Abn logo
Oct 18 2020 @ 03:41AM

దయనీయంగా లంకలు

కృష్ణా తీరగ్రామాల మునక

కరోనా భయంతో పునరావాసానికి చేరని కొన్ని గ్రామాల ప్రజలు

చిన్నారులు, వృద్ధుల ఆకలి కేకలు

కొల్లూరు వరదలో వ్యక్తి గల్లంతు

పశ్చిమలో ఉప్పొంగిన ఉప్పుటేరు

జలదిగ్బంధంలో 14 గ్రామాలు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరప్రాంత లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మూడు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న వరద లంక గ్రామాలను ముంచెత్తింది. శుక్రవారం నుంచి గ్రామాలకు రవాణా నిలిచిపోయింది.  నిత్యవసరాల కోసం వెళ్లేందుకు పడవలూ అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు  అల్లాడిపోతున్నారు.  ప్రకాశం బ్యారేజికి దిగువన తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది వరద ఉధృతి శనివారానికి భారీగా పెరుగుతుందన్న అంచనాతో అధికారులు హడావుడిగా శుక్రవారం సాయంత్రం నుంచి కొన్ని లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, కరోనా భయంతో కొన్ని లంక గ్రామాల్లో ప్రజలు పిల్లలు, వృద్ధులను తీసుకుని గుంపుగా పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు ధైర్యం చేయలేక వరద నీటితో నిండిన ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. 

కన్నెత్తి చూడని అధికారులు 

వరద ముంపు గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, వ్యవసాయ ఉత్పత్తులను బయటకు తీసుకురావటానికి, గ్రామాల్లోనే ఉంటామన్నవారు నిత్యవసరాలు తెచ్చుకోవడానికి 20 పడవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కానీ, అవి ఎక్కడా కనిపించ లేదని, తామే ప్రైవేటు పడవలను పిలిపించుకుని డబ్బులిచ్చి ఉత్పత్తులను ఒడ్డుకు చేర్చుకుంటున్నామని చింతర్లంక, సుగ్గునలంక గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, శనివారం  సరకుల కోసం ఆవులవారిపాలెం నుంచి కొల్లూరుకు వచ్చిన సనకా శంకరరావు అనే వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వరద పెరిగింది. వరద ఉధృతిలోనే కొల్లూరు రోడ్డుపై నడుస్తుండగా అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయాడు.


బిక్కుబిక్కుమంటూ.. 

వాన వీడినా ఎగువ నుంచి వస్తున్న వరద నీరు కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఉప్పుటేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆకివీడు, కాళ్ల మండలాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ మండలాల్లో సుమారు 14 గ్రామాల ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. శనివారం తెల్లవారుజామున ప్రాతాళ్లమెరక పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం ప్రాంతంలో ఉప్పుటేరు గట్లను దాటి గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తింది.


కృష్ణాలో 23 వేల హెక్టార్లలో పంట నష్టం

భారీ వర్షాలు, వరదతో కృష్ణాజిల్లా రైతులు వేల హెక్టార్లలో పంటలను నష్టపోయారు. శనివారం నాటికి జిల్ల్లాలో 23వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, 6,164 హెక్టార్లలో ఉద్యానపంటలు నీటమునిగాయని అధికారులు గుర్తించారు.