ఆయన ధైర్యం నింపుతాడు..

ABN , First Publish Date - 2020-08-02T17:54:41+05:30 IST

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మన టీవీల్లో ప్రతి రోజూ సాయంత్రం ఒక ముఖం కనిపిస్తుంది. టీవీల్లో వార్తలు చూస్తున్న ప్రేక్షకుల ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది కానీ.. సమాచారం ప్రకటిస్తున్న...

ఆయన ధైర్యం నింపుతాడు..

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మన టీవీల్లో ప్రతి రోజూ సాయంత్రం ఒక ముఖం కనిపిస్తుంది. టీవీల్లో వార్తలు చూస్తున్న ప్రేక్షకుల ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది కానీ.. సమాచారం ప్రకటిస్తున్న ఆయన ముఖంలో ఏ మాత్రం అధైర్యం కనిపించదు. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సంయుక్త కార్యదర్శిగా చేస్తున్న ఆయనే లవ్‌ అగర్వాల్‌.. కరోనా సమయంలో స్పోక్స్‌పర్సన్‌గా పేరుతెచ్చుకున్నారు..


దేశంలో సంక్షోభం వచ్చినప్పుడల్లా కొందరు అధికారులే ప్రసారమాధ్యమాల్లో గుర్తింపు పొందుతారు. బాధ్యతల్లో భాగంగా ఎక్కువసార్లు మాట్లాడే అవకాశం కొందరికే వస్తుంది. అందులో ఐఏఎస్‌ ఆఫీసర్‌ లవ్‌అగర్వాల్‌ ఒకరు. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఆయన కరోనా సంక్షోభంలో మరింత ప్రాచుర్యం పొందాడు. కార్గిల్‌యుద్ధ సమయంలో కల్నల్‌ బిక్రమ్‌సింగ్‌, 2001-2లో భారత్‌, పాక్‌ల మధ్య నెలకొన్న అశాంతి వాతావరణం అప్పుడు నిరుపమారావు ఇలాంటి పాత్రే పోషించారు. నేటి కరోనా సమయంలో లవ్‌అగర్వాల్‌ అలా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. 


దేశమంతా వణికిపోతోంది? ఒక రకంగా యుద్ధ వాతావరణం. ఇలాంటి సమయంలో పొరపాటున నోరు జారినా, విలేకరుల ప్రశ్నల తాకిడికి నిగ్రహం కోల్పోయినా.. కొంపలు ఆరిపోతాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఏ చిన్నపొరపాటు మాట్లాడినా పెద్ద వార్త అవుతుంది. అందుకే నింపాదిగా, స్పష్టంగా, పక్కా సమాచారాన్ని మాత్రమే ప్రజలకు అందించే అధికారి అవసరం. కేంద్రప్రభుత్వం కరోనా నిరంతర సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను ఐఏఎస్‌ అధికారి లవ్‌ అగర్వాల్‌కు అప్పగించింది. కేంద్రంలో ఆయనిప్పుడు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సంయుక్త కార్యదర్శి. మన దేశంలో కరోనా తీవ్రత మొదలైనప్పటి నుంచీ ప్రతి రోజు సాయంత్రం టీవీల్లో దర్శనమిస్తున్నారు అగర్వాల్‌. ప్రజలంతా భయంతో.. గందరగోళంలో ఉన్నప్పటికీ.. ఆయన ముఖంలో ఎక్కడా ఆ భావోద్వేగాలు కనిపించవు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనిపిస్తుందో.. అంత సీరియస్‌గా సమాచారాన్ని అందిస్తాడు.


తండ్రి ఆడిటర్‌..

లవ్‌ అగర్వాల్‌ సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌. ఆయన తండ్రి ఆడిటర్‌. కొడుకు గురించి ఏమంటాడంటే.. ‘మా ఊరి వాళ్లందరికీ నేను ఆడిటర్‌గా సుపరిచితం. ఎందుకంటే నలభై ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నాను. అయితే ఈ మధ్య నేను రోడ్డు మీద వెళుతుంటే.. ఆయనే లవ్‌ అగర్వాల్‌ తండ్రి అంటున్నారందరూ. ఆశ్చర్యం వేస్తోంది. ఒకింత గర్వంగాను ఉంది..’ అని పేర్కొన్నారాయన. మొదట్లో అగర్వాల్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారి కావాలనుకోలేదు. తండ్రిలాగే సీఏ చేయాలనుకున్నాడు. రోజూ నాన్న ఆఫీసుకు వెళ్లేవాడు. అయితే ఎందుకో ఆ పన్నుల అంకెలు చూసి పరేషాన్‌ అయ్యాడు. ఆ వృత్తి నచ్చలేదు. ఒక రోజు.. ‘పాపా నేను ఐఐటీ ప్రవేశ పరీక్ష రాస్తాను. సీఏ అవ్వాలని లేదు..’ అని తేల్చేశాడు. అప్పుడు వాళ్ల నాన్న .. ‘అదంత సులభం కాదు బిడ్డా..’ అని చెప్పాడు. ‘ఒక అవకాశం ఇచ్చిచూడు. ప్రయత్నిస్తా. సీటు రాకపోతే అప్పుడు సీఏ గురించి ఆలోచిస్తా..’నన్నాడు అగర్వాల్‌. 


