గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్

ABN , First Publish Date - 2022-01-19T18:32:15+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్‌ పేరును ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ..

గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్

పనజి: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్‌ పేరును ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు ప్రకటించారు. ఓబీసీ భండారి సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాజిక కార్యకర్త కూడా. గోవా జనాభాలో 35 శాతం మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. గోవా హెరిటేజ్ స్థలంలో అక్రమ కట్టడం నిర్మాణానికి వ్యతిరేకంగా ఇటీవల నిరాహార దీక్షకు దిగడం ద్వారా ఒక్కసారిగా పాలేకర్ పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన ఆప్‌లో చేరారు. ఆప్ సీఎం అభ్యర్థిగా ఆయన పేరును పనజిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.


పాలేకర్ పేరును ప్రకటించడానికి ముందు ఆప్ సీఎం అభ్యర్థిగా నిజాయితీ కలిగిన వ్యక్తిని ఎంపిక చేశామని, సామాజిక కార్యకర్యక్రమాల ద్వారా ఆయన చిరపరిచితుడని కేజ్రీవాల్ తెలిపారు. గోవా జనాభాలో 35 శాతం భండారీ సామాజిక వర్గం ఉన్నప్పటికీ రవి నాయక్ ఒకరే ముఖ్యమంత్రి అయ్యారని, అదికూడా రెండున్నరేళ్లు మాత్రమేనని అన్నారు. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలను కేజ్రీవాల్ ఈ సందర్భంగా తిప్పికొడుతూ, ఇంతవరకూ కులపరంగా జరిగిన తప్పిదాలను సరిచేస్తున్నామని చెప్పారు. 


Updated Date - 2022-01-19T18:32:15+05:30 IST