Advertisement
Advertisement
Abn logo
Advertisement

686 కేంద్రాలకు ప్రారంభించింది 40 మాత్రమే

నెల రోజులైనా ఐకేపీల్లో ప్రారంభంకాని కొనుగోళ్లు

రైతులకు తప్పని ఎదురుచూపులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ):  వానాకాలం సీజన్‌లో ధాన్యం విక్ర యానికి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లుల వద్ద టోకెన్లు, వరికోత యంత్రాల కోసం ఇక్క ట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు దొడ్డు ధాన్యం కొనుగోలు కు ఐకే పీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు అధికారు లు ప్రకటించినా అది ఆచరణకు నోచుకోవడం లేదు. నెల రోజులు గా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి అరిగోసపడుతున్నారు. చలిలో ధాన్యం రాశులవద్ద వద్ద పడిగాపులుకాస్తున్నారు. వర్షం, మంచు నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు పట్టాల అద్దెలు భారమవుతున్నాయి. ధాన్యాన్ని ఉదయం ఆరబోయడం, రాత్రికి కుప్పపోసి పట్టాలు కప్పడం రైతులకు నిత్యకృత్యమైంది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 686 ప్రభుత్వ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని దసరా పండుగకు ముందే అధికారులు నిర్ణయించగా, ఇప్పటి వరకు 40 కేంద్రాలే ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో 199 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని, అధికారులు నిర్ణయించగా, మూడు చోట్లే 550 టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 247 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, 25 తెరుచుకున్నాయి. యాదాద్రి జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, 12 చోట్లే కొనుగోళ్లు ప్రారంభించారు. అధికారుల నిర్ణయంతో నెల రోజుల ముందే రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి ఆరబోశారు. అన్ని అనుమతులు ఉన్నా దీపావళి పండుగ అంటూ ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు జాప్యం చేశారు. తీరా పండుగ ముగిసినా నాన్చివేత ధోరణిని అవలంభిస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితమే రైతులు ధాన్యాన్ని తెచ్చి కేంద్రాల్లో రాశులుగా పోయగా, అదిగో ఇదిగో అంటూ అధికారులు హడావిడి తప్ప కొనుగోళ్లు ప్రారంభించింది లేదు. వచ్చిన రైతులకు సీరియల్‌ నంబర్లు ఇవ్వడానికే పరిమితమయ్యారు. కొనుగోళ్లు ప్రారంభిస్తారనే ఆశతో రైతులు ప్రతిరోజు ఉదయం వేళ ధాన్యాన్ని ఆరబోసి 17శాతం తేమ వచ్చే వరకు ఎండబెట్టడం రాత్రి వేళ కుప్పగా పోసి టార్పాలిన్లతో కప్పడం చేస్తున్నారు. నెల రోజులుగా ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలానే ఉంది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవడంతో రైతులు వరి కోసి పొలాల్లోనే కల్లాలు చేసి పట్టాలు కప్పి ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వర్షం, మంచు నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు లేవు. నిద్రించేందుకు వసతి లేదు. తాగునీటి సౌకర్యం సైతం కరువైంది. దీంతో రైతులు టార్పాలిన్లను అద్దెకు తెచ్చి ధాన్యం రాశులపై కప్పుతున్నారు. మాడ్గులపల్లి మండలంలో రైతులు 20రోజులుగా ధాన్యం తీసుకువస్తుండగా, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రంలో 70వేల బస్తాల ధాన్యం నిల్వ ఉంది.


యాదాద్రి జిల్లాలో 12 కేంద్రాలే..

యాద్రాది జిల్లాలోని రైతులు మూడు వారాల క్రితమే కోతలు కోసి, ధాన్యం విక్రయించేందుకు కల్లాల్లో సిద్ధంగా ఉంచారు. వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం రైతులు 15రోజులుగా నిరీక్షిస్తున్నారు. అక్టోబరు చివరి వారంలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ప్రారంభించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ పలు మండలాల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీయడంతో పాటు బహిష్కరిస్తున్నారు. అదేవిధంగా పలు పార్టీలు, రైతు సంఘాలు మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాగా, వారం రోజుల్లోగా అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 2.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 4లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు 240 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 138, మార్కెటింగ్‌శాఖ నాలుగు, ఐకేపీ సంఘాలతో 85కేంద్రాలు ఏర్పాటుచేయాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు 12కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. వీటిలో సైతం ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. 


సూర్యాపేటలో 25చోట్లే కొనుగోళ్లు

సూర్యాపేట జిల్లాలో గత సీజన్‌లో 347 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది 247 కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా, ఇప్పటి వరకు 25 కేంద్రాలు ప్రారంభించగా, ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలుచేయలేదు. పెద్ద మిల్లులన్నీ మిర్యాలగూడ చుట్టు పక్కల ఉన్నాయి. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల రైతులకు మిల్లులు అందుబాటులో లేకపోవడం, అధికారులు అందించే టోకెన్లు ఏ మాత్రం సరిపోకపోవడంతో స్థానిక రైతులు ఇబ్బందులుపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు సూర్యాపేట జిల్లా పరిధిలోని మండలాల్లో కల్లాల వద్దకే వచ్చి కాంటాలు వేసి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. క్వింటాకు రూ.1650 నుంచి రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారు. టోకెన్‌ బాధలు, మిల్లుల వద్ద పడిగాపులు, ట్రాక్టర్ల కిరాయిలు వీటన్నింటినీ భరించలేక రైతులు హైదరాబాద్‌, మంచిర్యాల ప్రాంతం నుంచి వస్తున్న వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.నెల రోజులుగా ఎదురుచూపులే : యాట యాదగిరిరెడ్డి, పానగల్‌, నల్లగొండ

నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశా. దసరా ముందే ధాన్యం తెచ్చి ఐకేపీ కేంద్రంలో పోశా. 425 సీరియల్‌ కేటాయించారు. ప్రతిరోజు పట్టాలకు రూ.300 అద్దె అవుతోంది. అధికారులు మాత్రం ఇప్పట్లో కొనుగోలు చేసేలా కన్పించడంలేదు. ఎమ్మెల్యే ఫోన్‌ చేస్తే అధికారులు కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది.పది రోజులుగా పడిగాపులు : షేక్‌ అక్బర్‌, అంగడిపేట, పీఏపల్లి మండలం 

పీఏసీఎస్‌ అధికారులు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి పది రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చి కుప్పగా పోశా. అయినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఆందోళనగా ఉంది. పట్టాల అద్దె పెరుగుతోంది. అంతేగాక దొంగల భయం. దీంతో రాశుల వద్ద చలికి కాపలా ఉండాల్సివస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి.ఇకనుంచి ప్రతీ రోజు టోకెన్లు

రూ.1800కు తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు

కలెక్టర్‌ పీజే.పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌

రైతులు టోకెన్ల కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతీరోజు పంపిణీ చేపట్టాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ఎస్పీ ఏవీ. రంగనాథ్‌తో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం సన్న ధాన్యానికే టోకెన్లు తీసుకోవాలని, దొడ్డు ధాన్యం ఐకేపీ కేంద్రా ల్లో విక్రయించాలన్నారు. ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాకు మూడు రోజులకు ఒకసారి 1800 టోకెన్లు ఇస్తుండగా, రైతుల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని ఇకనుంచి 2000 టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వచ్చే నాలుగైదు రోజుల తరువాత దీన్ని 2,400కు పెంచుతామన్నారు. ప్రస్తుతం మూడు ఎకరాలకు ఒక టోకెన్‌ ఇస్తున్నామని, 10 ఎకరాలున్న రైతుకు మూడు టోకెన్లు ఒకేసారి ఇస్తామన్నారు. అయితే ఆ టోకెన్లు వివిధ తేదీల్లో ఉంటాయన్నారు. జిల్లాలోని మిల్లుల సామర్థ్యం రోజుకు 2000 ట్రాక్టర్ల కాగా, 4000 ట్రాక్టర్ల వరకు వస్తున్నాయని, అందుకే టోకెన్ల వ్యవస్థ తెచ్చామన్నారు. ధాన్యం ఎలా ఉన్నా క్వింటాకు రూ.1800కు తక్కువ చెల్లిస్తే మిల్లర్లపై చట్టపర చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ హెచ్చరించారు. సన్నధాన్యాన్ని మిల్లర్లే కొనుగోలు చేస్తారని, అధికారులు కేవలం అనుసంధాన మాత్రమే చేస్తారన్నారు. ఇబ్బందులు లేకుండా ఉండేందుకే టోకెన్ల వ్యవస్థను తెచ్చామన్నారు. దొడ్డు ధాన్యం విక్రయించేందుకు జిల్లాలో 180 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్కడ విక్రయించేవారికి టోకెన్లు అవసరం లేదన్నా రు. ధాన్యం పూర్తిగా చేతికొచ్చి పొలంలో రాలిపోయే పరిస్థితి ఉన్న రైతులు టోకెన్‌ కోసం ఎదురుచూడాల్సిన పని లేదని, వారు నేరుగా మిల్లుల వద్దకు వస్తే పోలీస్‌ సిబ్బంది సర్దుబాటు చేసి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు.


విస్తీర్ణానికి అనుగుణంగా టోకెన్లు : కలెక్టర్‌

వేములపల్లి, మాడ్గులపల్లి: సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రైతులకు టోకెన్లు పంపిణీ చేయాలని వ్యవసాయాధికారులకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ సూచించారు. వేములపల్లి, మాడ్గులపల్లిలో రైతులకు టోకెన్ల పంపిణీని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండెకరాలలోపు ఉన్న రైతులకు ఒక టోకెన్‌, 2-4 ఎకరాలు ఉన్న రైతుకు రెండు, ఐదెకరాలకుపైగా సాగుచేసిన వారికి ఒకేసారి 3-4 టోకెన్లు ఇవ్వకుండా రోజుకు రెండు చొప్పున జారీచేయాలన్నారు. కాగా, ఎస్‌ఐ సమక్షంలో మిల్లర్లు ఒకరిద్దరు రైతులకే రూ.1800 చెల్లించి ఆ తరువాత ధర తగ్గిస్తున్నారని వేములపల్లి సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తేగా, పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో రోహిత్‌సింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, ఏడీఏ నాగమణి, తహసీల్దార్లు వెంకటేశం, అర్చన తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement