HYD : లంగర్‌హౌస్‌‌లో అదిరేలా.. రెండు అంతస్తుల బావి..!

ABN , First Publish Date - 2021-11-29T17:31:38+05:30 IST

లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌లోని రెండంతస్తుల బావి నాటి నవాబుల కట్టడాల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం...

HYD : లంగర్‌హౌస్‌‌లో అదిరేలా.. రెండు అంతస్తుల బావి..!

  • మరమ్మతులు చేసిన గండిపేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌


హైదరాబాద్ సిటీ/లంగర్‌హౌస్‌ : లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌లోని రెండంతస్తుల బావి నాటి నవాబుల కట్టడాల నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆ కట్టడాన్ని పరిరక్షించేందుకు మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. గండిపేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు ముందుకొచ్చి బావికి మరమ్మతులు చేపట్టారు. ఈ బావి రెండంతస్తుల లోపల ఉంది. లోపలికి వెళ్లేందుకు మెట్ల దారి ఉంటుంది. అందమైన ఆర్చిలతో ఆకట్టుకుంటుంది. గోల్కొండ కోటకు వెళ్లే మార్గంలో ఈ బావిని నిర్మించారు.


నవాబులు ఈ బావిలో స్నానాలు చేసి ఇక్కడే సేదతీరే వారని చరిత్రకారులు చెబుతున్నారు. మూసీ నది త్రివేణి సంగమం పక్కనే దూరదృష్టితో ఈ బావిని నిర్మించినట్లు పేర్కొంటున్నారు. బావికి ఆనుకునే ఓ  ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఈ రెండింటికీ మరమ్మతులు చేపట్టి అధికారులు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. హెరిటేజ్‌ బావిని కాపాడేందుకు ముందుకొచ్చిన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అప్పట్లో ప్రార్థనా మందిరంలోనే గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేసేవారు. అనంతరం గవర్నర్‌ కృష్ణకాంత్‌ ఆధ్వర్యంలో బాపూఘాట్‌ను అభివృద్ధి చేశారు.


నేడు బాపూఘాట్‌కు కేటీఆర్‌..

హెరిటేజ్‌ బావిని సందర్శించేందుకు మంత్రి కేటీఆర్‌ సోమవారం బాపూఘాట్‌కు రానున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో ఎక్కడా లేని విధంగా రెండంతస్తుల లోపల ఉన్న బావిని తిలకించనున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-29T17:31:38+05:30 IST