Abn logo
Nov 28 2020 @ 01:29AM

ప్రమాదంలో న్యాయవాదం

కేసుల్లో వాదనలు విన్పించే సమయంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు అనేకం ప్రస్తావించి, పరిశీలన కోసం సమర్పించవలసి వస్తుంది. న్యాయవాదులు భౌతికంగా వాదించేటప్పుడు సమర్పించిన తీర్పులు చూడకుండా మరుసటి రోజే తీర్పులు చెప్పడం పలువురు న్యాయమూర్తులకు పరిపాటి. అలాంటిది వీడియోకి అప్‌లోడ్‌ చేసిన తీర్పుల్ని డౌన్‌లోడ్‌ చేసుకొని పరిశీలిస్తారా?


కొవిడ్ విపత్తు కారణంగా న్యాయస్థానాలు కొన్ని నెలలపాటు మూతపడ్డాయి. ఆ తర్వాత ‘ఈ- ఫైలింగ్‌’ ద్వారా కేసులు దాఖలు చేయడానికి, వాట్సాప్‌ల్లో, టెలికాన్ఫరెన్స్‌ ద్వారా అత్యవసర కేసులు వినటానికి అవకాశం కల్పించి ఆయా కేసులు పరిష్కరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు స్థాయి నుంచి జిల్లా కోర్టుల వరకు ఈ విధానం సాగింది. అనివార్యమైన స్థితిలో అవలంబించిన పనిలో మంచిని పరిగ్రహించి ఉపయోగపడని విషయాల్ని పరిత్యజించటం సముచితం. 


రాజ్యసభ సభ్యుడు భూపేందర్‌ యాదవ్‌ (బీజేపీ) నేతృత్వంలో ఒక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని ప్రభుత్వం నియమించి న్యాయవ్యవస్థలో తీసుకోవలసిన చర్యలను సూచించవలసిందిగా కోరింది. ఈ కమిటీ గత సెప్టెంబర్‌ 11న తన నివేదికను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి సమర్పించింది. కొవిడ్‌–19 నెమ్మదించి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత కూడా ‘ఈ- వీడియో’ ద్వారా కేసులు వాదించే పద్ధతిని కొనసాగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. దాన్ని ‘చాలా చౌకగాను, త్వరితగతిన న్యాయం లభించే పద్ధతిగాను’ అభివర్ణించింది. న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న చాలా మందిని సంప్రదించి ఈ సిఫారసు చేసినట్లు ఆ కమిటీ చెప్పుకుంది. కానీ, ఇందులో ఏమాత్రం నిజం లేదు. అన్ని రాష్ట్రాలలోనూ న్యాయవిద్యనూ, న్యాయవాద వృత్తిని నియంత్రించే బార్‌ కౌన్సిల్స్‌ ఉన్నాయి. వీటన్నిటిపైనా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఉంది. నాకు తెలిసినంతవరకు వీటిలో దేనితోనూ ఆ కమిటి చర్చించిందీ లేదు, ఎవరి అభిప్రాయాలూ సేకరించిందీ లేదు. మన దేశంలో ఎంతోమంది న్యాయకోవిదులైన విశ్రాంత న్యాయమూర్తులూ, న్యాయవాదులూ ఉన్నారు. వీరితో సమానమైన చట్టపరిజ్ఞానం ఉన్న మేధావులూ, పాత్రికేయులూ, రాజకీయవేత్తలూ ఉన్నారు. వీరిలో ఎవరినీ సంప్రదించిన దాఖలాలు లేవు. చాలామంది అభిప్రాయాలు సేకరించి చేశామని చెప్పుకుంటూ ఏకపక్షంగా ఈ సిఫారసులు చేయటం పెద్ద ఫార్సు. ఈ రకమైన దృశ్యమానమైన, భౌతికేతరమైన వ్యవస్థ చాలా చౌక అయినదే కాక సమయం వృథా కానీయదని ఆ కమిటీ పేర్కొంది. justice hurried justice burried అనేది నిరూపితమైన ఉపమానం. ప్రత్యక్షంగా, బహిరంగ కోర్టు హాలులో వాదనలు వినిపించే సమయంలో న్యాయమూర్తుల మూడ్‌ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వాదనలు విన్పించడమో, వాయిదాలు కోరడమో చేస్తుంటారు. మన న్యాయపాలనా విధానం అంత శాస్త్రీయమైనది కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో అమలులో ఉన్న న్యాయస్థానాల పనివిధానం శాస్త్రీయం కాదు. న్యాయమూర్తుల వ్యక్తిగత విచక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితుల్లో న్యాయమూర్తుల కవళికలకు, కదలికలకు అనుగుణంగా నడుచుకోవడం కక్షిదారుడి ప్రయోజనం కాపాడే న్యాయవాది బాధ్యత.


కేసుల్లో వాదనలు విన్పించే సమయంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు అనేకం ప్రస్తావించి, పరిశీలన కోసం సమర్పించవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అవన్నీ అప్‌లోడ్‌ చేయటం, వాటిని న్యాయమూర్తి పరిశీలించటం ఆచరణ సాధ్యం కాదు. న్యాయవాదులు భౌతికంగా వాదించేప్పుడు సమర్పించిన తీర్పులు చూడకుండా, వాటిని ఉటంకించకుండా మరుసటి రోజే తీర్పులు చెప్పి, న్యాయవాదులు ఇచ్చిన పుస్తకాల మూటను ముడి విప్పకుండా తిరిగి పంపించే న్యాయమూర్తుల్ని అనేక మందిని చూసిన సందర్భాలున్నాయి. ఇక వీడియోకి అప్‌లోడ్‌ చేసిన తీర్పుల్ని డౌన్‌లోడ్‌ చేసుకొని పరిశీలిస్తారా అనేది సందేహాస్పదమే.


కొవిడ్‌ కాలంలో అనుసరించిన పద్ధతిని ముందుగా నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ కేసులు, టెలికం డిస్‌ప్యూట్స్‌ సెటిల్‌మెంట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ లాటి కోర్టులతో ప్రారంభించి, తర్వాత నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్టు కేసులు (చెక్‌ బౌన్సులాటివి), మోటార్‌ వెహికిల్‌ చట్టం కింద నమోదైన కేసులు, భూసేకరణలో భూములు కోల్పోయిన వారు వేసే కేసులు, భార్యాభర్తల మధ్య నడిచే మనోవర్తి, విడాకులు, పిల్లల సంరక్షణ కోసం వేసే కేసులకు విస్తరింపచేసి, కాలక్రమంలో అన్ని రకాల ట్రయల్‌ కేసులకు వర్తింపజేయాలని భూపేందర్‌ యాదవ్‌ కమిటీ సిఫారసు చేసింది. పైకి బాగుందని కన్పించే ఈ విధానం వెనుక కార్పోరేట్‌ లా కంపెనీల గుత్తాధిపత్యానికి మార్గం పరిచే కుట్ర దాగుంది. పెద్ద పెద్ద న్యాయవాద సంస్థలు దేశంలో ఎక్కడినుంచైనా కేసులు చేపట్టి వాదించగలుగుతాయి. కాలక్రమంలో చట్టపరిజ్ఞానంలో నిష్ణాతులైన న్యాయవాదులు ఈ సంస్థలల్లో ఉద్యోగులుగా మారటం అనివార్యం.


సమగ్ర చట్ట పరిజ్ఞానం ఉండీ, ఎంత తెలివిగల న్యాయవాది అయినా ప్ర‍స్తుత కాలంలో కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోతే నిరక్షరాస్యుడి కిందే లెక్క. సుమారు 2 వేల మంది సభ్యులున్న గుంటూరు న్యాయవాదుల సంఘంలో లాప్‌టాప్‌ ఉన్నవారు 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. స్మార్టుఫోనులున్నా ఇన్‌కమింగ్‌ కాల్‌కి సమాధానం ఇవ్వటం, అవుట్‌ గోయింగ్‌ కాల్‌ చేసుకోవటం తప్ప మూడో యాప్‌ తెలియని న్యాయవాదులు సగం మంది ఉంటారు. భూపేందర్ యాదవ్ కమిటీ లెక్కల ప్రకారమే దేశంలో 3477 కోర్టులకే ‘ఈ- వీడియో’ సమావేశ సౌకర్యాలు ఉన్నాయి. మరో 14,443 కోర్టులకు ఈ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అలాగే 3240 కోర్టులను 1275 జైళ్ళతో అనుసంధానం చేయాల్సి ఉంది. 


ఇక కేసుల ట్రయల్‌ విషయానికి వస్తే వర్చువల్‌గా వీటిని నడపటం అసాధ్యం. సాక్షి వాంగ్మూలం నమోదు చేస్తున్న సమయంలో సాక్షి ప్రవర్తన, కవళికలు, తత్తరపాటు ఇవన్నీ న్యాయమూర్తిని ప్రభావితం చేస్తాయి. కేవలం సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మరణశిక్షలు కూడా విధించే అశాస్త్రీయ విధానంలో భౌతికంగా ఈ తతంగం జరపకపోతే కలిగే నష్టాలు అనంతం. రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ళను, స్ధానిక బార్‌ అసోసియేషన్లను నిర్వీర్యం చేసి, వాటి అస్థిత్వాన్ని కాలక్రమంలో రూపుమాపటానికి భూపేందర్‌ కమిటీ సిఫారసులు దోహదం చేస్తాయి.


చెరుకూరి సత్యనారాయణ

మాజీ సభ్యులు, ఏపి బార్‌ కౌన్సిల్‌


Advertisement
Advertisement
Advertisement