స్వాధీనం

అనకాపల్లి పూల్‌బాగ్‌లోని రూ.375 కోట్ల విలువైన 29.71 ఎకరాల్లో హెచ్చరిక బోర్డులు


అనకాపల్లి, ఆగస్టు 3: దశాబ్దాలుగా నడుస్తున్న అనకాపల్లి పూల్‌బాగ్‌ భూముల వివాదానికి రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు తెరదించారు. ఆక్రమణలు తొలగించి భూములను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 29.71 ఎకరాలకు కంచె ఏర్పాటుచేసి, హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌, కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో జ్యోతిమాధవి భూముల పూర్వాపరాలను విలేకరులకు వివరించారు. విశాఖపట్నంలోని అంబికాబాగ్‌ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దేవదాయశాఖ చట్టం ప్రకారం అనకాపల్లి పూల్‌బాగ్‌లోని సర్వే నంబర్‌ 66లో 29.71 ఎకరాలు సంక్రమించినట్టు తెలిపారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి అప్పట్లో చెముడు ఎస్టేట్‌ మహారాణి వైరిచర్ల చంద్రమణి మహాదేవి అల్లుడు రాజా బీర్‌ ఉదిత్‌ ప్రతా్‌పశంకర్‌దేవ్‌, ప్రముఖ వైద్యుడు పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావు ట్రస్టీలుగా ఉండేవారన్నారు. మహారాణి తదనంతరం దేవాలయ నిర్వహణను ఉదిత్‌ ప్రతా్‌పశంకర్‌ చూసుకునేవారన్నారు. ఆ దేవాలయాన్ని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు అప్పగించాలని కోరగా, ఉదిత్‌ ప్రతా్‌పశంకర్‌ దేవదాయ డిప్యూటీ కమిషనర్‌ ముందు కేసు వేశారన్నారు. ఈ కేసును 1963 డిసెంబరు 16న డిప్యూటీ కమిషనర్‌ కొట్టివేస్తూ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు.


దీనిపై ట్రస్టు సభ్యులు విశాఖపట్నం సబార్డినేట్‌ కోర్టులో దావా వేయగా, అక్కడ కూడా 1967 జూన్‌ 30న డిస్మిస్‌ చేశారన్నారు. దానిపై ట్రస్ట్‌ సభ్యులు హైకోర్టులో అప్పీల్‌ సూట్‌ దాఖలు చేయగా, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ 1970 నవంబరు 14న కొట్టివేసిందన్నారు. అనంతరం అంబికాబాగ్‌ ఆస్తులకు మహారాణి కుమార్తెలు చెల్లించాల్సిన ఇన్‌కంటాక్స్‌ బకాయి నిమిత్తం జప్తు చేయగా...ఆ ఆస్తులు దేవాలయానికి చెందినవి అయినందున ఇన్‌కంటాక్స్‌ అటాచ్‌మెంట్‌ నోటీసును 1996 జూలై 8న విశాఖపట్నం నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు కొట్టివేసిందన్నారు. అనంతరం మహారాణి రెండో కుమార్తె రాణి కమలాదేవి 1999 మార్చి 26న తల్లి వీలునామా ద్వారా దఖలు పరిచిన దేవాలయ భూములను కాపాడాలని లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారన్నారు. 


తప్పుడు పత్రాలతో కోర్టులో లిటిగేషన్‌

పూల్‌బాగ్‌ భూమికి కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి తమకు హక్కు వుందంటూ రాజకీయ బలంతో వివాదం సృష్టించారని జ్యోతిమాధవి ఆరోపించారు. అయితే 2018 జూన్‌ 28న పూల్‌బాగ్‌ భూమి సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినదిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఈ తీర్పుపై దాఖలైన అప్పీళ్లను రెవెన్యూ కోర్టు కూడా కొట్టివేసిందని, భూమి దేవస్థానానికి చెందినదిగా స్పష్టం చేసిందని డీసీ చెప్పారు. చివరిగా ఆక్రమణదారులు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను గత నెల ఏడో తేదీన కోర్టు డిస్మిస్‌ చేస్తూ...సదరు భూమి సీతారామచంద్ర దేవాలయానికి చెందినదిగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈ భూమి విలువ మార్కెట్‌ ధర ప్రకారం రూ.375 కోట్లు ఉంటుందని చెప్పారు.

Updated Date - 2021-08-04T08:20:10+05:30 IST