కోల్‌కత్తా హైకోర్టు జడ్జికి లాయర్ కరోనా శాపం..!

ABN , First Publish Date - 2020-04-07T23:44:22+05:30 IST

కోల్‌కత్తా హైకోర్టులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి తనకు అనుకూలంగా...

కోల్‌కత్తా హైకోర్టు జడ్జికి లాయర్ కరోనా శాపం..!

కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి తనకు అనుకూలంగా తీర్పునివ్వలేదనే అక్కసుతో ఓ న్యాయవాది ఏకంగా న్యాయమూర్తికే కరోనా రావాలని శపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యాయవాది బిజోయ్, బ్యాంకుకు లోన్ చెల్లించని వ్యవహారంలో ఓ పిటిషనర్ తరపున కేసు వాదిస్తున్నాడు. లోన్ చెల్లించకపోవడంతో పిటిషనర్ బస్సును జనవరి 15న సదరు బ్యాంకు వేలం వేసింది. అయితే.. బ్యాంకు నిర్ణయంపై సదరు వ్యక్తి కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ తరపున కేసు వాదించేందుకు బిజోయ్ రంగంలోకి దిగాడు. అయితే.. కరోనా వైరస్ నేపథ్యంలో మరీ అత్యవసర కేసులపై మాత్రమే విచారణ జరపాలని కోల్‌కత్తా హైకోర్టు నిర్ణయించింది. మార్చి 15 నుంచి కోర్టు ఇదే పద్ధతిని అనుసరిస్తోంది.


మార్చి 25 నుంచి సదరు పిటిషనర్ వేసిన తరహా పిటిషన్‌లపై వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో జస్టిస్ దీపంకర్ దత్తా వాదనలు విన్నారు. వాదనలు విన్న అనంతరం.. అత్యవసర విచారణ చేపట్టాలన్న బిజోయ్ వినతిని న్యాయమూర్తి దత్తా తిరస్కరించారు. కోపంతో ఊగిపోయిన బిజోయ్ మైక్రో‌ఫోన్‌ను విసిరికొట్టి.. ఎదురుగా ఉన్న బల్లను చరిచి.. మీకు కరోనా సోకుతుందని జడ్జిని శపించాడు. బిజోయ్ ప్రవర్తనతో జడ్జి కంగుతిన్నారు. కోర్టు ధిక్కారం కింద సదరు న్యాయవాదిపై చర్యలకు న్యాయమూర్తి ఆదేశించారు.

Updated Date - 2020-04-07T23:44:22+05:30 IST