తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు జీతం రూ.1.25 లక్షలు

ABN , First Publish Date - 2021-10-18T17:01:36+05:30 IST

తెలంగాణలో ఉద్యోగాలకు ..

తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు జీతం రూ.1.25 లక్షలు

కొత్త మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాలు

కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ప్రకటన జారీ

దరఖాస్తులకు గడువు అక్టోబరు 28


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లో అధ్యాపకుల నియామకం కోసం వైద్య విద్య సంచాలకులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఎంఈ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ఒక్క ఏడాది కోసమే నియామకం చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా http://dme.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 31వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నవంబర్‌ 7వ తేదీలోగా సంబంధిత పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. అభ్యర్థులు వనపర్తి, నాగర్‌కర్నూల్‌; మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, రామగుండం మెడికల్‌ కాలేజీల్లో ఎందులోనైనా పని చేయడానికి సుముఖంగా ఉండాలని డీఎంఈ పేర్కొన్నారు. అయితే దరఖాస్తు సమయంలోనే ప్రాధాన్యం ప్రకారం కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 15 డిపార్ట్‌మెంట్లలో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే పోస్టుల సంఖ్యను పేర్కొనలేదు.



దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు లేకపోతేనే ఇతర రాష్ర్టాల అభ్యర్థులను ఎంపిక చేస్తామని డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. నెలవారీ వేతనం ప్రొఫెసర్‌కు రూ.1.9 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.5 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషియాలజీ, రేడియోడయాగ్నసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగాల్లో అధ్యాపకుల నియామకం చేపట్టనున్నారు. అయితే కొత్త మెడికల్‌ కాలేజీల కోసం కూడా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-10-18T17:01:36+05:30 IST