ఐఐటీ చదివి..

తొలి ప్రయత్నంలోనే ఢిల్లీలోని ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. అక్కడందరికీ బుద్ధిమంతుడైన విద్యార్థి. అప్పటి కొలీగ్స్‌ను కదిపితే.. ‘మాతోపాటు అగర్వాల్‌ కూడా ఐఐటీ-డి హాస్టల్‌లో ఉండేవాడు. అతనికి ఎప్పుడూ చదువు, పరీక్షలు, మార్కులు.. ఇవే లోకం. కాస్త మెతక మనిషి, సరదా బుల్లోడు. అయితే, డిసిప్లిన్‌ మాత్రం తగ్గేవాడు కాదు. నీలంరంగు కవాసాకీ బైకు మీద తిరిగేవాడు. మా బ్యాచ్‌లో ఆ బైక్‌ను వాడనోడు లేడు..’ అంటూ కాలేజీ తీపి గురుతులను నెమరువేసుకున్నారు అగర్వాల్‌ బ్యాచ్‌మేట్స్‌. ఢిల్లీలో చదువు పూర్తవుతూనే విదేశాల్లో చదవాలనుకున్నాడు. అప్పుడు వాళ్ల నాన్న వద్దని వారించి.. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వమన్నాడు. 


ఆంధ్ర క్యాడెర్‌..

సివిల్స్‌ పరీక్షలు రాశాడు. రెండుసార్లు ఎంపిక కాలేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా రాలేదు. మూడోసారి (1996) జాతీయస్థాయిలో ఇరవై ఒకటో ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ కింద హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో పనిచేశాడాయన. విద్య, వైద్యశాఖలను సమర్థవంతంగా నిర్వహించడంతో పేరొచ్చింది. ఆ తరువాత ఉద్యోగరీత్యా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో చేరాడు. గ్లోబల్‌హెల్త్‌, టెక్నాలజీ, మెంటల్‌హెల్త్‌, పబ్లిక్‌హెల్త్‌.. ఇలా రకరకాల పోర్టుపోలియోల బాధ్యతను చూశాడు అగర్వాల్‌. పనిలో నిక్కచ్చిగా ఉండటం, వివాదరహితంగా పాలన సాగించడం, ప్రభుత్వం పట్ల విధేయతతో మెలగడం.. ఒకరకంగా విశ్వసనీయమైన అధికారిగా పేరుతెచ్చుకున్నాడు. బాధ్యతల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేశాడు. కరోనా ప్రారంభంలో విమానాశ్రయాల్లో పరీక్షలు, క్వారంటైన్‌ ప్రక్రియల పర్యవేక్షణ చక్కగా నిర్వహిం చాడు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని కోవిడ్‌ స్పోక్స్‌పర్సన్‌గా నియమించింది.


కరోనా సంక్షోభంలో ఏ పొరపాటుకు తావివ్వకూడదు.ముందుగా ఆ శాఖ నిర్ధారించిన సమాచారాన్నే ప్రకటించాలి. రోజూ ప్రెస్‌మీట్‌లలో కనిపించే లవ్‌ అగర్వాల్‌.. ఆ జాగ్రత్తలన్నీ తూచ తప్పక పాటిస్తాడు. కరోనా తీవ్రత పెరిగేకొద్దీ .. ఆయన మాటల్లో ఎలాంటి ఆందోళన తొంగిచూడదు. నిన్నటి లాగే ఈ రోజు.. ఈ రోజు లాగే రేపు కనిపిస్తాడు. అదే నిలకడ, అంతే ప్రశాంతత ఆయన కళ్లలో కనిపిస్తుంది. ఇంతగందరగోళ పరిస్థితుల్లో, ఆపత్కాలంలో దేశానికి ధైర్యాన్నిస్తూ.. అధికారుల్ని ఏకతాటిమీద నడిపించడం, విలువైన సమాచారాన్ని మీడియాకు అందించడం.. లవ్‌ అగర్వాల్‌కే చెల్లింది. కరోనా సంక్షోభంలో గుర్తుంచుకోదగ్గ సివిల్‌సర్వెంట్‌. 

Updated Date - 2020-08-02T17:54:41+05:30 IST