తుపాకీ షాపుల ముందు పెద్ద క్యూలు!

ABN , First Publish Date - 2020-04-08T05:57:46+05:30 IST

‘‘మేము అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉంటాం. అమెరికాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

తుపాకీ షాపుల ముందు పెద్ద క్యూలు!

‘‘మేము అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉంటాం. అమెరికాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిజానికి, కరోనా కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. సామాజిక సమస్య కూడా! కానీ అమెరికన్‌ ప్రభుత్వం మాత్రం కరోనా సమస్య గురించి పట్టించుకోవాల్సిన సమయంలో విచిత్రంగా ఇంపీచ్మెంట్‌ అంశం మీద దృష్టి కేంద్రీకరించింది. అమెరికా అఽధ్యక్షుడి దృష్టిలో కరోనా అనేది మొదట ‘‘ప్రతిపక్ష డెమోక్రాట్లు సృష్టించిన సమస్య.’’ తర్వాత ఇది ‘‘చైనా వాళ్ల వైరస్‌.‘’’ చివరకు ‘‘మనుషుల ప్రాణాల కన్నా దేశ ఆర్థికవ్యవస్థ ముఖ్యం. ఈస్టర్‌ పండుగ నాటి కల్లా అంతా బాగుంటుంది’’ అంటూ రోజుకొక వింత వ్యాఖ్య చేసి దేశాధ్యక్షుడు ప్రజల దృష్టిలో నవ్వుల పాలయ్యారు.


అంతేకాక అమెరికన్‌ ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలోకి పడేశాడు. కరోనా దెబ్బకు అమెరికన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని లొసుగులన్నీ బయటపడుతున్నాయి. తీరా సమస్య ఉద్ధృతమవడంతో ‘‘ఎకానమీ కన్నా ప్రజలే ముఖ్యం’’ అని దేశాధ్యక్షుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మెడికల్‌ సదుపాయాల కోసం గవర్నర్లు ఒకరితో మరొకరు పోటీపడుతున్నారు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే...


ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీలు అమ్మే దుకాణాలను ముఖ్యమైన వ్యాపారాలుగా పరిగణించడం! సూపర్‌మార్కెట్ల వద్ద కన్నా గన్‌ షాపుల ముందు పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. తుపాకీలు కొనుక్కోవడానికి కొందరు ఎక్కువ ప్రాముఖ్యమిస్తున్నారు. ఎందుకని అడిగితే, ‘‘ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో లూఠీలు జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి ముందు జాగ్రత్త కోసం...’’ అని వాళ్లు చెబుతున్నారు. అలాగే, మద్యం షాపుల ముందు కూడా జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇదో విచిత్ర పరిస్థితి.


మానవ హక్కుల సంస్థల అభ్యర్థన!

మేమున్న పెన్సిల్వేనియాలో ‘‘స్టే ఎట్‌ హోమ్‌’’ ఆదేశాలు అమలవుతున్నాయి. మానవాళి ప్రాణాలను అరచేత పట్టుకొని గడుపుతున్న ఈ సమయంలో విచిత్రంగా ప్రస్తుతం ఇక్కడ హింస ఎక్కువ అయింది. గత పదిరోజుల్లో కనీసం నాలుగు కాల్పుల సంఘటనలు జరిగాయి. అందులో ఐదుగురు చనిపోయారు. మరోపక్క మానవ హక్కుల కోసం ఉద్యమించే ఏసీఎల్‌యూ వంటి సంస్థలు జైళ్లలోని ఖైదీలను విడుదల చేయాలనీ, వారికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించాలనీ అభ్యర్థిస్తున్నాయి. నిరసన తెలియజేస్తున్నాయి. దాంతోపాటూ వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ కూడా చేస్తున్నాయి. ఇక పెన్సిల్వేనియాలోని ఒక నిత్యావసరాల దుకాణంలో, ఒక మహిళ పండ్లు, కూరగాయల మీద కావాలని కొనితెచ్చుకొని మరీ దగ్గడంతో, ముప్ఫై అయిదు వేల డాలర్ల విలువైన వస్తువులన్నీ చెత్తపాలయ్యాయి. ఇది వేళాకోళాలకు సమయం కాదని ఎవరైనా ఎందుకు అర్థం చేసుకోవట్లేదోనని బాధ కలుగుతోంది. 


అందరూ కలసి వస్తేనే...

అమెరికా అగ్రరాజ్యమైనప్పటికీ, ఇక్కడి నగరాల్లో నిరాశ్రయులు చాలామందే! ఇప్పుడు వారందరినీ కొన్ని ప్రార్థనా మందిరాలకు తరలించారు. ఫిలడెల్ఫియాలోని పేదల కోసం స్థానిక ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి కొన్ని ఫుడ్‌ షెల్టర్లను నెలకొల్పాయి. వాటి ద్వారా ఒక్కో కుటుంబానికి వారానికి సరిపడా ఆహార ప్యాకెట్లను ఒకేసారి అందిస్తున్నారు. అలాగే, డెబ్భై అయిదు వేల డాలర్ల వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఉన్న కుటుంబాల్లో... ఒక్కొక్కరికి ‘కరోనా ఎకనామిక్‌ ఇంప్యాక్ట్‌ పేమెంట్‌’ పథకం కింద పెద్దలకు పన్నెండొందల డాలర్లు, పిల్లలకు అయిదొందల డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే, కరోనా కేవలం ఆరోగ్య సమస్య కాదు. ఆర్థిక, సామాజిక సమస్య. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రజలూ సరైన చర్యలు చేపట్టాలి. యువతరానికి కూడా వైరస్‌ ప్రమాదం పూర్తిగా అర్థం కావాలి. ఈ పెను ఉపద్రవం నుంచి అమెరికా బయటపడాలంటే, సమాజంలో అందరూ కలసిరావాలి.’’

Updated Date - 2020-04-08T05:57:46+05:30 IST