హైవేపై లారీ దగ్ధం

ABN , First Publish Date - 2021-08-02T06:21:26+05:30 IST

మరో గంటన్నరలో తెల్లవారనుంది. అప్పుడప్పుడే అక్కడక్కడ రోడ్ల పక్కన టీ దుకాణాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతలో రోడ్డుపై వెళుతున్న ఓ లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి.

హైవేపై లారీ దగ్ధం
రేగుపాలెం హైవేపై దగ్ధమవుతున్న లారీ

 రేగుపాలెం జంక్షన్‌లో టైరు పంక్చర్‌ కావడంతో ప్రమాదం

 సురక్షితంగా బయటపడిన డ్రైవర్‌, క్లీనర్‌

 ఒడిశా నుంచి మైదాపిండి లోడుతో వస్తున్న వాహనం

 వాహన చోదకుల భయాందోళన.. స్తంభించిన ట్రాఫిక్‌

ఎలమంచిలి, ఆగస్టు 1: మరో గంటన్నరలో తెల్లవారనుంది. అప్పుడప్పుడే అక్కడక్కడ రోడ్ల పక్కన టీ దుకాణాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతలో రోడ్డుపై వెళుతున్న ఓ లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. ఆ కొద్ది క్షణాల్లోనే వాహనం మొత్తాన్ని ఆవహించాయి. తోటి వాహనచోదకుల్లో భయాందోళన రేకెత్తించిన ఈ సంఘటన ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్‌ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతలో చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు లారీ డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలివి.

ఒడిశా నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి  మైదా పిండి లోడుతో ఓ లారీ వస్తోంది.  రేగుపాలెం జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి లారీ టైరు పంక్చర్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని లారీ డ్రైవర్‌ అంజాద్‌ పాసన్‌ తెలిపాడు. ఆ సమయంలో తనతో పాటు క్లీనర్‌ లారీ నుంచి బయటకు గెంతేయడంతో ప్రాణాలతో బయటపడినట్టు చెప్పాడు. హైవేపై లారీ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో వాహనదారులంతా హడలిపోయారు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే లారీ సగానికిపైగా కాలిపోయింది. మైదాపిండితో పాటు ఆపైన ఉన్న ఊక సైతం చాలా వరకు కాలిపోయాయి.  గంటకు పైగా మంటలను అదపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సంఘటనా స్థలాన్ని రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఇదిలావుంటే ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోవడంతో వాహనాలను మళ్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Updated Date - 2021-08-02T06:21:26+05:30 IST