మౌలిక సదుపాయాలకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-02-02T05:56:24+05:30 IST

ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా, సంక్షేమానికి పెద్దగా కేటాయింపులు చేయకుండా, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని, ఆదాయ పన్ను నుంచి ఆశించిన మేరకు మినహాయింపులు లేకపోవడం వేతన జీవులను నిరాశ పరిచిందని, కార్పొరేట్‌ శక్తులకే పెద్ద పీట వేసేలా బడ్జెట్‌ ఉందంటూ వివిధ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట

- ప్రజాకర్షక పథకాలు ఊసెత్తని కేంద్రం

- సామాన్యులకు ఊరటనివ్వని బడ్జెట్‌ 

- ఆదాయ పన్నుల రాయితీలు యథాతథం

- కేంద్ర బడ్జెట్‌పై నేతల భిన్నాభిప్రాయాలు (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా, సంక్షేమానికి పెద్దగా కేటాయింపులు చేయకుండా, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని, ఆదాయ పన్ను నుంచి ఆశించిన మేరకు మినహాయింపులు లేకపోవడం వేతన జీవులను నిరాశ పరిచిందని, కార్పొరేట్‌ శక్తులకే పెద్ద పీట వేసేలా బడ్జెట్‌ ఉందంటూ వివిధ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో 39 లక్షల 45 వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక పథకాలను ప్రవేశ పెడతారని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బడ్జెట్‌ ఉండడం గమనార్హం. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువగా బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. దేశ వ్యాప్తంగా మరో 25 వేల కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారులను విస్తరిస్తామని ప్రకటించడంపై జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. జగిత్యాల నుంచి ధర్మారం, పెద్దపల్లి, మంథని మీదుగా భూపాలపల్లి వరకు గల రహదారిని జాతీయ రహదారిగా మార్చాలనే ప్రతిపాదన ఉంది. దీంతో దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి. 180 కిలోమీటర్ల వేగంతో 400 వందే భారత్‌ రైళ్లను ప్రవేశ పెడతామని ప్రకటించడం ద్వారా రవాణాను మరింత మెరుగు పరిచేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ పరంగా బడ్జెట్‌ అంతంత మాత్రంగానే కేటాయించినప్పటికీ, సబ్సిడీ ఎరువుల విషయానికి వస్తే కాంప్లెక్స్‌, పొటాష్‌ ఎరువులపై సబ్సిడీ పెంచేలా కనబడడం లేదు. ప్రతీ యేటా పెరుగుతున్న ఎరువుల ధరల భారంతో రైతులు సతమతం అవుతున్నారు. గడిచిన ఏడాది రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా, డీఏపీలపై పెద్దమొత్తంలో సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, మిగతా ఎరువులపై భరోసా ఇవ్వలేక పోయింది.

- మద్దతు ధరపై లేని హామీ..

 రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలపై ఎలాంటి హామీ ఇవ్వలేక పోయారు. జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, ఈసారి కూడా మొండిచెయ్యి చూపారు. కరోనా నేపథ్యంలో ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తారని వేతన జీవులు భావించినప్పటికీ, వాటి జోలికి వెళ్లకుండా గత ఏడాది నుంచి అమలు చేస్తున్న శ్లాబులనే యథాతథంగా అమలు చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ, ఈసారి కూడా కేంద్రం పట్టించుకోలేదు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌ ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ‘ఆంధ్రజ్యోతి’తో వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..

 వ్యవసాయ రంగాన్ని ఆదుకునేలా లేదు..

- పుట్ట మధూకర్‌, జడ్పీ చైర్మన్‌, పెద్దపల్లి

కేంద్ర బడ్జెట్‌ వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా లేదు. రైతులకు మద్దతు ధరలపై భరోసా ఇవ్వక పోవడమే కాకుండా పండించే పంటను కొనుగోలు చేసే విషయమై హామీ ఇవ్వలేక పోయింది. రైతులకు నిరంతరం సాగునీటిని అందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంతవరకు జాతీయ హోదా కల్పించకపోవడం బీజేపీ డొల్లతనానికి నిదర్శనం. పేద, మధ్య తరగతి, ఏ ఒక్క వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా బడ్జెట్‌ లేకపోవడం విచారకరం. ఎప్పటిలాగానే తమ కార్పొరేట్‌ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది.

 అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్‌..

- గుజ్జుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అభివృద్ధికి ఊతం ఇచ్చేలా, ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఉంది. దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన బడ్జెట్‌ ఇది. ఆయా వర్గాల ప్రజలపై పన్నుల భారం మోపకుండా మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్‌ ఉంది.


Updated Date - 2022-02-02T05:56:24+05:30 IST