912 క్లాసులకు డబ్బు వద్దంటే ల్యాప్‌టాప్‌

ABN , First Publish Date - 2021-01-12T08:25:43+05:30 IST

‘‘పేదరికం కారణంగా ఏ బిడ్డా చదువుకు దూరం కాకూడదు. చదువులతో వారు తమ తలరాతలు మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టాను’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

912 క్లాసులకు డబ్బు వద్దంటే ల్యాప్‌టాప్‌

  • వచ్చే సంవత్సరం నుంచి అమలుచేస్తాం
  • పిల్లల తలరాతలు మార్చాలనే ‘అమ్మఒడి’
  • విద్యార్థుల హాజరుపై వలంటీర్‌ పర్యవేక్షణ
  • వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీలుగా అంగన్‌వాడీలు
  • మూడేళ్లలో ప్రతి గ్రామానికీ ఇంటర్‌నెట్‌ 
  • నెల్లూరు సభలో సీఎం జగన్‌ వెల్లడి
  • పథకం రెండో విడత ప్రారంభం


నెల్లూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) :‘‘పేదరికం కారణంగా ఏ బిడ్డా చదువుకు దూరం కాకూడదు. చదువులతో వారు తమ తలరాతలు మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టాను’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. 9నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థుల తల్లులు అమ్మఒడి నిధులు వద్దనుకుంటే ఆ డబ్బుకు బదులు వచ్చే ఏడాది నుంచి నుంచి ల్యాప్‌టా్‌పలు ఇస్తామన్నారు. సోమవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అమ్మఒడి రెండో విడతను ప్రారంభించారు. ఈ విడతలో 44.48 లక్షల మంది తల్లులకు రూ.15వేలు చొప్పున 6773 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇందులో వెయ్యి రూపాయలు పాఠశాల పారిశుధ్య నిధికి పోగా, మిగిలిన 14వేలు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు. ‘‘పారిశుధ్య నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడం పెద్దకష్టం కాదు. అయితే తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటేనే పాఠశాలల పారిశుధ్యం మెరుగ్గా ఉంటుందనేదే ప్రభుత్వ ఉద్దేశం. గత ఏడాదికన్నా ఈ ఏడాది 2 లక్షల మందికి అదనంగా ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. అమ్మఒడి, నాడు-నేడు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు బోధన, విద్యాకానుక, జగనన్న గోరుముద్దు తదితర పథకాల కారణంగా ప్రభు త్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది’’ అని సీఎం అన్నారు. ‘‘ఒక్కరోజు పిల్లవాడు బడికి హా జరు కాకున్నా తల్లిదండ్రులకు ఫోన్‌ మెసేజ్‌ వెళుతుంది. వరుసగా రెండు రోజులు రాకుంటే నేరు గా వలంటీరు వాళ్ల ఇంటికే వెళ్లి పిల్లల యోగక్షేమాలు  తెలుసుకుంటారు.


తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలను తిరిగి బడికి పంపే బాధ్యతను గ్రామ సచివాలయాల సిబ్బందికి, టీచర్ల మీద పెడుతున్నాం. మూడేళ్లలో 100ు అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా పని చేస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. అమ్మఒడిలో వచ్చే ఏడాది నుంచి ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ను ఇవ్వనున్నామన్నారు. ‘‘ఓపెన్‌ మార్కెట్‌లో రూ.25-27వేల రూపాయల ఖరీదు చేసే ల్యాప్‌టాబ్‌లను రూ.18,500లకే ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. 9 నుం చి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు, ‘వసతి దీవెన’ అందుకొంటున్న తల్లులకు కూడా వర్తిస్తుంది. 8వ తరగతి నుంచి కంప్యూటర్‌ అక్షరాస్యత ప్రవేశపెడుతున్నాం. రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబెట్టే చర్యల్లో భాగంగా రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికీ అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తాం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ స్థానంలో వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ-1(పీపీ1), ప్రీ ప్రైమరీ-2(పీపీ-2), ప్రీ ఫస్ట్‌ క్లాస్‌లుగా పేర్లు మార్చుతామన్నారు. 


15న నరసరావుపేటకు సీఎం

నరసరావుపేట: కనుమ పండుగను పురష్కరించుకుని ఈ నెల 15న జగన్‌ గుంటూరు జిల్లా నరసరావుపేటకు రానున్నారు. టీటీడీ, ఇస్కాన్‌ సంస్థలు నిర్వహించే గోపూజలో పాల్గొంటారు.  


నేడు గవర్నర్‌తో జగన్‌ భేటీ

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను మంగళవారం సీఎం జగన్‌ కలవనున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది.

Updated Date - 2021-01-12T08:25:43+05:30 IST