రీజనల్‌ రింగ్‌రోడ్డుకు ‘జీపీఎస్‌ మార్కింగ్‌’ షురూ

ABN , First Publish Date - 2022-01-18T05:47:22+05:30 IST

హైదరాబాద్‌కు చుట్టూ నిర్మించనున్న రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులు చకచకా సాగుతున్నాయి.

రీజనల్‌ రింగ్‌రోడ్డుకు ‘జీపీఎస్‌ మార్కింగ్‌’ షురూ
తూప్రాన్‌ వద్ద రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం ఏర్పాటు చేసిన హద్దురాయి

ప్రతి  ఐదు కిలోమీటర్లకు ఓ పాయింట్‌

పూర్తయితే సర్వే చేసేందుకు అవకాశం

తమ పొలాల్లో హద్దురాళ్లు పాతడంతో ఆందోళనలో రైతులు


 తూప్రాన్‌/తూప్రాన్‌రూరల్‌/శివ్వంపేట,జనవరి17: హైదరాబాద్‌కు చుట్టూ  నిర్మించనున్న రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులు చకచకా సాగుతున్నాయి. రీజనల్‌రింగ్‌ రోడ్డు నిర్మించే ప్రదేశాల్లో హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. హద్దురాళ్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలకు సోమవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం)తో అనుసంధానం చేస్తూ మార్కింగ్‌ చేస్తున్నారు. 

 ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అవల భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో 344 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. మొదటిదఫా ఉత్తర భాగంలో 158.46 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రీజనల్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌ను కేఎన్‌జే సంస్థ చేపట్టింది. నాలుగైదు డిజైన్లలో ఓ డిజైన్‌ను అలైన్‌మెంట్‌కు ఆమోదించారు.  ఈ మేరకు సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 20 మండలాల్లోని 111 గ్రామాల మీదుగా వెళ్లే రీజనల్‌ రింగ్‌రోడ్డుకు హద్దులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేఎన్‌జే సంస్థ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఉంటూ 20 రోజులుగా సర్వే పనులు నిర్వహిస్తున్నది. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించనున్న ప్రదేశాలను గుర్తిస్తూ ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ సిమెంట్‌ దిమ్మె ఏర్పాటు చేశారు. సిమెంట్‌ దిమ్మెలు ఏర్పాటు చేసిన ప్రదేశాలకు సోమవారం జీపీఎస్‌ మార్కింగ్‌ చేశారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డును గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా రూపొందించగా, ప్రస్తుతం శాటిలైట్‌కు అనుసంధానం చేస్తూ జీపీఎస్‌ మార్కింగ్‌ చేస్తున్నారు.   

 మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండలం ఎల్లారెడ్డిగూడ తండా, శివ్వంపేట మండలం లింగోజిగూడ, గుండ్లపల్లి-కొంతాన్‌పల్లి, తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌-నాగులపల్లి, గుండ్రెడ్డిపల్లిలో సిమెంట్‌ దిమ్మెలతో ఏర్పాటు చేసిన హద్దురాళ్ల ప్రదేశాలకు జీపీఎస్‌ మార్కింగ్‌ చేస్తూ శాటిలైట్‌కు అనుసంధానం చేస్తున్నారు. జీపీఎ్‌సతో శాటిలైట్‌ ఆధారంగా రోడ్డు మ్యాప్‌ తయారయ్యే వీలుంది. జీపీఎస్‌ మార్కింగ్‌ పూర్తవ్వగానే గ్రామాల్లో సర్వేనంబర్ల వారీగా వివరాలను తయారు చేయనున్నారు. రీజనల్‌రింగ్‌ రోడ్డు  గ్రామాలు, చెరువులు తగలకుండానే రూపొందిస్తున్నట్లు కేఎన్‌జే సంస్థ ప్రతినిధి వివరించారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ భూసేకరణకు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ తెలిపారు. 


రైతుల్లో ఆందోళన

 మార్కింగ్‌లో భాగంగా తమ భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎంతమేరకు భూములు పోతాయి. నష్టపరిహారం ఎంతిస్తారు అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక సాగుభూముల్లో  రింగురోడ్డుకు జీపీఎస్‌ హద్దుల ఏర్పాటు అంశం గ్రామాల్లో చర్చనీయాంశమైంది.


కొంతాన్‌పల్లి సమీపంలో..

 రీజనల్‌ రింగురోడ్డు భూసేకరణకు శివ్వంపేట మండల పరిధిలోని కొంతాన్‌పల్లి సమీపంలో శాటిలైట్‌ సర్వే పనులు చేపట్టారు. ఆధునిక యంత్ర పరికరాలతో రోడ్డు నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించిన వివరాలు సేకరిస్తు హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వే పనులను సర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌ సందర్శించి వివరాలు ఆరా తీయగా ఇంకా సర్వే పనులే కొనసాగుతున్నాయని పూర్తి నివేదిక తర్వాతనే భూ సేకరణపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-18T05:47:22+05:30 IST