HYD : friend Ship Day సందర్భంగా అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాద ఘటనలో తాజా అప్డేట్ ఇదీ..

ABN , First Publish Date - 2021-08-04T14:42:11+05:30 IST

మద్యం మత్తులో కారు నడిపి యువతి మృతికి కారణమైన యువకుడు

HYD : friend Ship Day సందర్భంగా అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాద ఘటనలో తాజా అప్డేట్ ఇదీ..

  • యువతి మృతికి కారణమైన యువకుడి అరెస్టు
  • నిబంధనలకు విరుద్ధంగా మద్యం 
  • అమ్మిన పబ్‌ యజమాని, మేనేజర్‌ కూడా..

హైదరాబాద్ సిటీ/గచ్చిబౌలి : మద్యం మత్తులో కారు నడిపి యువతి మృతికి కారణమైన యువకుడు, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న పబ్‌ యజమాని, మేనేజర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కథనం ప్రకారం.. అభిషేక్‌(23), ఆశ్రిత, తరుణి, సత్యప్రకాశ్‌, చిన్మయి, వివేక్‌ ఆదివారం రాత్రి కొండాపూర్‌ స్నోర్ట్‌ పబ్‌లో మద్యం తాగి భోజనం చేశారు. 11 గంటల సమయంలో బయటకు వచ్చి అభిషేక్‌ కారులో మదీనగూడలోని మైహోం జువెల్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్తున్నారు. కారు వేగంగా వెళ్లడంతో పల్టీలు కొట్టడంతో ఆశ్రిత, తరుణి తీవ్రంగా గాయపడ్డారు. బెలూన్స్‌ తెరుచుకోవడంతో కారులో ఉన్న సత్యప్రకాశ్‌, అభిషేక్‌ సురక్షితంగా బయటపడ్డారు.


సత్యప్రకాశ్‌కు కుడిచేయి విరిగినట్లు తెలిసింది. అభిషేక్‌ కారు వెనుక అనుసరిస్తూ వచ్చిన చిన్మయి, వివేక్‌ గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆశ్రిత మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యప్రకాశ్‌, తరుణి చికిత్స పొందుతున్నారు. కారు వేగంగా నడిపి యువతి మృతికి కారణమైన అభిషేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు మద్యం అమ్మొద్దని ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బేఖాతరు చేస్తూ పబ్‌ తెరిచి మద్యం అమ్మినందుకు బాధ్యులను చేస్తూ యజమాని సరోజ్‌కుమార్‌, మేనేజర్‌ కాశీనాథ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-08-04T14:42:11+05:30 IST