Abn logo
Jan 13 2021 @ 02:30AM

బీజేపీ నేతలపై లాఠీచార్జ్‌

జనగామ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

వివేకానందుని ఫ్లెక్సీల తొలగింపుతో వివాదం

ఆ పోలీసులను సస్పెండ్‌ చేయాలి: బండి సంజయ్‌ 

ఉన్నత విద్య నిర్లక్ష్యంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

గవర్నర్‌ తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు


జనగామ టౌన్‌/భీమదేవరపల్లి/హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు జనగామ జిల్లాలో వివాదాస్పదమైంది. మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ముందు కాషాయ కార్యకర్తలు ధర్నాకు దిగడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో లాఠీచార్జ్‌ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. వివేకానందుని జన్మదినం సందర్భంగా మంగళవారం జనగామ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు వరకు బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మునిసిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు కమిషనర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కార్యకర్తలను కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు.


దీంతో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ఠాణాకు చేరుకుని ధర్నా చేశారు. కమిషనర్‌ క్షమాపణలు చెప్పడం, బీజేపీ నేతలపై ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జనగామలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులను 24 గంటల్లో సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిని సంజయ్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆయన ముల్కనూర్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. లాఠీచార్జ్‌లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించడానికి బుధవారం జనగామ వెళతానని తెలిపారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. లాఠీచార్జి ఘటనను ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఖండించారు. సీఐ మల్లేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఉన్నత విద్యను నీరుగారుస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని నీరు గారుస్తోందని, 14 విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్లలో ఒక్క ఖాళీ పోస్టు కూడా భర్తీచేయలేదని బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీలు టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థలుగా మారాయని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులు టీఆర్‌ఎస్‌ పల్లకి మోస్తున్నారని దుయ్యబట్టారు. మురళీధర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా, సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌ నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హైదర్‌నగర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట, ఘాన్సీగూడ తదితర ప్రాంతాల్లో సీఎం బంధువులు పోలీసులను అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాలు సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement
Advertisement