విదేశాల్లో హాలిడే ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా.. అక్కడి క్వారెంటైన్ నిబంధనలపై ఓ లుక్కేయండి!

ABN , First Publish Date - 2021-03-12T01:34:53+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో చాలా దేశాలు ఆర్థికంగా పుంజుకోవడంపై దృష్టిసారించాయి. సరిహద్దులను తెరుస్తూ.. వి

విదేశాల్లో హాలిడే ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా.. అక్కడి క్వారెంటైన్ నిబంధనలపై ఓ లుక్కేయండి!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో చాలా దేశాలు ఆర్థికంగా పుంజుకోవడంపై దృష్టిసారించాయి. సరిహద్దులను తెరుస్తూ.. విదేశీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో చాలా మంది విదేశాల్లో సేద తీరేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా యూఏఈ (దుబాయి), థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా దేశాల్లో హాలిడే ట్రిప్‌‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల్లోని క్వారెంటైన్ నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుబాయి, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా దేశాల్లో క్వారెంటైన్ నిబంధలపై ఓ లుక్కేస్తే.. 


యూఏఈలో క్వారెంటైన్ మార్గదర్శకాలు

యూఏఈలో క్వారెంటైన్ మార్గదర్శకాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. యూఏఈ కొన్ని దేశాలను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది జనవరి 17న అబుధాబిలో అమలులోకి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాల్లో దాదాపు 14 రోజులపాటు ఉండాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సదరు ప్రయాణికులకు అధికారులు వ్రిస్ట్ బ్యాండ్‌ను అందిస్తారు. క్వారెంటైన్ కేంద్రాల్లో ఉన్నన్ని రోజులూ ఈ బ్యాండ్‌ను ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా అధికారులు సదరు ప్రయాణికుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అంతేకాకాండా ఈ క్వారెంటైన్ కేంద్రానికి వెళ్లిన ఎనిమిదో రోజుకు సదరు ప్రయాణికులకు అధికారులు మరోసారి పీసీఆర్ టెస్ట్ చేస్తారు. 


దుబాయి, షార్జా వెళ్లే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి 96 గంటల ముందు పీసీఆర్ టెస్టును చేయించుకుని నెగెటివ్ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ నెగెటివ్ సర్టిఫికేట్‌ను చూపించిన వారికి మాత్రమే దుబాయి, షార్జాకు ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుంది. షార్జాకు వెళ్లే పర్యాటకులు, షార్జా నివాసితులు అక్కడికి చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్టులో మళ్లీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాటి ఫలితాలు వచ్చే వరకు క్వారెంటైన్‌లో ఉండాలి. ఒకవేళ ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే 14రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. దుబాయిలో కూడా ఇంచుమించు ఈ తరహా మార్గదర్శకాలే అమలవుతున్నాయి. ఇకపోతే యూఏఈలో క్వారెంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారు జరిమానాగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో జరిమానా విలువ దాదాపు రూ.10లక్షల వరకు ఉంటుంది. 



సింగపూర్‌లో ఇలా..

సింగపూర్‌లో క్వారెంటైన్ మార్గదర్శకాలు పూర్తిగా ప్రయాణికుడు బయల్దేరిన దేశం.. అతని 14 రోజుల ట్రావెట్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. సింగపూర్‌కు బయల్దేరే 72 గంటల ముందు ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకుని.. నెగెటివ్ సర్టిఫికేట్‌ను పొందాలి. నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ఏడు సంవత్సరాల వయసు పైబడిన పిల్లలు నుంచి మొదలుకొని.. కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడిన వారు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందుకు అయ్యే ఖర్చును ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. సింగపూర్‌ ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఖరీదు దాదాపు రూ.12వేల వరకు ఉంటుంది. ప్రయాణికుడి ట్రావెట్ హిస్టరీని బట్టి.. అక్కడి అధికారులు స్టే హోం నోటీసును జారీ చేస్తారు. 


థాయ్‌లాండ్‌లో..

అనుమతి పొందిన కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు తమ దేశానికి వస్తే.. వారికి 14 రోజుల క్వారెంటైన్ నిబంధల నుంచి మినహాయింపు ఇవ్వాలని థాయ్‌లాండ్ భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ ఆలోచనను చాలా మంది విదేశీ ప్రయాణికులు స్వాగతించారు. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత థాయ్‌లాండ్ వెళ్తే.. క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదని చాలా మంది పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా అక్కడి ఓ ప్రముఖ పత్రిక వెలువరించిన కథనం ప్రకారం.. థాయ్‌లాండ్ వెళ్లిన పర్యాటకులకు 14 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి అని తెలుస్తోంది. 


మలేషియాలో అలా..

మలేషియాకు బయల్దేరే 72 గంటల ముందు ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకుని, దాని నెగెటివ్ సర్టిఫికేట్‌ను పొందాలి. నెగెటివ్ సర్టిఫికేట్ పొందిన వారు మత్రమే మలేషియాకు ప్రయాణించడానికి అర్హులు. మలేషియా చేరుకున్న తర్వాత అక్కడి అధికారులు విమానాశ్రయాల్లో మరోసారి కొవిడ్ పరీక్ష చేసే అవకాశం ఉంది.  విదేశాల నుంచి మలేషియాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ 7 రోజుల పాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాలి. క్వారెంటైన్‌లో ఐదు రోజులు గడిచిన తర్వాత అధికారులు మరోసారి కొవిడ్ టెస్ట్ చేయొచ్చు. 


Updated Date - 2021-03-12T01:34:53+05:30 IST