West Bengal: పోరు ముగిసింది. ఫలితాలు మిగిలాయి

ABN , First Publish Date - 2021-04-30T00:24:10+05:30 IST

బెంగాల్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పటికీ అందరి చూపూ బెంగాల్‌వైపే ఉంది. బెంగాల్‌లో బీజేపీ అనూహ్యంగా దూసుకురావడం ఒకటైతే అమిత్ షా ప్రత్యేకంగా బెంగాల్‌ను ఎంచుకొని..

West Bengal: పోరు ముగిసింది. ఫలితాలు మిగిలాయి

కోల్‌కతా: ఎనిమిది దశల పాటు కొనసాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. మార్చి 27న ప్రారంభమైన ఈ పోలింగ్, ఏప్రిల్ 29న జరిగిన చివరి దశ పోలింగ్‌తో ముగిసింది. కాగా దేశంలో జరిగిన ఎన్నికల్లో సుదీర్ఘంగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికలు ఇవేనని అంటున్నారు. గతంలో బెంగాల్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరిగినప్పటికీ ఈసారి ఎన్నికల్లో మరో దశను పెంచి ఎనిమిది దశలకు పెంచి నిర్వహించారు. దీనిపై బీజేపీయేతర పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఇంత సుదీర్ఘ కాలం పాటు ఎన్నికలు నిర్వహించవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ సుప్రెమో మమతా బెనర్జీ కూడా అన్నారు. అయినప్పటికీ ముందుగా నిర్ణయించిన దాంట్లో ఎలాంటి మార్పులు చేయకుండానే ఎన్నికల పోలింగ్ ముగించారు.


బెంగాల్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పటికీ అందరి చూపూ బెంగాల్‌వైపే ఉంది. బెంగాల్‌లో బీజేపీ అనూహ్యంగా దూసుకురావడం ఒకటైతే అమిత్ షా ప్రత్యేకంగా బెంగాల్‌ను ఎంచుకొని కొంత కాలంగా అక్కడే ఉంటూ కమల పార్టీని గెలిపించే ప్రయత్నాలు చేశారు. దీంతో సహజంగానే చాలా మంది బెంగాల్ వైపు చూడడం ప్రారంభించారు. ఎనిమిది దశల పోలింగ్ సహా.. ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజు బెంగాల్ హాట్ హాట్ గానే కనిపించింది. బీజేపీ, టీఎంసీల ఎత్తుకు పైఎత్తులు బెంగాల్‌ రాజకీయ క్రీడను రసవత్తరం చేశాయి.


ఎన్నడూ లేనంతగా పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తుతున్నారు. గడిచిన 7 దశల్లోనూ సగటున 80 శాతం పోలింగ్ నమోదైంది. అతి ఎక్కువగా రెండవ దశలో 86.11 శాతం నమోదైంది. తక్కువగా ఏడవ దశలో 76.89 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా చివరిదశ పోలింగ్ ముగిసింది. ఈ దశలో పోలింగ్ ముగిసే సరికి 76.07 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6:30 గంటలకు పోలింగ్ ముగిసిందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఐదు అసెంబ్లీలకు సంబంధించి లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది.


బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దశల వారీగా పోలింగ్ శాతం

మొదటి దశ: 84.63 శాతం

రెండవ దశ: 86.11 శాతం

మూడవ దశ: 84.61 శాతం

నాల్గవ దశ: 79.90 శాతం

ఐదవ దశ: 82.49 శాతం

ఆరవ దశ: 82.00 శాతం

ఏడవ దశ: 76.89 శాతం

ఎనిమిదవ దశ: 76.07 శాతం


కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎన్నికల నిర్వహణపై తాజాగా మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున కొనసాగడం పట్ల ఎన్నికల సంఘాన్ని కోర్టు నిలదీసింది. కోవిడ్ వ్యాప్తికి ఎన్నికల సంఘమే ముద్దాయంటూ ధర్మాసనం పేర్కొంది. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-04-30T00:24:10+05:30 IST