Abn logo
Jul 23 2020 @ 00:00AM

లాఠీ కొసన కులం

ఎన్నికల ముందు చాలా చెబుతారు. కష్టాలన్నిటిని మంత్రం వేసి మాయం చేస్తామంటారు. కన్నీటిచుక్క చెక్కిలి మీదకు దిగకముందే ఓదార్పుతో ఆవిరి చేస్తామంటారు. తలల మీద చేతులు పెట్టి అప్యాయత చూపెడతారు. మురికివాడల బిడ్డలను ముద్దాడతారు. నరాలు తేలిన బీద, ముసలి చేతులతో అన్నం తినిపించుకుంటారు. అసంతృప్తులతో సతమతమవుతున్న ప్రజలకు కొత్త ఆశలు మొలకెత్తుతాయి. బ్యాలట్లు కిక్కిరిసిపోతాయి. విజయాలు చెలరేగిపోతాయి.


ఏమీ చేయరని కాదు, సంక్షేమం అంటారు, డబ్బులు పంచిపెడతారు, ఉచితాలను అనుచితస్థాయికి తీసుకువెడతారు. పందేరం తప్ప అభివృద్ధి ఏమీ ఉండదు. అందరికీ అన్నీ ఇస్తున్నాము కదా అని పాలకులు ఆపై తమ అసలు కార్యక్రమాలను మొదలుపెడతారు. పై వారు పెద్దపెద్ద పథకాలలో నిమగ్నమై ఉన్నప్పుడు, చిల్లరదేవుళ్లు చెలరేగిపోతారు. కప్పిపెట్టిన ముసుగులన్నీ తొలగిపోతాయి. కులం కత్తులు ఝళిపిస్తుంది. సమాజంలో ఎన్ని రకాల అంతస్థులున్నాయో, ఎన్ని రకాల ఆధిపత్యాలు అహంకారాలూ ఉన్నాయో అన్నీ ప్రత్యక్షమవుతాయి. తిరుగులేని జనామోదం ఉంది కదా అని కోర్టులను ధిక్కరిస్తారు, స్వతంత్ర వ్యవస్థలను అతిక్రమిస్తారు. రాజ్యాంగాన్ని కూడా బేఖాతరు చేస్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతున్నది. ఆర్తుల ఆపన్నుల ప్రభుత్వం వారికి సరికొత్త అనుభవాలను అందిస్తున్నది. దళితుల, మైనారిటీల ప్రభుత్వం వారికి అనిర్వచనీయమైన సాధికారతను అందిస్తున్నది. ఒక పక్క రాష్ట్రం అంతా కరోనావిలయంతో విలవిలలాడుతుండగా, ఆ వైరస్ కంటె పురాతనమైనదీ, మన దేశీయమైనది అయిన కుల వివక్ష అణగారిన వారిపై పంజా విసురుతున్నది. గత వారం రోజులుగా దళితులపై అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు కనీసం మూడు జరిగాయి. ఈ మూడూ వివిధ రంగాలలో ప్రభుత్వ వైఫల్యాన్ని లేదా అధికారపక్ష ప్రమేయాన్నీ సూచించేవే. 


సుమారు పదిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఒక దళిత బాలికను అసాంఘిక శక్తులు నిర్బంధించి, సామూహిక అత్యాచారం జరిపారు. నిందితులెవరో సులువుగా తెలిసే అవకాశమున్నా, పోలీసులు తీవ్రమయిన అలక్ష్యం ప్రదర్శించారు. జులై 20 వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం పోలీసు స్టేషన్లో ఒక దళిత యువకుడిని పోలీసులు తీవ్రంగా హింసించి, శిరోముండనం చేశారు. జులై 18 శనివారం నాడు ప్రకాశం జిల్లాలో ఒక దళిత యువకునిపై పోలీసులు దౌర్జన్యం చేస్తే, బాధితుడు నాలుగురోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది గత మంగళవారం నాడు మరణించాడు. మూడు సంఘటనల్లోనూ పోలీసుల ప్రమేయం ఉన్నది. ఒక దానిలో అధికారపార్టీ నాయకుడి పాత్ర, ఇసుక మాఫియా నేపథ్యం కూడా ఉన్నాయి.


పదో తరగతి చదువుకున్న బాలిక, ఏదైనా చిరుద్యోగం చేసి తల్లికి ఆర్థికంగా సాయపడాలని భావించి, ఒక మహిళ సాయం కోరితే, మత్తుమందులకు బానిసైన ఆ స్త్రీ బాలికను బ్లేడ్ బ్యాచ్ అనే ఘనమైన పేరున్న దుండగులకు అప్పగించింది. జులై 12 వ తేదీన బాధిత బాలిక అదృశ్యంకాగా, 16 వ తేదీన అపస్మారక స్థితిలో ఆమెను పోలీసులు కనుగొన్నారు. కొనవూపిరితో మిగిలి, ఆస్పత్రిలో చేరినందున ప్రాణంతో ఉన్నది కానీ, ఈ సంఘటనకు నిర్భయ, దిశ సంఘటనలకు ఏ తేడా లేదు. చివరకు నిందితులందరినీ అరెస్టు చేసినా, దర్యాప్తులో మాత్రం అలసత్వం కనిపించింది. ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా తీసుకోవలసిన చర్యల విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి కానీ, స్థానిక యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి స్పందనా లేదు. 


