సాగర్‌లో లాంచీ ప్రయాణం పునః ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-29T09:03:20+05:30 IST

పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జునసాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం నుంచి పునః ప్రారంభం

సాగర్‌లో లాంచీ ప్రయాణం పునః ప్రారంభం

నేటి నుంచి సాగర్‌-శ్రీశైలం మధ్య ప్రయాణం


నాగార్జున సాగర్‌, నవంబరు 28: పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జునసాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం నుంచి పునః ప్రారంభం కానుంది. 110 కి.మీ (ఆరు గంటల) మేర ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని మిగిల్చే ఈ ట్రిప్‌ను ఉదయం తొమ్మిది గంటలకు పర్యాటక శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. సాగర్‌ నుంచి 10 మంది పర్యాటకులతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు లాంచీ బయలుదేరుతుందని, మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలం నుంచి 50 మంది పర్యాటకులతో నాగార్జున సాగర్‌కు వస్తుందని అధికారులు వెల్లడించారు. 


లాంచీ ప్యాకేజీ వివరాలు.. 

సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం మొదటి ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను సాగర్‌కు తీసుకొస్తారు. సాగర్‌ నుంచి లాంచీలో శ్రీశైలం తీసుకెళ్లి, అక్కడ రాత్రి బస చేయిస్తారు. మరుసటి రోజు ఉదయం దైవ దర్శన అనంతరం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు బస్సులో తీసుకెళ్తారు. ఇందుకు పెద్దలకు రూ.3,999, పిల్లలకు రూ.3,399 (4-12 ఏళ్లు) టికెట్‌ నిర్ణయించారు. 

రెండో ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి పర్యాటకులను బస్సులో తీసుకొస్తారు. అక్కడ రాత్రి బస చేయించి మరుసటి రోజు ఉదయం దర్శనం అనంతరం లాంచీలో సాగర్‌కు తీసుకొస్తారు. ఇందుకు పెద్దలకు రూ.3,999, పిల్లలకు రూ.3,399 టికెట్‌ ధరను నిర్ణయించారు.            

మూడో ప్యాకేజీలో.. లాంచీలో సాగర్‌ నుంచి శ్రీశైలం తీసుకువెళ్లి అక్కడ రాత్రి బస చేయిస్తారు.  దర్శనం అనంతరం తిరిగి లాంచీలో సాగర్‌కు తీసుకొస్తారు. పెద్దలకు రూ.2,500 పిల్లలకు రూ.2,000 టికెట్‌ ధర.

నాలుగో ప్యాకేజీలో ఏదో ఒక వైపునకు(సాగర్‌ నుంచి శ్రీశైలం లేదా శ్రీశైలం నుంచి సాగర్‌కు) లాంచీలో తీసుకెళ్తారు. ఇందుకు 

పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1,200 టికెట్‌ 

ధర నిర్ణయించారు. 

Updated Date - 2021-11-29T09:03:20+05:30 IST