ట్రావెల్‌ బస్సులో Gold మాయం ఘటన : ఇదంతా ఆయన పనేనా.. ముంబైకి స్పెషల్ టీమ్.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-08-28T15:01:28+05:30 IST

ట్రావెల్‌ బస్సులో బంగారం మాయమైన కేసు విచారణలో భాగంగా...

ట్రావెల్‌ బస్సులో Gold మాయం ఘటన : ఇదంతా ఆయన పనేనా.. ముంబైకి స్పెషల్ టీమ్.. ఏం జరుగుతుందో..!?

  • ఉద్యోగి పనేనా? 
  • ముంబైకి ప్రత్యేక బృందం

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : ట్రావెల్‌ బస్సులో బంగారం మాయమైన కేసు విచారణలో భాగంగా పోలీసు ప్రత్యేక బృందం శుక్రవారం ముంబైకి వెళ్లింది. బంగారం తీసుకొచ్చిన ఉద్యోగి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబై జవేరి బజార్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ ఏడేళ్లుగా నగరంలో ఉన్న బంగారు దుకాణాలకు ఆభరణాలను సరఫరా చేస్తున్నాడు. తన వద్ద పదేళ్లుగా పనిచేస్తూ, ఎప్పుడూ ఆభరణాలు తీసుకెళ్లే ఉద్యోగి గులాబ్‌ మాలి(32), మేనల్లుడు ముఖేష్‌ పరిహార్‌లకు బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు ఇలా మొత్తం 2.12 కిలోల ఆభరణాలు ఇచ్చి నగరానికి  పంపాడు. వాటిని నగరంలోని వివిధ దుకాణాలలో సరఫరా చేయాలని సూచించాడు.


ఆభరణాలతో వారు ఈ 23న సాయంత్రం ముంబైలో ప్రైవేట్‌ బస్సు ఎక్కారు. గులాబ్‌మాలి బంగారు గొలుసులను బ్యాగులో పెట్టుకుని నడుం చుట్టూ కట్టుకోగా, బ్రాస్లెట్లు తాను వేసుకున్న జర్కిన్‌ లోపలి జేబుల్లో పెట్టుకున్నాడు. ఆభరణాలు కనిపించకుండా సేఫ్‌ జాకెట్‌ వేసుకున్నాడు. బస్సులో ముఖేష్‌ పై బెర్త్‌లో పడుకోగా, గులాబ్‌ మాలి కింది బెర్త్‌లో పడుకున్నాడు. ఈనెల 24న ఉదయం అమీర్‌పేట చౌరస్తాలో బస్సు ఆగినప్పుడు గులాబ్‌మాలి ఆభరణాలను చూసుకోగా కనిపించలేదని చెబుతున్నాడు. వెంటనే విషయాన్ని క్లీనర్‌కు చెప్పాడు. అందరూ కలిసి బస్సులో వెదికారు. ఆభరణాలు కనిపించలేదు.


మామ శ్రావణ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి ముఖేష్‌ విషయాన్ని చెప్పాడు. ట్రావెల్స్‌ కార్యాలయం సైఫాబాద్‌ పీఎస్‌ పరిధిలో ఉండడంతో 25న శ్రావణ్‌  ఫిర్యాదు చేశారు. సైఫాబాద్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసును పంజాగుట్ట పీఎస్‌కు బదిలీ చేశారు. పోలీసులు గులాబ్‌ మాలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఎన్ని గొలుసులు, బ్రాస్లెట్స్‌ ఉన్నాయో అన్న లెక్క కూడా వారి వద్ద లేదు. పోలీసులు గులాబ్‌ మాలిపై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపినట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన పోలీసులు నగల చోరీ మిస్టరీని ఛేదించినట్లు తెలిసింది.

Updated Date - 2021-08-28T15:01:28+05:30 IST