కరోనా వచ్చి కులాన్ని మతాన్ని రద్దు చేసింది, ప్రాణభయం తెచ్చి అందరినీ సమానం చేసింది- అని మాట్లాడేవారు, ప్రకాశం జిల్లా సంఘటనకు ఏమి వివరణ చెబుతారో? వేటపాలెం మండలంలోని ఒక చెక్ పోస్టు వద్ద, బైక్ మీద వస్తున్న ఇద్దరు యువకులను మాస్కు పెట్టుకోలేదనే కారణంతో పోలీసులు అడ్డగించి, ప్రశ్నించారు. ఆ క్రమంలో వాగ్వాదం జరిగింది. తరువాత ఆ ఇద్దరిని స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు తీవ్రంగా హింసించారు. అందులో ఒకరు నాలుగు రోజుల పాటు చికిత్స పొంది మరణించాడు. అమెరికాలో జరిగిన జార్జి ఫ్లాయిడ్ సంఘటనకు దీనికి తేడా ఏమిటి? దళితుడు, పలుకుబడి లేనివాడూ కాక, మరెవరైనా అయితే పోలీసులు అట్లా కొట్టి చంపగలరా? మాస్కులు ధరించాలనే ఆరోగ్య నిబంధనలో కూడా పోలీసులు లాఠీ ప్రతాపాలు చూపించాలా? ఏ అంశంలో అయినా అధికారం ఒకే భాషను మాట్లాడుతుంది, డబ్బు భాషను, కులం భాషను, మతం భాషను. తాము కొట్టలేదని పోలీసులు బుకాయిస్తున్నారు, ముఖ్యమంత్రి పదిలక్షల పరిహారంతో సరిపెట్టుకోమంటున్నారు. బాధ్యులైన వారందరిపై కేసులు పెట్టాలని, పరిహారం పెంచాలని, పూర్తి న్యాయం చేయాలని దళిత సంఘాలు, నేతలు కోరుతున్నారు.


సీతానగరంలో జరిగిన శిరోముండనం రాజకీయ నేతల మెప్పు కోసం పోలీసు అధికారుల నీచ ప్రయత్నంగా చెప్పుకోవాలి. రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగింది, అదే దారిలో ఒక పెద్ద మనిషి కారులో వస్తున్నాడు, అతనికి వెంటనే దారి దొరకలేదు. వాగ్వాదం జరిగింది. ఒక దళిత యువకుడికి కారు తలుపు తగిలి గాయమైంది. కోపంతో అతను అద్దం పగులగొట్టాడు. ఇది సర్దిచెప్పి సర్దుకుపోవలసిన సంఘటన. పోలీసులు కూడా దాన్ని అట్లాగే పరిష్కరించాలి. పెద్దమనిషి అధికారపార్టీ వ్యక్తి కావడంతో అతని అహం దెబ్బతిన్నది. గొడవపడింది దళితుడు కావడంతో, కులాహంకారం కూడా బుసలు కొట్టింది. గుండు కొట్టిస్తానని శపథం చేశాడు. జీ హుజూర్ అంటూ పోలీసులు ఆ పని నెరవేర్చారు. అంతే కాదు, ఆ యువకుడిని చిత్రహింసల పాలుచేశారు. వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నదో నగ్నంగా ప్రదర్శించిన సంఘటన ఇది. ఆ చోటా నేతకు ఎంత ధైర్యం, ఆ పోలీసుకు ఎంత కావరం? వ్యవస్థ ఆశీర్వాదం లేకపోతే, ఇది సహజమే అనుకునే ఏలికలు లేకపోతే, ఇది ఇట్లా జరుగుతుందా? ఇంత జరిగాక కూడా ఒక ఎస్సై, ఇద్దరు పోలీసుల మీద మాత్రమే కేసు పెట్టారు. ఎగువ అధికారులపై కానీ, ఆ రాజకీయనేతపై కానీ కేసులు పెట్టలేదు. పరిహారాలు మాత్రమే న్యాయం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. అధికారులపై చర్య తీసుకోకపోతే, యంత్రాంగం ఎట్లా పశ్చాత్తాపపడుతుంది? 


కరోనా విధుల్లో ఉన్నవారికి తగిన రక్షణ సాధనాలు లేవన్నందుకు క్రమశిక్షణాచర్యను, ఆ తరువాత పోలీసుల చేతిలో నడివీధిలో అవమానాన్ని అనుభవించిన డాక్టర్ సుధాకర్, అధికారపార్టీ వారు తనపై దాడిచేశారని మొరపెట్టుకున్న మేజిస్ట్రేట్ రామకృష్ణ, అధికారపార్టీ నేతలు తనతో అగౌరవంగా వ్యవహరించారని ఫిర్యాదు చేసిన డాక్టర్ అనితారాణి దళితులే. కాబట్టి, జరుగుతున్న సంఘటనలు చెదురుమదురుగా జరుగుతున్నవి కావు. రాష్ట్రంలో రాజకీయంగా, పాలనాపరంగా నెలకొని ఉన్న వాతావరణంలో సహజసిద్ధంగా జరుగుతూ వస్తున్న సంఘటనలు ఇవి. అధికారపార్టీలో ఉన్న దళిత నేతలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ నాయకత్వాన్ని నిలదీయాలి. ఇరవయ్యేళ్ల కిందట, శిరోముండనం చేసి అపఖ్యాతి పాలయిన తోట త్రిమూర్తులును కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ స్వీకరించింది, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైసిపి తీసుకున్నది. దళితులపై అఘాయిత్యాలను నిరోధించాలంటే సూత్రబద్ధమైన వైఖరి ఉండాలి. దోషులకు రాజకీయంగా ఆశ్రయం దొరకకుండా చేయగలగాలి. అందుకు పెద్ద ఉద్యమమే అవసరం.

Advertisement
Advertisement
Advertisement