Abn logo
May 5 2021 @ 02:22AM

ఈటల.. మేక వన్నె పులి

  • బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర: గంగుల 
  • ఈటలను గౌరవించలేదనడం సత్యదూరం: కొప్పుల
  • ‘కమలాపూర్‌’ను బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చాం: వినోద్‌  


హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ గౌరవించలేదని అనడం సత్యదూరమని మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ కుమార్‌ అన్నారు. అసైన్డ్‌, దేవాలయ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈటల రాజేందర్‌ మేకవన్నె పులి, బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర అని మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు. ఆయన హుజూరాబాద్‌ వెళితే బీసీ, హైదరాబాద్‌ వస్తే ఓసీ అని అన్నారు. ఈటల ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నప్పుడు ముదిరాజ్‌లకు చేపపిల్లలు కావాలని అప్పటి సీఎంలు వైఎస్సార్‌, కిరణ్‌ కుమార్‌రెడ్డిలను ఏనాడూ అడగలేదన్నారు. 


దేవరయాంజాల్‌లోని తన భూముల క్రమబద్ధీకరణ గురించి మాత్రం అడిగారని ఆరోపించారు. ఆయన వ్యాపార భాగస్వాముల్లో ఎవరూ బీసీలు లేరని మండిపడ్డారు. ఇప్పుడు మంత్రి పదవి పోగానే బీసీ బిడ్డను, ముదిరాజ్‌ బిడ్డను అని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ బొమ్మతోనే ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్న విషయం మరిచిపోవద్దన్నారు. తాము త్వరలోనే హుజూరాబాద్‌లో పర్యటిస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. టీఆర్‌ఎ్‌సతో అనేక రకాలుగా ఈటల లబ్ధి పొందారని చెప్పారు. ఎకరం 50 లక్షల నుంచి కోటిన్నర పలికే దళితుల అసైన్డ్‌ భూములను.. ఎకరాకు కేవలం 6 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వ అవసరాలకైతే ప్రభుత్వమే భూములను సేకరిస్తుందని, కానీ ఈటల వ్యాపారాల కోసం ఆ భూములను సర్కారు ఎందుకు సేకరిస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో ఆయనకు ఎప్పుడూ గౌరవం తగ్గలేదని చెప్పారు. వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2001లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కమలాపూర్‌ నియోజవర్గంలో బలంగా ఉందన్నారు. ఈటల పార్టీలో చేరక ముందే కమలాపూర్‌లో అన్ని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలిచిందని చెప్పారు. 2003లో కమలాపూర్‌ నియోజకవర్గాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఈటలకు ఇచ్చామన్నారు.

Advertisement
Advertisement
Advertisement